RK Roja Comments: ఎమ్మెల్యేల్లో అసమ్మతి లేదు, నా సీటును హ్యాపీగా వదులుకుంటా - రోజా కీలక వ్యాఖ్యలు
Minister Roja Comments: నేడు (డిసెంబర్ 26) మంత్రి రోజా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Minister Roja in Adudam Andhra: గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంగళగిరిలో నగరి ఎమ్మెల్యే, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగనన్న పాలన విషయంలో ఎవరు అసంతృప్తిగా లేరని అన్నారు. అదంతా మీడియా సృష్టిస్తోందని కొట్టిపారేశారు. ఈసారి 175 సీట్లకు 175 సీట్లు గెలవడంలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీట్లను మార్చుతున్నారని అన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని నిలబెడితే బాగుంటుందో జగన్ కు తెలుసని అన్నారు. అంతేకానీ, ఎమ్మెల్యేల్లో ఎలాంటి అసమ్మతి లేదని చెప్పారు. నేడు (డిసెంబర్ 26) మంత్రి రోజా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చుతుండడంపై రోజా స్పందిస్తూ.. 175 సీట్లు గెలవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరిస్తామని అన్నారు. అవసరమైతే తన సీటు కూడా త్యాగం చేయడానికి తాను రెడీ అన్నారు. తాను ఒకసారి ఎమ్మెల్యే అయి ప్రజలకు సేవ చేస్తే చాలనుకున్నానని, అలాంటిది జగన్ తనకు రెండు సార్లు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాక, జగన్ తనను మంత్రిని కూడా చేశారని చెప్పారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదని, అయినా తాను జగనన్నతోనే ఉంటానని రోజా స్పష్టం చేశారు. ‘‘జగనన్న నగరి ఎమ్మెల్యే విషయంలో టికెట్ లేదంటే మనస్పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని రోజా అన్నారు.
అంతకుముందు మంత్రి రోజా ఆడుదాం ఆంధ్రా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం (డిసెంబర్ 26) గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. అనంతరం క్రీడాకారులకు క్రికెట్ కిట్లను పరిశీలించి జట్టు ఆటగాళ్లకు అందజేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి బౌలింగ్ వేయగా.. సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు.