Bench Life Web Series Review - బెంచ్ లైఫ్ రివ్యూ: Sony LIV ఓటీటీలో నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Bench Life Web Series on Sony Liv: వైభవ్, చరణ్, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక నటించిన వెబ్ సిరీస్ 'బెంచ్ లైఫ్'. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దామా?
మానసా శర్మ
రాజేంద్ర ప్రసాద్, వైభవ్, రితికా సింగ్, చరణ్ పెరి, నయన్ సారిక, తులసి, తనికెళ్ల భరణి, వెంకట్ తదితరులు
Sonyliv
Bench Life Web Series Review In Telugu streaming on Sony Liv OTT: నిర్మాతగా మెగా డాటర్ నిహారిక కొణిదెల అభిరుచి ఎటువంటిదో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థలో ఆమె నిర్మించిన వెబ్ సిరీస్, సినిమాలు చెబుతాయి. 'కమిటీ కుర్రోళ్ళు'తో ఇటీవల థియేటర్లలో విజయం అందుకున్నారు. అంతకు ముందు 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వంటి వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు. ఆ సిరీస్ రైటర్, షో క్రియేటర్ మానసా శర్మ దర్శకత్వంలో నిహారిక నిర్మించిన తాజా సిరీస్ 'బెంచ్ లైఫ్'.
'బెంచ్ లైఫ్'లో వైభవ్ రెడ్డి, చరణ్ పెరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, రాజేంద్ర ప్రసాద్, తులసి, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. సోనీ లివ్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
కథ (Bench Life Web Series Story): బాలు (వైభవ్ రెడ్డి), రవి (చరణ్ పెరి), మీనాక్షి (రితికా సింగ్) సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు. ముగ్గురూ స్నేహితులు... ఆ ముగ్గురికీ బెంచ్ కావాలి. సేమ్ ఆఫీసులో ఇషా (ఆకాంక్ష సింగ్) అంటే బాలుకు ఇష్టం. ఆమెను తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తున్నా ఆ విషయం చెప్పలేదు. ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా చెప్పలేక ఆగుతాడు. మీనాక్షికి డైరెక్టర్ కావాలని కోరిక. కథలు రాసుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతుంది. భార్య (నయన్ సారిక), స్నేహితులతో కలిసి గోవా వెళ్లాలని రవి ప్లాన్ చేస్తాడు. అందుకు బెంచ్ అడుగుతారు. వస్తుంది కూడా!
అయితే... బెంచ్ వచ్చిన తర్వాత ఏమైంది? ఐపీఎస్ ఉద్యోగం వదిలేసి కంపెనీలో చేరిన ప్రసాద్ వశిష్ఠ (రాజేంద్ర ప్రసాద్) ఎవరు? డైరెక్షన్ కలలు వదిలేసి పెళ్లి చేసుకోమని తల్లి (తులసి) సంబంధాలు తీసుకొస్తే మీనాక్షి ఏం చేసింది? భార్యతో రవికి మనస్పర్థలు రావడానికి, ఆమె పుట్టింటికి వెళ్లడానికి కారణం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Bench Life Web Series Review Telugu): 'బెంచ్ లైఫ్' అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోకులకు తప్ప సామాన్య ప్రేక్షకులలో కొందరికి తెలియని పదం. అందరికీ అర్థం అయ్యేలా చాలా సింపుల్‌గా మొదట్లో 'బెంచ్ లైఫ్' అంటే ఏంటో చెప్పేశారు. ఈ కథ కూడా అంతే సింపుల్‌గా ఉంటుంది. ఊహకు అందని మలుపులు గానీ, మెదడుకు మేత పెట్టే సన్నివేశాలు గానీ లేవు.
ఆఫీసులో పని చేయకుండా జాలీగా, హాయిగా తిరగాలని, ఎంజాయ్ చేయాలనుకునే ముగ్గురు స్నేహితుల కథగా మొదలు అవుతుంది. తర్వాత ఒక్కో క్యారెక్టర్ కథలోకి వెళితే ఆయా పాత్రలలో ఎవరో ఒకరు తమను తాము చూసుకునేలా ఉన్నాయి. ఏదో ఒక పాత్రతో యువతరం కనెక్ట్ అవుతారు. అయితే... కథ, కథనాల్లో కొత్తదనం లేదు. ఆ మూమెంట్ ఎంజాయ్ చేసేలా ఉందా? లేదా? అన్నట్టు తీశారు. ఈషాను బాలు ఎందుకు ప్రేమించాడు? బాలును ఈషా ప్రేమించడానికి కారణం ఏమిటి? ఈషా గతం ఏమిటి? ఇన్ డెప్త్ చూపించలేదు. అందువల్ల, ఎమోషన్స్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలా కొన్ని సన్నివేశాలు కుదరలేదు. చరణ్ - నయన్ కథను చూపించినంత వివరంగా మిగతా కథలు చూపించలేదు. అదీ 'బెంచ్ లైఫ్'కు మైనస్. అయితే, వైభవ్ నటన వల్ల ఆయా సన్నివేశాలు నవ్వించాయి.
