ABP Southern Rising Summit 2026:హైదరాబాద్‌లో రేపే సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
ABP Event: నవంబర్ 20, 2026న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ 4వ ఎడిషన్ 'సదరన్ రైజింగ్ సమ్మిట్' జరగనుంది. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో సాగే ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, ఒవైసీ, రామ్మోహన్ నాయుడు, మృణాల్ ఠాకూర్ పాల్గొననున్నారు. పూర్తి వివరాలు!

Southern Rising Summit 4th Edition: దక్షిణ భారతదేశ ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక , రాజకీయ ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఏబీపీ నెట్‌వర్క్ (ABP Network) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదరన్ రైజింగ్ సమ్మిట్–202 నాలుగో ఎడిషన్‌కు హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. నవంబర్ 20, 2026న జరగనున్న ఈ సదస్సు షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. తమిళనాడులో రాజకీయ స్టార్టప్ విజయం సాధించడం నుంచి, తెలంగాణ పెట్టుబడులు , ఆవిష్కరణల గమ్యస్థానంగా ఎదగడం వరకు దక్షిణ భారతదేశం సరికొత్త అవకాశాలకు వేదికగా మారింది. దేశంలో ఐటీ స్టార్టప్‌లలో బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, లైఫ్ సైన్సెస్ మరియు వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా, అలాగే కర్నూలు 'డ్రోన్ సిటీ'గా గుర్తింపు పొందాయి. ఆరు దక్షిణాది రాష్ట్రాలు సాంకేతికత, అంతరిక్ష రంగం, సామాజిక సంస్కరణలు, వ్యవస్థాపకత ద్వారా దేశాభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు.
ఉదయం 10:40 గంటలకు సరస్వతీ వందనం, జ్యోతి ప్రజ్వలన, ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో సుమంత దత్తా స్వాగతోపన్యాసంతో ప్రారంభమయ్యే ఈ సదస్సులో.. దక్షిణాది రాష్ట్రాల ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధ , ఆరోగ్య రంగం , సమకాలీన రాజకీయ సమీకరణాలపై విస్తృతంగా మేధోమథనం జరగనుంది. ఈ సదస్సులో రాజకీయ దిగ్గజాల ప్రసంగాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఉదయం 11:00 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘లాస్ట్ మైల్ గవర్నెన్స్ – మేకింగ్ తెలంగాణ ఫ్యూచర్ రెడీ’ అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 2:05 గంటలకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ది మైనారిటీ రిపోర్ట్ , 3:05 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు .. ఫ్లయింగ్ ఇన్‌టు టర్బులెన్స్ , 3:35 గంటలకు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ‘ది ఉమెన్ ఓట్’ అంశాలపై ప్రసంగిస్తారు. సాయంత్రం 4:25 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లైఫ్ అవుట్ ఆఫ్ పవర్ – రోడ్ బ్యాక్ టు పవర్ అనే ఆసక్తికర అంశంపై మాట్లాడనుండగా, 5:30 గంటలకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ మాణిక్యం ఠాగూర్ ‘ది సదరన్ ఫ్రంట్’పై, అలాగే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ , తమిళనాడు మంత్రి వన్ని అరసు తదితర నేతలు దక్షిణాది అభివృద్ధిపై తమ దృక్పథాన్ని పంచుకోనున్నారు.
రాజకీయాలతో పాటు వైద్య, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక మరియు సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్‌పర్సన్ శోభనా కామినేని , అరకు కాఫీ సహ-వ్యవస్థాపకుడు మనోజ్ కుమార్ , మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ సీఈవో ప్రణవ్ వేంపటి , అగ్రాణి ల్యాబ్స్ సహ-వ్యవస్థాపకుడు ధీమంత్ నాగరాజ్ , పియానిస్ట్ అనిల్ శ్రీనివాసన్ తో పాటు పలు ప్రముఖ విద్యాసంస్థల అధినేతలు కీలక చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ తారలు శ్రద్ధా కపూర్ , మృణాల్ ఠాకూర్ తమ సినీ ప్రయాణం, దక్షిణాది–ఉత్తరాది సినిమాల అనుబంధంపై ముచ్చటించనున్నారు.
దక్షిణ భారతదేశం కేవలం సాంస్కృతిక వారసత్వానికే కాకుండా, సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, స్టార్టప్ విప్లవానికి కేంద్రబిందువుగా మారిందని చాటిచెప్పడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఆరు దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్న తోడ్పాటు, భవిష్యత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది పోషించబోయే కీలక పాత్రపై ఈ వేదికగా లోతైన విశ్లేషణలు జరగనున్నాయి.
గత మూడు ఎడిషన్ల విజయవంతమైన ప్రస్థానం తర్వాతే ఈ నాలుగో ఎడిషన్ జరుగుతోంది. 2023లో చెన్నైలో జరిగిన తొలి సదస్సులో అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, గ్రామీ అవార్డు విజేత రిక్కీ కేజ్, నటుడు రానా దగ్గుబాటి, రచయిత గురుచరణ్ దాస్, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. 2024లో హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో ఎడిషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, దర్శకుడు చిదంబరం, సినీ తారలు గౌతమి, సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా సందడి చేశారు. ఇక గతేడాది 2025లో ‘రెడీ ఫర్ ది ఫ్యూచర్: ఇన్నోవేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్, ఇన్‌స్పిరేషన్’ అనే థీమ్‌తో జరిగిన మూడో ఎడిషన్‌లో ఉదయనిధి స్టాలిన్, అన్బిల్ మహేష్ పొయ్యమొళి, తెలంగాణ నేతలు కె. కవిత, కేటీఆర్, నటి మాళవిక మోహనన్, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడవచ్చు?
శుక్రవారం ఉదయం 10:40 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు జరిగే ఈ పూర్తి కార్యక్రమాన్ని వీక్షకులు తమ మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఏబీపీ దేశం (ABP Desam) అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలతో పాటు telugu.abplive.com వెబ్‌సైట్, ఏబీపీ లైవ్ యాప్ , ఏబీపీ నెట్‌వర్క్ అన్ని ప్రాంతీయ, జాతీయ ఛానళ్లు, డిజిటల్ వేదికల్లో ఈ సదస్సు నిరంతరాయంగా స్ట్రీమ్ కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















