Ant Invasion Forces: పగబట్టిన చీమల దండయాత్ర- పిల్లలు హడల్ పెద్దలు పరార్
ఈ చీమల కారణంగా మేమిక్కడ బతకలేకపోతున్నాం, ప్రశాంతంగా తినలేక పోతున్నాం, పడుకోలేకపోతున్నాం అంటూ వాపోతున్నారు సిక్కోలు జిల్లాలోని ఓ గ్రామం. పిల్లలైతే హడలిపోతున్నారు.
Ant Invasion Forces: చీమలు.. చాలా చిన్న ప్రాణులు. చిన్న చీమ, గండు చీమ, ఎర్ర చీమ, దూకుడు చీమ ఇలా వీటిలో చాలా రకాలు ఉన్నప్పటికీ ఇవి హానికరం కావు. ఇవి కుడితే మహా అయితే ఒక ఐదు నిమిషాలు దురద లేదా మంట పుడుతుంది అంతే. నిజానికి మనుషుల వల్లే చీమకు ప్రాణహాని. కుట్టగానే నలిపి చంపి పడేస్తాం. అలాంటి అల్ప జీవి చీమకు ఎవరైనా భయపడతారా. అంటే అవును అనే సమాధానం వస్తుంది ఆ గ్రామస్థుల నుంచి. ఆ ఊరి ప్రజలు చీమలంటేనే హడలిపోతున్నారు. అవి ఎక్కడ కుడతాయో అని భయపడుతున్నారు. అంతగా చీమల గురించి ఎందుకు వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ చీమల కారణంగా మేమిక్కడ బతకలేకపోతున్నాం, ప్రశాంతంగా తినలేక పోతున్నాం, పడుకోలేకపోతున్నాం అంటూ వాపోతున్నారు సిక్కోలు జిల్లా ఇసుకలపేట గ్రామస్థులు. పిల్లలైతే హడలిపోతున్నారు. జస్ట్ చీమే కదా? నలిపేస్తే పోయేదానికి ఇంత టెన్షనా? అంటే అక్కడి వాళ్లు ఒప్పుకోరు. మేం పడుతోన్న చీమల బెడద గురించి మీకేం తెలుసని అంటారు. అంతగా అక్కడ చీమల దండయాత్ర సాగుతోంది.
గీకితే దద్దుర్లు.. ఆపై జ్వరం
సాధారణంగా ఆహార పదార్థాల కోసం చీమలు చేరతాయి. మనం వాటిని కదిలించకపోతే వాటి పని అవి చేసుకుని వెళ్లిపోతాయి. మహా అయితే పాత్రలకు ఎక్కి చికాకు పెడతాయి. అయితే ఆ ఊరిలో చీమల కథే వేరు. చెట్టూ, పుట్టా, ఇల్లూ తేడా లేదు. ఎటు చూసినా చీమలే. ఎరుపురంగులో ఉండే ఆ చీమలు శరీరంపైకి ఎక్కాక ఏదో రసాయనాన్ని విడుస్తున్నాయని.. దాని వల్ల ఒంటిపై దద్దుర్లు, పొక్కులు వస్తున్నాయని సిక్కోలు జిల్లా ఇసుకలపేట గ్రామస్థులు వాపోతున్నారు. అవి గీకితే పెద్ద గాయాలు అవుతున్నాయని. ఒక్కోసారి జ్వరం కూడా వస్తోందని చెప్తున్నారు.
పశువులనూ వదలడంలేదు
ఈ చీమలు పశువులనూ వదలడం లేదు. అవి తినే గడ్డిలో చేరటంతో గేదెలు, ఆవులు దాణా తినడంలేదు. దీంతో బక్కచిక్కిపోతున్నాయి. ఈ చీమల కారణంగా తాము అక్కడ ఉండలేకపోతున్నామని.. ఇంట్లో, వీధిలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఉంటున్నాయని అంటున్నారు. పిల్లలైతే వీటివల్ల మరీ ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇంట్లో ఏదీ నిల్వ చేసుకోలేకపోతున్నామని.. ఊడిస్తే చనిపోయిన చీమలే వస్తున్నాయని వాపోతున్నారు.
భౌగోళిక పరిస్థితులే కారణం!
ఈ ఇసుకలపేట గ్రామం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వగ్రామమైన తొగరాం పంచాయతీ కిందకు వస్తుంది. స్పీకర్ సతీమణి వాణి ఆ గ్రామ సర్పంచ్. దీంతో ఆ ఊరివాళ్లు సమస్యను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ గ్రీవెన్స్ లో కూడా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఊరిని సందర్శించి బ్లీచింగ్ చల్లించారు. రసాయనాలను స్ప్రే చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చీమలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. భౌగోళిక పరిస్థితులే చీమల పెరుగుదలకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ ఊరిలో నుంచి నాగావళి నది ప్రవహించడం, చెట్లు, తుప్పలు, తోటలు అధికంగా ఉండడం చీమలకు ఆవాసంగా మారిందని భావిస్తున్నారు.
ఇసుకలపేటలో రెండేళ్ల నుంచి ఈ చీమల బెడద ఉందని గ్రామస్థులు తెలిపారు. మొదట్లో పొలాలు, పశువుల కొట్టాలు, నాగావళి గట్టుకు మాత్రమే పరిమితమైన చీమలు.. క్రమక్రమంగా ఊర్లోకి, ఇళ్లల్లోకి వచ్చేశాయని తెలిపారు.