'బెంచ్ లైఫ్'కు మానసా శర్మ, మహేష్ ఉప్పాల కథ, కథనం, మాటలు రాశారు. ఆ రచనలో సహజత్వం బావుంది. నిహారిక కొణిదెల ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. కెమెరా వర్క్ ప్లజెంట్ ఫీల్ తీసుకొచ్చింది. ప్రొడక్షన్ డిజైనర్‌ను మెచ్చుకోవాలి. సాఫ్ట్‌వేర్ కంపెనీ వాతావరణాన్ని బాగా ప్రజెంట్ చేశారు. పీకే దండి పాటలు, నేపథ్య సంగీతం కథతో ప్రయాణం చేశాయి.
విజయ్ 'గోట్', నాగచైతన్య 'కస్టడీ' సినిమాల్లో వైభవ్ కనిపించారు. అయితే... కొంత గ్యాప్ తర్వాత హీరోగా స్ట్రెయిట్ ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వైభవ్ రావడం 'బెంచ్ లైఫ్'తోనే. బాలు పాత్రకు ఆయన నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ప్లస్ అయ్యాయి. అలవోకగా చేసేశారు. కాకపోతే... మాటల మధ్యలో వచ్చే కొన్ని బూతులు ఫ్యామిలీతో సిరీస్ చూసేటప్పుడు ఇబ్బంది పెడతాయి. వైభవ్ నటన చూస్తే... నిజంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు ఇలా ఉంటారా? అని ఆశ్చర్యపోయేలా ఉంది. ఆయన ప్రేమించే అమ్మాయిగా ఆకాంక్ష సింగ్ చక్కగా నటించారు. మనసులో భావాలను బయటకు చెప్పలేని సెటిల్డ్ రోల్ చేశారు. ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయస్.
'బెంచ్ లైఫ్'లో సర్‌ప్రైజ్ అంటే చరణ్ పెరి, నయన్ సారిక. వాళ్లిద్దరి నటనతో పాటు ఆ సన్నివేశాలు నవ్విస్తాయి, ఆ ఫీలింగ్స్ మనం ఫీలయ్యేలా చేస్తాయి, ఆ జంటతో ప్రయాణం చేసేలా చేశాయి. ఆంక్షల మధ్య పెరిగిన అబ్బాయి గోవా వెళ్లాలని అనుకోవడం, భర్త ఎప్పుడూ తనతో ఉండాలని భార్య కోరుకోవడం, ఖాళీగా ఉన్నపుడు కిరాణా కొట్టుకు వెళ్లి సరుకులు తీసుకు రావడం భారమైన పనిగా భర్త భావించడం... ప్రతిదీ భలే తీశారనిపిస్తుంది.
దర్శకురాలు కావాలని కోరుకునే మీనాక్షి ప్రోఫెషన్, ఆ పాత్రతో అమ్మాయిలు అందరూ కనెక్ట్ కాకపోవచ్చు. కానీ, తాము కోరుకున్నది చేయడానికి - కలలు సాకారం చేసుకోవడానికి కుటుంబం, (కాబోయే) భర్త, సమాజం నుంచి ఎన్ని మాటలు పడాలి? ఎన్ని కష్టాలు దాటాలి? అనే కోణంలో చూసినప్పుడు అమ్మాయిలలో చాలా మంది కనెక్ట్ కావచ్చు. రితికా సింగ్ నటన ఓకే. తులసి ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి కామెడీ టైమింగ్, ఎమోషన్స్ పరంగా మెప్పించారు. తనికెళ్ల భరణి పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ... కథలో కీలమైన సందర్భంలో హుందాగా నటించి, ఆయా సన్నివేశాలకు అర్థం తీసుకొచ్చారు. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, వెంకట్ అతిథి పాత్రల్లో మెరిశారు.
బెంచ్ లైఫ్... ఇంట్లోని సోఫాలో కూర్చుని చక్కగా కాలక్షేపం చేసే వెబ్ సిరీస్. బాలుగా వైభవ్ నోటి వెంట కొన్ని బూతులు వచ్చాయి. సిరీస్ స్లో అండ్ స్టడీగా వెళుతుంది. అటువంటి చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే... చక్కగా ఎంటర్‌టైన్ అయితే చేస్తుందీ సిరీస్. ఇందులో వినోదం బావుంది. సింపుల్ అండ్ ఫన్నీ సీన్స్ మనల్ని నవ్విస్తాయి. చరణ్ పెరి - నయన్ సారిక, వైభవ్ - ఆకాంక్ష సింగ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ పెయిర్స్ మధ్య కోడ్ బాగా రన్ అయ్యింది. 'బెంచ్ లైఫ్'లో ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ రన్ టైమ్ కాస్త అటు ఇటుగా 40 నిమిషాలు. మూడు గంటల సినిమా చూసినట్టే ఉంటుంది.
Also Read: 'ది గోట్' రివ్యూ: తండ్రి పాలిట కన్న కొడుకే విలన్ అయితే... విజయ్ సినిమా హిట్టా? ఫట్టా?