Superman Movie Review - సూపర్ మ్యాన్ రివ్యూ: కమల్ 'ఇండియన్ 2'ను గుర్తు చేసే సీన్... మరి, సినిమా? డీసీ హిట్టు కొట్టిందా?
Superman Review In Telugu: 'సూపర్ మ్యాన్'కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. డీసీ స్టూడియోస్ సంస్థ అందుకే తెలుగులోనూ విడుదల చేసింది. డేవిడ్ కొరెన్‌స్వెట్ నటించిన అమెరికన్ సూపర్ హీరో సినిమా ఎలా ఉందంటే?
జేమ్స్ గన్
డేవిడ్ కొరెన్‌స్వెట్, రాచెల్ బ్రోస్‌నేన్, నికోలస్ హోల్ట్ తదితరులు
DC Universe Latest Movie Superhero 2025 Review In Telugu: అమెరికన్ సూపర్ హీరో సినిమాలకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే డీసీ, మార్వెల్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధాలు జరుగుతాయి. క్రిస్టోఫర్ నోలన్ తీసిన డార్క్ నైట్ ట్రయాలజీ డీసీ సంస్థకు విజయాలు అందించింది. ఆ తర్వాత వండర్ వుమెన్, ఆక్వామ్యాన్ తరహాలో వాటి సీక్వెల్స్ గానీ, మిగతా సినిమాలు గానీ హిట్ అవ్వలేదు. మరోవైపు మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఎవెంజర్స్, రీసెంట్ డెడ్‌పూల్ విజయాలు సాధించాయి. కలెక్షన్లు కుమ్మేశాయి. డీసీ స్టూడియోస్ కంటే ఓ అడుగు ముందుకు వెళ్ళింది మార్వెల్. మరి, డీసీ నుంచి వచ్చిన తాజా సినిమా 'సూపర్ మ్యాన్' ఎలా ఉంది? మార్వెల్ నుంచి డీసీకి వచ్చిన దర్శకుడు, 'గార్డియన్ ఆఫ్ గాలక్సీ' ఫేమ్ జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏముంది? అనేది చూస్తే...
కథ (Superman Story): బోరేవియా మిలటరీ నుంచి జహ్రాన్ పూర్ ప్రజలను కాపాడటానికి సూపర్ మ్యాన్ (డేవిడ్ కొరెన్‌స్వెట్) వెళతాడు. టెక్నాలజీతో లెక్స్ లూథర్ (నికోలస్ హోల్ట్) సృష్టించిన హమ్మర్ (భారీ రోబోట్?) చేతిలో ఘోరంగా ఓడిపోతాడు. ఆ యుద్ధం (ఫైట్)లో సూపర్ మ్యాన్ ప్రతి అడుగును ముందుగా అంచనా వేస్తాడు లెక్స్.
లెక్స్ లూథర్ తన స్వప్రయోజనాల కోసం బోరేవియా, జహ్రాన్ పూర్ సరిహద్దుల మధ్య యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కల్పిస్తాడు. ప్రజల్లో సూపర్ మ్యాన్ ఒక దేశద్రోహి అని ముద్ర వేస్తాడు. సోషల్ మీడియాలోనూ వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయిస్తాడు.
లెక్స్ లూథర్ సృష్టించిన అడ్డంకులను ఎదుర్కొని సూపర్ మ్యాన్ తన నిజాయతీని ఎలా నిరూపించుకున్నాడు? ఈ ప్రయాణంలో అతనికి గాళ్ ఫ్రెండ్ లూయిస్ లేన్ (రాచెల్ బ్రోస్‌నేన్), ఇంకా స్నేహితులు ఏ విధమైన సాయం చేశారు? సూపర్ డాగ్ ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Superman Review Telugu): 'సూపర్ మ్యాన్' ఎలా ఉందో చెప్పే ముందు ఒక్క సన్నివేశం గురించి ప్రత్యేకంగా చెప్పాలి... ప్రజలు అందరూ హీరోలా చూసే 'సూపర్ మ్యాన్'ను లెక్స్ లూథర్ ద్రోహిగా చిత్రీకరిస్తాడు. ఒక్కసారిగా ప్రజల్లో మార్పు వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో నెగెటివ్ క్యాంపెయిన్ మొదలు పెడతారు. ఆ కామెంట్స్ వెనుక ఎవరు ఉన్నారు? అనేది పక్కన పెడితే... ఆ సీన్ చూసేటప్పుడు 'గో బ్యాక్ ఇండియన్' అంటూ 'భారతీయుడు 2'లో కమల్ హాసన్ మీద ప్రజలు ద్వేషం వ్యక్తం చేయడం గుర్తుకు వస్తుంది. 'గో బ్యాక్ సూపర్ మ్యాన్' టైపులో ఉంటుంది. అక్కడ నుంచి 'వుయ్ వాంట్ సూపర్ మ్యాన్' తరహాలో ప్రజలు అతడిని ఎప్పుడు పిలిచారు? అనేది సినిమా. 'భారతీయుడు 2', 'సూపర్ మ్యాన్' నేపథ్యాలు వేరు. కానీ, రెండిటిలోనూ కోర్ పాయింట్ ఒక్కటే... హీరోను ఒక్కసారిగా ద్వేషించడం, మళ్ళీ అతడిని కావాలనుకోవడం, ప్రజల కోసం హీరో ఫైట్ చేయడం!
