Buddha Venkanna: 'విజయవాడ పశ్చిమ నుంచే పోటీ చేస్తా' - టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
Andhra News: రాబోయే ఎన్నికల్లో తాను విజయవాడ పశ్చిమ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు టీడీపీ నేత బుద్ధా వెంకన్న చెప్పారు. గాంధీ భవన్ లో టీడీపీ జెండాలతో సంబరాలపై వైసీపీ నేతల విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Buddha Venkanna Sensational Comments: రాబోయే ఎన్నికల్లో తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) స్పష్టం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు అక్కడి నుంచే సీటివ్వాలని పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu) కోరుతానని చెప్పారు. బీసీ అభ్యర్థిగా ఆ నియోజకవర్గం నుంచి తనకు సీటిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ఒకవేళ అక్కడ సీటు ఇవ్వకుంటే తనకు ఆప్షన్ - బి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందని విమర్శించారు. యువకులు, నిరుద్యోగులు వైసీపీని గద్దె దించాలని ఎదురు చూస్తున్నారని, జగన్ (Jagan) మళ్లీ సీఎం అయితే WWF పెడతారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మీద ఈగ కూడా వాలకుంటా తాను చూసుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం చెప్పారు.
గాంధీ భవన్ లో టీడీపీ జెండాలపై వివరణ
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన సంబరాల్లో టీడీపీ జెండాలు కనిపించిన ఘటనపై బుద్ధా వెంకన్న స్పందించారు. ఈ అంశంపై వైసీపీ నేతల విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కానీ టీడీపీ కానీ జోక్యం చేసుకోలేదు. గాంధీ భవన్ వద్ద టీడీపీ జెండాలు ఎగరేస్తే చంద్రబాబుకు ఏంటి సంబంధం.?. ఆయనపై అవాకులు పేలుతున్న వైసీపీ నేతలను సీఎం జగన్ నియంత్రించాలి. తమ అధినేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము కూడా అదే రీతిలో స్పందిస్తాం.' అని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏపీ వదిలి పారిపోయేందుకు చాలా మంది సిద్ధమవుతున్నట్లు బుద్ధా వెల్లడించారు.
ఇదీ జరిగింది
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాల సమయంలో గాంధీ భవన్ వద్ద కొందరు టీడీపీ జెండాలతో సంబరాల్లో పాల్గొన్నారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్కడ రేవంత్ రెడ్డి గెలిస్తే టీడీపీ వాళ్లు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. గెలిస్తే తమ వారు అని, ఓడితే తమ వారు కాదని అనడం టీడీపీకి అలవాటే అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే, ఆ పార్టీ వాళ్లు సిగ్గు లేకుండా గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఎగురవేశారని మండిపడ్డారు. జగన్ పై ఏపీలో ఎలాంటి వ్యతిరేకత లేదని, మరోసారి ఆయన సీఎం కావడం ఖాయమన్నారు. బీజేపీ, జనసేన కలిస్తే తెలంగాణలో పోటీ చేస్తే ఎలాంటి ఫలితం వచ్చిందో, ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు. ఈ విమర్శలను బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
Also Read: Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి