Suvarna Sundari Review - 'సువర్ణ సుందరి' రివ్యూ : 'అరుంధతి' తరహా సోషియో ఫాంటసీ, సినిమా ఎలా ఉందంటే?
Suvarna Sundari Review 2023 Telugu Movie : సీనియర్ కథానాయిక జయప్రద చాలా రోజుల తర్వాత నటించిన తెలుగు సినిమా 'సువర్ణ సుందరి'. ఇందులో పూర్ణ, సాక్షి చౌదరి కూడా ఉన్నారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
సురేంద్ర మాదారపు
పూర్ణ, జయప్రద, సాక్షి చౌదరి తదితరులు
సినిమా రివ్యూ : సువర్ణ సుందరి
రేటింగ్ : 2.5/5
నటీనటులు : పూర్ణ, జయప్రద, సాక్షి చౌదరి, ఇంద్ర, రామ్, సాయి కుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్, సత్య ప్రకాశ్ తదితరులు
ఛాయాగ్రహణం : యెల్లుమహంతి ఈశ్వర్
సంగీతం : సాయి కార్తీక్
సమర్పణ : డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి
నిర్మాత : ఎమ్.ఎల్. లక్ష్మీ
దర్శకత్వం : సురేంద్ర మాదారపు
విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023
జయప్రద (Jaya Prada) చాలా రోజుల విరామం తర్వాత నటించిన తెలుగు సినిమా 'సువర్ణ సుందరి' (Suvarna Sundari Review). ఇందులో పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారలు. నిజం చెప్పాలంటే... సినిమా ఎప్పుడో రెడీ అయ్యింది. కరోనా, అంతకు ముందు చిన్న చిన్న సమస్యలతో విడుదల ఆలస్యం అయ్యింది. అయినా సరే ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Suvarna Sundari Movie Story) : అనగనగా ఓ ఊరు. అక్కడ భూమిలో ఓ రైతు తవ్వుతూ ఉంటాడు. అతడికి ఓ విగ్రహం దొరుకుతుంది. దానిని కుమారుడికి ఇచ్చి ఇంట్లో పెట్టమని అడుగుతాడు. రైతు వచ్చేసరికి కుటుంబ సభ్యులను చంపేసిన కుమారుడు... ఆ విగ్రహానికి వాళ్ళ రక్తంతో అభిషేకం చేస్తాడు. ఆ విగ్రహానికి పెద్ద చరిత్ర ఉంటుంది. ప్రజలు సుభిక్షంగా ఉండాలని చివరి రెడ్డి రాజు త్రినేత్రి అమ్మవారి రూపం చేయిస్తాడు. ఆ త్రినేత్రి దుష్టశక్తిగా ఎలా మారింది? ఇతరులను హత్య చేసేలా ప్రజలను ఎలా హిప్నటైజ్ చేస్తుంది? ఒక లిఫ్టులో ఉన్న అంజలి (పూర్ణ), సాక్షి (సాక్షి చౌదరి), ఇతరులకు ఆ విగ్రహం వల్ల ఎటువంటి ముప్పు ఏర్పడింది? దుష్టశక్తిగా మారిన త్రినేత్రిని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ విశాలాక్షి (జయప్రద) ఏం చేసింది? ఆ దుష్టశక్తి కారణంగా విశాలాక్షి ఏం కోల్పోయింది? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ : 'సువర్ణ సుందరి' ప్రారంభమే ప్రేక్షకులకు ఝలక్ ఇస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. ప్రారంభ సన్నివేశాలు తర్వాత ఏం జరుగుతుందో? అనే ఉత్సుకత కలిగిస్తాయి. అయితే, తర్వాత మధ్య మధ్యలో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఈ సినిమా రోలర్ కోస్టర్ రైడ్ కింద ఉంటుంది.
'సువర్ణ సుందరి' కథ బాగుంది. దర్శక, రచయితలు రాసుకున్న కథాంశంలో మంచి విషయం ఉంది. సరిగ్గా డీల్ చేస్తే 'అరుంధతి' తరహా చిత్రమే. ఆ సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మంచి పాయింట్ 'సువర్ణ సుందరి'లో ఉంది. స్క్రీన్ మీదకు విగ్రహం వచ్చిన ప్రతిసారీ... సీట్లలో కూర్చున్న ప్రేక్షకుల్లోనూ టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడు ఎవరు చనిపోతారు? ఏమవుతుంది? అని ఆసక్తి కలుగుతుంది. విగ్రహం సీన్స్ మధ్య వచ్చే ప్రజెంట్ సీన్స్ విసుగు పుట్టిస్తాయి. సాక్షి చౌదరి - ఇంద్ర, పూర్ణ - రామ్ మధ్య సీన్స్ బాగా రాసుకుని ఉంటే రిజల్ట్ మరో రేంజ్‌లో ఉంటుంది. క్యారెక్టర్లను కనెక్ట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు.
నిర్మాతలు భారీగా ఖర్చు చేసినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని ఆశించిన స్థాయిలో రాలేదు. ఇటువంటి సినిమాలకు ఎక్కువ బడ్జెట్ అవసరం. ఉన్నంతలో నిర్మాతలు మంచి సినిమా అందించే ప్రయత్నం చేశారు. సాయి కార్తీక్ తన నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశారు.
నటీనటులు ఎలా చేశారంటే? : జయప్రద ఇంట్రడక్షన్ చూశాక... ఆమెకు కథలో పెద్దగా ప్రాముఖ్యం లేదేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఒంటి చేత్తో సినిమాను నడిపించారు. జయప్రద అనుభవం పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది. పూర్ణ, సాక్షి ప్రజెంట్ సీన్స్‌లో అందంగా మోడ్రన్ దుస్తుల్లో కనిపించారు. ఇద్దరూ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగా చేశారు. కోట శ్రీనివాస రావు, సత్య ప్రకాశ్, సాయి కుమార్... తెరపై కనిపించే సన్నివేశాలు తక్కువే అయినా పాత్రలకు న్యాయం చేశారు.
Also Read : 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'సువర్ణ సుందరి'లో సూపర్ డూపర్ హిట్ సినిమాకు కావలసిన అంశాలు అన్నీ ఉన్నాయి. భారీ తారాగణం, సెల్లింగ్ స్టోరీ పాయింట్, ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ ఉన్నాయి. కొన్ని సీన్స్ బావున్నాయి. దర్శకత్వంలో కొన్ని లోపాలు, పూర్ వీఎఫ్ఎక్స్ సినిమాను సాదాసీదా మార్చాయి. ఆ లోపాలను కవర్ చేసేలా సువర్ణ సుందరి విగ్రహం సీన్స్ భయపెట్టాయి. సోషియో ఫాంటసీ థ్రిల్లర్స్ కోరుకునే ప్రేక్షకులకు థియేటర్లపై ఓ లుక్ వేయొచ్చు.
Also Read : 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?