War 2 Review - 'వార్ 2' రివ్యూ: ఎన్టీఆర్... హృతిక్... ఇద్దరిలో ఎవరి డామినేషన్ ఎక్కువ - స్పై యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా?
War 2 Review In Telugu: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'వార్ 2'. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.
అయాన్ ముఖర్జీ
ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు
NTR and Hrithik Roshan's War 2 Review In Telugu: 'ఆర్ఆర్ఆర్', 'దేవర'తో నార్త్ ఇండియాలోనూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన స్ట్రెయిట్ హిందీ సినిమా 'వార్ 2'. ఇందులో హృతిక్ రోషన్ మరొక హీరో. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో తెరకెక్కిన చిత్రమిది. కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూస్తే...
కథ (War 2 Story Telugu): ఇండియన్ 'రా'ను కాదనుకుని వెళ్లిన కబీర్ (హృతిక్ రోషన్) కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారాడతాడు. కిల్లింగ్ కాంట్రాక్ట్స్ ఇచ్చే కలి కార్టెల్ (భారత సరిహద్దు దేశాలకు సంబంధించిన మనుషులతో కూడినది) అతడిని తమ బృందంలో చేర్చుకోవాలని అనుకుంటుంది. దానికి ముందు తాను తండ్రిలా భావించే కల్నల్ లూత్రా (అశుతోష్ రాణా)ను చంపమని కబీర్‌ను ఆదేశిస్తుంది. అతను చంపేస్తాడు.
లూత్రా మరణం తర్వాత రా చీఫ్ స్థానంలోకి విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్) వస్తాడు. అతని 'రా' బృందంలో లూత్రా కుమార్తె కావ్య (కియారా అద్వానీ), విక్రమ్ (ఎన్టీఆర్) కీలక సభ్యులు. లూత్రాను చంపిన కబీర్ అన్వేషణలో కావ్య, విక్రమ్ ఏం తెలుసుకున్నారు? కబీర్ - విక్రమ్ ఎటువంటి యుద్ధం చేశారు? రఘు (ఎన్టీఆర్) ఎవరు? దావోస్‌లో ఏం జరిగింది? కావ్యకు తెలిసిన నిజం ఏమిటి? ఎవరు ఎవరి గూఢచారి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (War 2 Review Telugu): జేమ్స్ బాండ్ సినిమాలకు ఇండియాలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు కారణం కేవలం యాక్షన్ మాత్రమే కాదు... ప్రపంచ వినాశం కోరే మనుషులకు వ్యతిరేకంగా జేమ్స్ బాండ్ పోరాడతాడు. వాళ్ళను అంతం చేసి ప్రజలను రక్షిస్తాడు. ట్విస్ట్ & స్క్రీన్ ప్లేకు తోడు భారీ యాక్షన్ సీన్స్ అందరినీ అలరిస్తాయి. జేమ్స్ బాండ్ స్థాయిలో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ స్పై యూనివర్స్ తీసుకొచ్చింది. 'ఏక్ థా టైగర్', 'వార్', 'టైగర్ జిందా హై', 'పఠాన్' సినిమాలతో విజయాలు అందుకుంది. 'టైగర్ 3' డిజప్పాయింట్ చేసినా... 'వార్ 2' మీద తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి కలగడానికి కారణం ఎన్టీఆర్.
ఎన్టీఆర్ నటించడం వల్ల 'వార్ 2' మీద ఆసక్తి పెరిగింది. హిందీలో తొలి సినిమా కనుక మంచి కథ, క్యారెక్టర్ ఎంపిక చేసుకుని ఉంటారని ఆడియన్స్, ముఖ్యంగా ఫ్యాన్స్ ఆశించారు. అయితే... ఆ విషయంలో 'వార్ 2' డిజప్పాయింట్ చేసింది. ఇదొక రెగ్యులర్ రొటీన్ స్పై థ్రిల్లర్. ఫస్టాఫ్ వరకు 'వార్'ను మరోసారి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథలో ట్విస్ట్ ఇచ్చారు. హీరోలు ఇద్దరు మధ్య కాన్‌ఫ్లిక్ట్ కొత్తగా రాశారు. స్పై ఫ్రాంచైజీలో ఆ ఫార్ములా సెట్ కాలేదు. దాంతో థ్రిల్ ఇవ్వాల్సిన సీన్లు స్పై జానర్ నుంచి బయటకు వచ్చాయి రెగ్యులర్ రొటీన్ రివేంజ్ డ్రామా అయ్యింది. 'వావ్ ఫ్యాక్టర్' మిస్ అయ్యింది. ఎన్టీఆర్‌ను హృతిక్ పొగిడే సన్నివేశాలు ఉన్నాయ్. కొన్నిచోట్ల ఎలివేషన్ ఇచ్చారు. కానీ ఓవరాల్ సినిమా చూస్తే... మన హీరోకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనిపిస్తుంది.
