AP transport: ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలే - రవాణా శాఖ హెచ్చరిక
విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు నడిపే ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని విజయవాడ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పురేంద్ర హెచ్చరించారు.
దసరా పండగ సమయంలో తెలుగురాష్ట్రాల్లో బస్సులు, రైళ్ళు కిటకిటలాడుతున్నాయి. సొంత ఊర్లకు ప్రయాణించే వారు.. తిరిగి ప్రయాణం చేసి వారితో బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక ఇదే సమయంలో విపరీతంగా ధరలు పెంచి ప్రైవేట్ బస్సులు దందాకు తెరతీస్తాయి. గతంలో దసరా వంటి సీజన్లలో టిక్కెట్టు చార్జీలు అధికంగా పెంచేవారు. ఇప్పుడలా కాదు.. పండగ, పబ్బాలతో పనిలేకుండా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వీటి రేట్లు పెంచేస్తున్నారు. వరుసగా రెండు మూడు రోజులు సెలవులొస్తే చాలు ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగే పండగ. దసరా సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయాణికుల నుంచి అయిన కాడికి దోచుకోవడానికి బుకింగ్స్ ఓపెన్ చేశాయి ప్రైవేట్ ట్రావెల్స్.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా అక్కడా అరకొర సర్వీసులే నడుస్తున్నాయి. దీంతో చాలామంది విధిలేక అందుబాటులో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని ఇష్టానుసారం టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూపోతూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ అధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి సారించారు. బాగా టికెట్ ధరలు పెంచిన ట్రావెల్స్ పై కొరడా ఝుళిపిస్తున్నారు. అయినా కూడా ప్రైవేట్ బస్సుల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు రవాణశాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే ప్రైవేట్ బస్సులను సీజ్ చేయడం సహా కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది. నిబంధనలకు విరుద్దంగా ప్రయాణికులను తరలించడం సహా అధిక చార్జీలు వసూలు చేసే వారిని పట్టుకునేందుకు నేటి నుంచి పండుగ సీజన్ ముగిసేవరకు రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని నిర్ణయించింది.
దసరా సందర్భంగా విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పురేంద్ర హెచ్చరించారు. కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు స్టేజీ క్యారేజీగా తిప్పడం నేరమని, ఆన్ లైన్లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. కేసు తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి ట్రావెల్స్ పై ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించారు.
విజయవాడ సహా ఇతర రాష్ట్రాలకు ఎక్కువ మంది రాకపోకలు చేయనున్న దృష్ట్యా సరిహద్దుల్లోని చెక్పోస్టు వద్ద తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా సరైన ధ్రువపత్రాలు లేకుండా, కండిషన్ లేని బస్సులు నడిపితే సీజ్ చేస్తామని తెలిపారు. ఇంటర్నెట్లో ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేసే ఛార్జీల వివరాలూ, ఆధారాలు తీసుకుని కేసులు రాస్తామని చెప్పారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖకు ఫిర్యాదు చేసేందుకు రవాణాశాఖ వెబ్సైట్లో అధికారుల ఫోన్ నెంబర్లను పొందుపరిచామని.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులు సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తనిఖీల కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో 19 బృందాలను నియమించినట్లు చెప్పారు. పర్మిట్లు, రోడ్ టాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న 190 ప్రైవేట్ బస్సులపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.