Ram Mandir: రామసేతు ప్రారంభమైన చోట ప్రధాని ప్రత్యేక పూజలు, ధనుష్‌కొడిలో కాసేపు గడిపిన మోదీ
Ram Mandir Inauguration: ధనుష్‌కొడిలో రామసేతు ప్రారంభమైన చోట ప్రధాని నరేంద్ర మోదీ పూజలు నిర్వహించారు.
Ram Mandir Opening: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు ముందు అనుష్ఠాన దీక్ష చేపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ప్రముఖ రామాలయాలను సందర్శిస్తున్నారు. రామాయణానికి సంబంధం ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులోని ధనుష్‌కొడి వద్ద ఉన్న అరిచల్ మునయ్ (Arichal Munai)కి చేరుకున్నారు. అక్కడే రామ సేతు నిర్మించారని విశ్వాసం. ఇక్కడి నుంచే రామసేతుని నిర్మించి లంకకు చేరుకున్నారని నమ్ముతారు. అందుకే..ఇక్కడే చాలా సేపు గడిపారు ప్రధాని మోదీ. పూలు సమర్పించి పూజలు నిర్వహించారు. ధనుష్‌కొడిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్నీ సందర్శించారు. అక్కడా ప్రత్యేక పూజలు చేశారు. ఆయన సందర్శించిన నాలుగో రామాలయం ఇది. ధనుష్‌కొడి వద్దే రావణుని సంహరిస్తానని రాముడు శపథం చేశాడు. ఇక్కడి నుంచే ఆయన లంకకు చేరుకున్నాడు. ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, స్ఫూర్తిని ఈ ధనుష్‌కొడి ప్రాంతం ఇస్తుందని ప్రధాని మోదీ బలంగా విశ్వసిస్తారు. అందుకే..ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి సముద్ర తీరంలో కాసేపు గడిపారు. రాముడిని తలుచుకుంటూ ధ్యానం చేసుకున్నారు.
Tamil Nadu: Prime Minister Narendra Modi is at Arichal Munai point, which is the place from where Ram Setu starts.
— ANI (@ANI) January 21, 2024
PM is also visiting Dhanushkodi, which is where Bhagwan Ram took the vow to defeat Ravana. This holy soil from where he proceeded to Lanka, is a symbol of Bharat’s… pic.twitter.com/AzSV1FfRKB
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను ప్రధాని మోదీ సందర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం (Veera Bhadra Temple), మహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్ కాలారామ్ దేవాలయం (Kalaram Temple), కేరళ గురువాయుర్ (Guruvayur) ఆలయం, త్రిప్రయార్ రామస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథస్వామి, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. రామేశ్వరంలో రామనాథస్వామిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం ఆచరించారు. సంప్రదాయ దుస్తులు, రుద్రాక్ష ధరించి పుణ్యస్నానం చేశారు. ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మోదీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలోని ఏనుగు వద్దకు వెళ్లి...ప్రేమతో తొండాన్ని నిమిరారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. అగ్నితీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. ఈ 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ దివ్యమైన.. మంగళమైన ముహూర్తం అని భక్తులు భావిస్తున్నారు. 12వేల మంది పోలీసులు, 10 వేల సీసీ కెమెరాలతో అయోధ్యలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రదాన మంత్రి భద్రతా సిబ్బంది...అయోధ్య రామాలయం పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది.
Also Read: Ram Mandir News: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట, దుష్ప్రచారం చేయవద్దంటూ కేంద్రం వార్నింగ్!