నిర్మాత - కథా రచయిత ఆదిత్య చోప్రా నుంచి ఇటువంటి రొటీన్ స్పై థ్రిల్లర్ స్టోరీ రావడం ఆశ్చర్యం కలిగించింది. సీన్స్, ఫైట్స్ నుంచి ట్విస్ట్స్ & టర్న్స్ వరకు ఒక్క అంశంలోనూ ఎగ్జైట్ చేయలేదు. స్పై థ్రిల్లర్స్ తీసేటప్పుడు లాజిక్స్ కొన్ని ఫాలో అవ్వడం చాలా అవసరం. హృతిక్, ఎన్టీఆర్ సాంగ్ వచ్చేముందు సన్నివేశంలో హీరోలు ఇద్దరూ కలిస్తే కార్టెల్‌కు తెలియలేదా? అని సందేహం కలుగుతుంది. ఎన్టీఆర్ రోల్ గురించి ట్విస్ట్ రివీల్ అయ్యాక అంత పెద్ద రా ఏజెంట్ కబీర్ ఆ విషయం ఎలా మిస్ అయ్యాడు? అనిపిస్తుంది. ట్విస్టులు చెప్పవద్దని ఎన్టీఆర్, హృతిక్ రిక్వెస్ట్ చేశారు గానీ... అవేమంత గొప్ప ట్విస్టులు కావు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం సైతం హీరోయిజాన్ని ఎలివేట్ చేయలేదు. వీఎఫ్ఎక్స్ విషయంలో కేర్ తీసుకోలేదు. పాటలు - నేపథ్య సంగీతం అసలు బాలేదు. 'వార్ 2'కు దర్శక నిర్మాతలను ఒక్క విషయంలో మెచ్చుకోవాలి.... ఎన్టీఆర్, హృతిక్ వంటి స్టార్ హీరోలను ఒప్పించినందుకు! వాళ్ళ డ్యాన్స్ వల్ల 'సలామ్ అనాలి', కియారా బికినీ సీన్ వల్ల 'ఊపిరి ఊయలగా...' తెరపై చూడొచ్చు.
కబీర్ పాత్రలో మరోసారి హృతిక్ రోషన్ నటన ఓకే. ఆయన అభిమానులు మెచ్చేలా లుక్స్, స్టైల్ ఉన్నాయి. విక్రమ్ చలపతి పాత్రలో ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేశారు. ఆ పాత్రకు చిన్న కామెడీ టచ్ ఇచ్చారు. హీరోయిజం చూపించే సన్నివేశాల్లో అసలు తగ్గలేదు. విమానం మీద తీసిన యాక్షన్ సీన్, ఆ తర్వాత సీన్... క్లైమాక్స్ వరకు ప్రతి చోటా హృతిక్ రోషన్ కాంబినేషన్ సన్నివేశాల్లో ఏమాత్రం తగ్గలేదు. ఢీ అంటే ఢీ అన్నట్టు చేశారు. కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా సహా మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
స్పై థ్రిల్లర్ సినిమాలకు అవసరమైన కథ గానీ, రేసీ స్క్రీన్ ప్లే గానీ 'వార్ 2'లో లేవు. యాక్షన్ సీన్స్ పర్వాలేదు. హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తమ శక్తిమేరకు 'వార్ 2'ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ కాంబినేషన్ కోసం అయితే థియేటర్లకు వెళ్ళవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు తక్కువ పెట్టుకోవడం మంచిది. ఇది స్పై యాక్షన్ థ్రిల్లర్ కాదు... రివేంజ్ డ్రామా!





















