Vasantha Kokila Review: బాబీ సింహా ‘వసంత కోకిల’ ఎలా ఉంది? థియేటర్ల దగ్గర నిలబడుతుందా?
బాబీ సింహా వసంత కోకిల సినిమా ఎలా ఉందంటే?
రమణన్ పురుషోత్తమ
బాబీ సింహా, కశ్మీర పరదేశి, ఆర్య, శరత్ బాబు తదితరులు
సినిమా రివ్యూ : వసంత కోకిల
రేటింగ్ : 2/5
నటీనటులు : బాబీ సింహా, కశ్మీర పరదేశి, ఆర్య, శరత్ బాబు తదితరులు
ఛాయాగ్రహణం : గోపి అమర్‌నాథ్
సంగీతం : రాజేష్ మురుగేశన్
నిర్మాతలు : రజనీ తాళ్లూరి, రేష్మి సింహా
రచన, దర్శకత్వం : రమణన్ పురుషోత్తమ
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2023
Vasantha Kokila Movie Review: తెలుగు వాడే అయినా తమిళ నాట మంచి పేరు తెచ్చుకున్న హీరో బాబీ సింహా. కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో సొలొమన్ సీజర్ పాత్రతో పలకరించాడు. తన లేటెస్ట్ తమిళ సినిమా ‘వసంత ముల్లై’. దీన్ని ‘వసంత కోకిల’ పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయడంతో సినిమాపై కాస్త బజ్ వచ్చింది. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది?
కథ: రుద్ర (బాబీ సింహా) చాలా వర్క్‌హాలిక్. నిద్రాహారాలు కూడా మానేసి ఉద్యోగం మీదనే దృష్టి పెడతాడు. ఈ కారణాలతోనే ప్రేమించిన అమ్మాయి నిషాతో (కశ్మీర పరదేశి) కూడా గొడవలు వస్తాయి. దీంతో ఒకరోజు నిషాతో బయటకు వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. అలా ఇద్దరూ కలిసి వెళ్తుండగా అనుకోకుండా అడవిలో ఉన్న వసంత కోకిల అనే హోటల్‌లో స్టే చేయాల్సి వస్తుంది. అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఉన్నట్లుండి నిషా కనిపించకుండా పోతుంది. ఈ కథలో కమల్ (తమిళ హీరో ఆర్య) పాత్ర ఏంటి? ఈ వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ‘వసంత కోకిల’ ఒక సాధారణ ప్రేమకథగా ప్రారంభం అయి సడెన్‌గా టైమ్ లూప్ వైపు మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత మరిన్ని సక్సెస్‌ఫుల్ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా 2006లో వచ్చిన ‘ట్రయాంగిల్’, 2010లో వచ్చిన ‘ఇన్‌సెప్షన్’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఇటువంటి కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్‌లు తీసుకున్నప్పుడు ఒక రకమైన నెరేటివ్‌తో వెళ్తే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. మధ్యలో ఇంకో కాన్సెప్ట్ లేదా జోనర్‌ను సడెన్‌గా తీసుకొస్తే కథ రెండిటీ కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ‘వసంత కోకిల’ విషయంలో అదే జరిగింది. దర్శకుడు రమణన్ పురుషోత్తమ కథను చెప్పిన విధానం కొంచెం కన్ఫ్యూజింగ్‌గా, ఓవర్ ఇంటెలిజెంట్‌గా అనిపిస్తుంది.
ఈ సినిమా ప్రథమార్థం అంతా హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ మీదనే ప్రధానంగా నడుస్తుంది. సరిగ్గా ఇంటర్వల్‌కు 15 నిమిషాల ముందు నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇంటర్వల్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం వావ్ అనిపిస్తుంది. ద్వితీయార్థంపై అంచనాలను ఒక రేంజ్‌లో పెంచేస్తుంది. కానీ ఆ ట్విస్ట్ మీద నెరేటివ్ సెకండాఫ్‌లో 15 నిమిషాలకే పరిమితం అవుతుంది. ఆ తర్వాతి నుంచి కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది. సెకండాఫ్ మొత్తం ఇంటర్వెల్ ట్విస్ట్ మీద నడిపించినా మంచి థ్రిల్లర్ అయ్యేది.
ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలిచేది ఆర్ట్ వర్క్. ముఖ్యంగా ‘వసంత కోకిల’ హోటల్ లోపల డిజైనింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. టిపికల్ హాలీవుడ్ హార్రర్ సినిమాల్లో చూసే సెట్‌ను ఇందులో చూడవచ్చు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. రాజేష్ మురుగేశన్ సంగీతం సోసోగానే ఉంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇందులో ప్రధాన పాత్రలు బాబీ సింహా, కశ్మీర పరదేశిలవే. వీరిద్దరూ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కశ్మీర అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుంటుంది. బాబీ సింహాకు కోపం తప్ప మరో ఎమోషన్ చూపించాల్సిన అవసరం కనిపించలేదు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘మనిషికి నిద్ర అవసరం. స్ట్రెస్, టెన్షన్ లేని నిద్ర పోయినప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలం.’ సినిమాలో ఒక కీలక పాత్ర చెప్పే డైలాగ్ ఇది. ఒకరకంగా చెప్పాలంటే సినిమాకు వచ్చే ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ డైలాగ్ రాసినట్లు అనిపిస్తుంది. ఈ వసంత కోకిల ఓటీటీలో కూసే దాకా ఆగవచ్చు. కచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా అయితే కాదు.