Super blue moon: ఈ వారంలో ఆకాశంలో అరుదైన సూపర్ బ్లూ మూన్
Super blue moon: ఆగస్టు ౩౦వ తేదీ రాత్రి అరుదైన సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది.
ఆకాశంలో ఈ వారం అద్భుతం జరగనుంది. అందమైన చందమామ మరింద ఆకర్షణీయంగా, అందంగా కనువిందుచేయనున్నాడు. ఆగస్టు ౩౦వ తేదీ రాత్రి అరుదైన సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది. బ్లూ మూన్ అంటే నిజంగా బ్లూ కలర్‌లో ఉండదు. ఒకే నెలలో రెండోసారి ఫుల్ మూన్ కనిపిస్తే ఇలా బ్లూ మూన్ అంటారు. ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఎందుకంటే ఆగస్టు 1 వ తేదీన పౌర్ణమి రోజున పూర్తి చంద్రుడిని చూశాం. ఈ విధంగా పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. రెండు పౌర్ణమిలు ఒకే నెలలో రావు. అలాగే నాసా చెప్పేదాని ప్రకారం.. సీజన్‌లోని మూడో ఫుల్ మూన్ కూడా బ్లూ మూన్ అంటారు.
ఆగస్టు ౩౦ వ తేదీన వచ్చే నిండు చంద్రుడు సూపర్ మూన్ , బ్లూ మూన్ కూడా. సూపర్ మూన్ అంటే సాధారణంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కన్నా 16 శాతం కాంతి వంతంగా, సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు. చంద్రుడు పరిభ్రమించ కక్ష్య భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, అదే సమయంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఇలా సూపర్ మూన్ కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే సూపర్ మూన్ ఈ ఏడాదిలో మూడో అతిపెద్ద సూపర్ మూన్. బుధవారం కనిపించే చందమామ చాలా కాంతివంతంగా, ఆకర్షణీయంగా, నారింజ రంగులో కనిపించబోతోంది.
సూపర్ మూన్ చూడడానికి మంచి సమయం ఏదంటే.. సూర్యాస్తమయం తర్వాత కొన్ని గంటల అనంతరం చంద్రుడు వచ్చినప్పుడు చూస్తే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఆగస్టు ౩౦వ తేదీ రాత్రి 8.30 తర్వాత ఆకాశంలోకి చూస్తూ సూపర్ బ్లూ మూన్ అద్భుతంగా కనిపిస్తుంది. అప్పుడు పూర్తి ప్రకాశవంతంగా మారి అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్ర వేళ చంద్రోదయం సమయంలో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆకాశంలో అద్భుతాలు చూడడంపై ఆసక్తి ఉన్న వారు ఇలాంటి వాటిని చాలా ఆసక్తితో చూస్తుంటారు. యూరప్ నుంచి చూసే వారికి ఇది ఇంకా మంచిగా కనిపించనుంది.
నాసా వివరాల ప్రకారం.. బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలిపింది. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. ఫుల్ మూన్ రోజు బ్లూ సపర్ మూన్ రావడానికి 3 శాతం అవకాశం ఉంటే, పౌర్ణమి రోజులో సూపర్ మూన్ రావడానికి 25శాతం అవకాశం ఉంటుందని తెలిపింది.
అంతేకాకుండా ఈ బుధవారం చంద్రుడిని చూసే సమయంలో శనిగ్రహం కూడా కనిపించే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ సమయంలో ఇది చంద్రుడికి దగ్గరగా వస్తుందని తెలిపారు. బైనాక్యులర్ లేదా టెలిస్కోప్‌తో చూస్తే వీక్షకులకు గ్రహం ఆనవాళ్లు కాస్త మంచిగా కనిపించే అవకాశం ఉందని తెలిపారు. శనివారం రోజు శని గ్రహం నేరుగా సూర్యుడికి ఎదురుగా వస్తుందని, ఆదివారం రాత్రి వరకు అలా సూర్యుడికి ఎదురుగా శనిగ్రహం ఉంటుందని, సూర్యకాంతి గ్రహంపై పడినప్పుడు కాస్త ప్రకాశవంతంగా, పెద్దగా కనిపించే అవకాశం ఉందని కూడా తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇది కనిపిస్తుందని అన్నారు.