Nootokka Jillala Andagadu Review: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ రివ్యూ: బట్టతల కూడా అందమే!
అవసరాల శ్రీనివాస్ నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ థియేటర్లలో సందడి చేస్తున్నాడు. మరి, ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తుంది?
రాచకొండ విద్యాసాగర్
అవసరాల శ్రీనివాస్ ,రుహానీ శర్మ, రోహిణి, రాకెట్ రాఘవ, శివన్నారాయణ తదితరులు
బాలీవుడ్‌లో బట్టతల కాన్సెప్ట్‌తో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘బాలా’ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. అయితే, అలాంటి చిత్రాన్ని తెలుగులో తీయాలంటే దమ్ముండాలి. ముఖ్యంగా కథానాయకుడు తన ఇమేజ్‌ను మరిచిపోయి.. ఆ కథలో ఇమిడిపోవాలి. ఆ సాహసాన్ని అవసరాల శ్రీనివాస్ చేశాడు. ‘అష్టాచెమ్మా’ సినిమాతో ఈ పొడవబ్బాయి భలే ఉన్నాడే అనిపించుకుని.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి ఫీల్‌ను నింపే సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకున్న అవసరాల. బట్టతలతో నవ్వించేందుకు ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంచనాలను కూడా పెంచేసింది. మరి.. ఈ అందగాడు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడా? లేదా అనేది చూద్దాం.
కథ: గొత్తి సత్యనారాయణ అలియాస్ జీఎస్‌ఎన్ (అవసరాల శ్రీనివాస్) ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అతడి జీవితంలో ఉన్నీ ఉన్నా.. ఓ సమస్య మాత్రం తీవ్రంగా వేదిస్తుంది. అదే బట్టతల. వంశ పారంపర్యంగా వాళ్ల కుటుంబంలో వస్తున్న బట్టతల జీఎస్ఎన్‌ను కూడా వదలి పెట్టదు. తనకు బట్టతల ఉందని తెలిస్తే అంతా నవ్వుతారని, తనని హేళన చేస్తారని జీఎస్ఎన్ భయపడుతూ ఉంటాడు. విగ్ పెట్టుకుని తన బట్టతలను కవర్ చేస్తాడు. తనమే తానే ద్వేషాన్ని పెంచుకుంటాడు. తాను ఎవ్వరికీ నచ్చనని బాధపడుతుంటాడు. అయితే, జీఎస్ఎన్ తన ఆఫీసులో పనిచేసే అంజలి (రుహానీ శర్మ) ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడుతుంది. తనకు బట్టతల ఉందనే విషయాన్ని ఆమె వద్ద దాస్తాడు. కానీ, ఓ రోజు నిజం బయటపడుతుంది. మరి జీఎస్ఎన్‌కు బట్టతల ఉందని తెలిసిన తర్వాత కూడా అంజలీ అతడిని ఇష్టపడుతుందా? ఆ తర్వాత ఏం జరుగుతుంది? జీఎస్ఎన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? బట్టతల కూడా అందమేనని ఎలా తెలుసుకుంటాడనేది తెరపైనే చూడాలి.
విశ్లేషణ: చాలామంది మనిషి రూపాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. వారి లోపాలను హేళన చేస్తూ బతుకు మీదే విరక్తి పుట్టేలా చేస్తారు. అలాంటి వ్యక్తులకు కనువిప్పు కలిగించేదే ఈ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా. దీన్ని చిన్న సినిమా అనుకుని తక్కువ అంచనా వేసుకుని వెళ్తే పొరపాటు పడినట్లే. ఎందుకంటే.. అవసరాల మిమ్మల్ని నవ్విస్తాడు.. చివరికి ఏడిపిస్తాడు. బట్టతలతో బాధపడే వ్యక్తులకు ప్రతిరూపంలా కనిపిస్తాడు అవసరాల. తన అందానికి బట్టతలే అడ్డమని ఫీలయ్యే యువకుడి పాత్రలో అవసరాల జీవించాడనే చెప్పాలి. దర్శకుడు విద్యాసాగర్ అవసరాల శ్రీనివాస్ అందించిన కథను చక్కగా తెరకెక్కించారనే చెప్పుకోవాలి. ఈ సినిమా ఫస్టాఫ్ నవ్వులు పూయిస్తుంది. అయితే, సెకండ్ ఆఫ్‌లో మాత్రం భావోద్వేగ సన్నివేశాలతో గుండె బరువెక్కిస్తుంది.
ఈ సినిమాలో కామెడీ సీన్లు తప్పకుండా కట్టిపడేస్తాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తుతెచ్చుకుని నవ్వుకొనేలా అనిపిస్తాయి. విగ్గుతో ఆ అందగాడు పడే తిప్పలను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. సెకాండాఫ్‌లో కూడా కామెడీ సీన్లు బాగా పండాయి. కొన్ని డైలాగులు మనసును తాకుతాయి. హీరోయిన్ రుహానీ శర్మ విషయానికి వస్తే తన పరిధి మేరకు చక్కగా నటించింది. మిగతా నటులు కూడా పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. సినిమాలో ఎక్కడా సాగదీత అనిపించదు.. వినోదాత్మకంగా సాగిపోతుంది. సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ మంచి పాటలను అందించాడు. కాసేపు కష్టాలను మరిచిపోయి హాయిగా నవ్వుకోవాలంటే ఈ సినిమాను చూడవచ్చు.
విడుదల తేదీ: 03.09.2021
నటీనటులు: అవసరాల శ్రీనివాస్ ,రుహానీ శర్మ, రోహిణి, రాకెట్ రాఘవ, శివన్నారాయణ
దర్శకుడు: రాచకొండ విద్యాసాగర్
నిర్మాతలు: శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
సంగీతం: శక్తికాంత్ కార్తీక్