Russia-Ukraine War: బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ పై రష్యా దాడి- 41మంది మృతి,180 మందికి గాయాలు
Poltava Attack:రష్యా మంగళవారం ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. రష్యా క్షిపణులు ఉక్రెయిన్‌లోని పోల్టావాను లక్ష్యంగా చేసుకున్నాయి. పోల్తావాలో 41 మంది మరణించారు మరో 180 మంది గాయపడ్డారు.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా మారుతోంది. రష్యా మంగళవారం ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. రష్యా క్షిపణులు ఉక్రెయిన్‌లోని పోల్టావాను లక్ష్యంగా చేసుకున్నాయి. దీని కారణంగా..పోల్తావాలో 41 మంది మరణించారు మరో 180 మంది గాయపడ్డారు. పోల్టావాలో రష్యా దాడి గురించి నాకు ప్రాథమిక సమాచారం అందిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ట్విట్టర్లో తెలిపారు. ‘‘రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. వీటిలో ఒక విద్యాసంస్థ, ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని జెలెన్స్కీ చెప్పారు. వారిలో చాలా మందిని రక్షించామన్నారు. ఈ దాడిలో 180 మందికి పైగా గాయపడ్డారు. దురదృష్టవశాత్తు, చాలా మంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 41 మంది మరణించినట్లు తెలిసింది. ఆయన బంధువులకు, ఆత్మీయులందరికీ నా ప్రగాఢ సానుభూతి.’’ అంటూ రాసుకొచ్చారు.
రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!
ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జెలెన్స్కీ తెలిపారు. దాడులు జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని బాధితుల ప్రాణాలను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దాడులకు రష్యా తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఈ అరాచకాలను అరికట్టగల శక్తి ఉన్న ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఒక విజ్ఞప్తి. ఉక్రెయిన్‌కు వాయు రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని ఆయన కోరారు. రష్యా దురాక్రమణ నుంచి తమను సుదూర శ్రేణి క్షిపణులే రక్షించగలవని చెప్పారు. అందువల్ల అవి ఇప్పుడు అవసరమని, తర్వాత కాదన్నారు. జాప్యం వల్ల ప్రతిరోజూ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
I received preliminary reports on the Russian strike in Poltava. According to available information, two ballistic missiles hit the area. They targeted an educational institution and a nearby hospital, partially destroying one of the telecommunications institute's buildings.… pic.twitter.com/TNppPr1OwF
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) September 3, 2024
డ్రోన్ లతో దాడి
సోమవారం ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు కీలక నగరాలపై డ్రోన్‌లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడ్డాయి. సోమవారం తెల్లవారుజామున కీవ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ప్రజలను వెంటనే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. కైవ్‌లోని హోలోసివ్‌స్కీ, సోలోమ్యాన్‌స్కీ జిల్లాలకు అత్యవసర సేవలను పంపినట్లు కైవ్ మేయర్ విటాలీ క్లిట్ష్‌కో తెలిపారు. షెవ్‌చెంకివ్‌స్కీ జిల్లాలో శిథిలాలు పడి ఒకరు గాయపడ్డారని వెల్లడించారు.
ఖార్కివ్‌పై క్షిపణి దాడులు
10కి పైగా క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో రష్యా దాడులు చేసిందని కైవ్ సిటీ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ సెర్హా పాప్కో తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో కూడా పేలుడు సంభవించినట్లు ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఖార్కివ్ ప్రాంత అధిపతి ఒలేహ్ సినిహుబోవ్ ధృవీకరించారు. పారిశ్రామిక జిల్లా ఖార్కివ్‌పై సోమవారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో పలు నివాస సముదాయాలు దగ్ధమైనట్లు సమాచారం.
ఉక్రెయిన్ దాడికి రష్యా ప్రతీకారం
శనివారం అర్ధరాత్రి, ఉక్రెయిన్ రష్యాపై ఏకకాలంలో 158 డ్రోన్‌లను ప్రయోగించింది. వీటిని రష్యా కూల్చివేసింది. ఈ దాడులు మాస్కోలోని రెండు ప్రాంతాలు.. 9 ఇతర ప్రదేశాలలో జరిగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. కుస్క్ ప్రాంతంలో 46 డ్రోన్ దాడులు జరిగాయి. బ్రయాన్స్క్‌లో 34, వొరోనెజ్‌లో 28, బెల్గోరోడ్‌లో 14 డ్రోన్ దాడులు జరిగాయి. ఇవన్నీ ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలు. వీటితో పాటు రష్యా లోపలికి చొచ్చుకుపోయి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. వాటిలో మాస్కో సమీపంలోని ట్వెర్, ఇవానోవో ప్రాంతాలు ఉన్నాయి. ఈ దాడులు జరిగిన మరుసటి రోజే రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. క్షిపణులతో విరుచుకుపడింది.