(Source: ECI/ABP News/ABP Majha)
Aadhaar Card For Kids: అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్, మారిన రూల్స్, దరఖాస్తు విధానం
చిన్న పిల్లలు, శిశువులకు సైతం ఆధార్ కార్డులు జారీ చేస్తారు. అయితే అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్ కార్డుకు నమోదు చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది యూఐడీఏఐ.
వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు కోసం తీసుకొచ్చిన వాటిలో ఆధార్ కార్డ్ ఒకటి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆధార్ కార్డు వివరాలను పలు పథకాలలో చేర్చుతున్నారు. వాటి ఆధారంగా లబ్దిదారుల ఎంపిక, వ్యక్తుల వ్యక్తిగత వివరాలు, అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు వివరాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ద యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ కార్డులను సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పెద్దవారితో పాటు చిన్న పిల్లలు, శిశువులకు సైతం ఆధార్ కార్డులు జారీ చేస్తారు. అయితే అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్ కార్డుకు నమోదు చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది యూఐడీఏఐ. పుట్టిన శిశువు బర్త్ సర్టిఫికెట్ వచ్చే వరకు మీరు ఎదురుచూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శిశువు తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డ్ నెంబర్, ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. చిన్నారికి ఆధార్ కార్డు కోసం ఎన్‌రోల్ చేసుకోవచ్చునని యూఐడీఏఐ వెల్లడించింది. ఈ మేరకు ఆధార్ కార్డ్ నియమాలలో మార్పులు చేర్పులు చేశారు.
బాల్ ఆధార్ (చిన్నారులకు ఆధార్ కార్డు) నీలి రంగులో ఉంటుంది. దీనిని అయిదేళ్ల లోపు చిన్నారులకు జారీ చేస్తారని తెలిసిందే. సవరించిన నియమాలతో చిన్నారులకు ఆధార్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ అవసరం లేదు. అయితే చిన్నారికి 5 ఏళ్ల వయసు వచ్చాక మాత్రం బయోమెట్రిక్ అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పుట్టిన సమయం నుంచి అయిదేళ్లలోపు వారి నుంచి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ తీసుకోరు. కానీ అయిదేళ్లు దాటిన తరువాత బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయడం తప్పనిసరి.
పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎన్ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్ లాంటి పత్రాలు సమర్పించాలి. పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, పోస్టాఫీసు అకౌంట్ స్టేట్‌మెంట్ లాంటివి అడ్రస్ ప్రూఫ్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. పుట్టిన చిన్నారి ఎన్ఆర్ఐ అయితే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం భారత పాస్‌పోర్ట్ తప్పనిసరి చేశారు.
బాల్ ఆధార్ కార్డ్ దరఖాస్తు విధానం..
1. అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లింక్ ఓపెన్ చేయండి
2. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి
3. చిన్నారి పేరు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ వివరాలు నమోదు చేయాలి
4. మీ అడ్రస్, లొకేషన్, జిల్లా, రాష్ట్రం తదితర వివరాలు ఎంటర్ చేయండి
5. అపాయింట్ మెంట్ ట్యాబ్ మీద క్లిక్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ తేదీని షెడ్యూల్ చేసుకుంటే సరి.
ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెస్..
సమీపంలోని కేంద్రానికి వెళ్లి ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, రిలేషన్‌షిప్ ప్రూఫ్, పుట్టిన తేదీ సంబంధిత పత్రాలు ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు తీసుకెళ్తే, కేంద్రం వద్ద ఉన్న ఆధార్ ఆఫీసర్ వాటిని పరిశీలిస్తాడు. చిన్నారి వయసు 5 ఏళ్లు మించితే బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు. అంతకు తక్కువ వయసు ఉన్న వారికి మీ ప్రాంతం వివరాలు, ఫేసియల్ రికగ్నిషన్ వివరాలు తీసుకుని నమోదు చేసుకుంటారు.
90 రోజుల్లో ఆధార్ కార్డ్..
చిన్నారికి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న అనంతరం అకనాలెడ్జ్ నెంబర్ సాయంతో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే వీలుంది. 60 రోజుల్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యాక 90 రోజుల్లోనే చిన్నారులకు ఆధార్ కార్డ్ లభిస్తుంది.