'భారతీయుడు 2'తో కంపేరిజన్ తీసి పక్కన పెట్టి, 'సూపర్ మ్యాన్' ఎలా ఉంది? అనే విషయానికి వస్తే... దర్శకుడు జేమ్స్ గన్ కథలో డెప్త్ చూపించడానికి ఇష్టపడలేదు. స్క్రీన్ మీద ఆ మూమెంట్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే చాలు అన్నట్టు యాక్షన్ సీన్లు డిజైన్ చేశారు. నవ్వించే ప్రయత్నం చేశారు. ఎమోషన్స్ చూపించారు. ఒక ప్రోపర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అందించే ప్రయత్నం చేశారు.
'సూపర్ మ్యాన్' నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్ సీన్స్ ఇవ్వడంలో జేమ్స్ గన్ సక్సెస్ అయ్యాయి. యాక్షన్ సీన్ గూస్ బంప్స్ ఇవ్వాలంటే వాటి వెనుక అంతే బలమైన ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ ఇవ్వడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సూపర్ మ్యాన్ కాకుండా మిగతా సూపర్ హీరో క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంటే... వాళ్ళ గురించి డెప్త్‌గా చెప్పలేదు. అందువల్ల, వాళ్ళు ఫైట్ చేసినా ఎమోషన్‌తో కనెక్ట్ కాలేం. లెక్స్ లూథర్ టెక్ మొఘల్ కింద ఎలా మారాడు? బోరేవియా, జోహ్రాన్ పూర్ మధ్య ఎందుకు యుద్ధం పెట్టాడు? పాకెట్ యూనివర్స్ ఎలా క్రియేట్ చేశారు? వంటి ప్రశ్నలకు బలమైన కారణాలు చూపించలేదు.
డీఎన్ఏ ద్వారా మాత్రమే ఓపెన్ అయ్యే సూపర్ మ్యాన్ సీక్రెట్ ఛాంబర్ (హోమ్?)ను విలన్ ఎలా ఓపెన్ చేశాడు? అనేదానికి చెప్పిన కారణం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు ఉంది. అందువల్ల, కథ పరంగా సూపర్ మ్యాన్ ఎగ్జైట్ చేయలేదు. విలన్ దగ్గర అమ్మాయి పంపిన ఫోటోలు చూసి హీరోయిన్ కనిపెట్టడం చూస్తే మరీ కామెడీగా ఉంది. తండ్రీ కొడుకుల ఎమోషన్ ఒక్కటీ (హీరో & ఫాదర్, పాకెట్ యూనివర్స్‌లో మరో ఫాదర్ & సన్) ఎమోషన్ బాగా చూపించారు. టెక్నికల్ పరంగా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది.
వీఎఫ్ఎక్స్ పరంగా 'సూపర్ మ్యాన్' కథకు తగ్గట్టు ఉంది. హీరో హీరోయిన్స్ మధ్య ఓ సీన్ ఉంది. వాళ్లిద్దరి మాట్లాడుకుంటుంటే... వెనుక కలర్ ఫుల్ విజువల్ క్రియేట్ చేశారు దర్శకుడు. సూపర్ మ్యాన్ ఫ్రెండ్స్ ఓ మిషన్ మీద ఉంటారు. పిల్లల్ని అటువంటి విజువల్స్ ఆకట్టుకుంటాయి. డీసీ అభిమానులను కూడా! కెమెరా వర్క్ బావుంది. డీసీ బాగా ఖర్చు చేసిందని అర్థం అవుతుంది.
సూపర్ మ్యాన్, క్లెంట్ కార్క్... రెండు పాత్రల్లోనూ డేవిడ్ కొరెన్‌స్వెట్ బావున్నారు. అయితే... నటుడిగా ఆయనకు తన టాలెంట్ చూపించే స్కోప్ రాలేదు. రాచెల్ అందం ఆకట్టుకుంటుంది. గుండుతో నికోలస్ తనదైన విలనిజం చూపించారు. ఇక మిగతా క్యారెక్టర్లు తమ పరిధి మేరకు చేశారు. అందరి కంటే ఎక్కువగా ప్రేక్షకులకు గుర్తుండేది మాత్రం సూపర్ డాగ్. యాక్షన్ చేసింది. తన చేష్టలతో నవ్వించింది కూడా!
సూపర్ మ్యాన్... డీసీ అభిమానులకు నచ్చుతాడు. వాళ్ళు కోరుకునే యాక్షన్, ఇంకా కామెడీ ఉందీ సినిమాలో! కథ, ఆ పొలిటికల్ పాయింట్ పక్కన పెడితే... సూపర్ మ్యాన్ స్పీడుగా ముందుకు కదిలింది. రన్ టైమ్ తక్కువ ఉండటం, వర్కవుట్ అయ్యే కామెడీ ఉండటం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. డీసీ & సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. డీసీ హీరోలను డార్క్ వరల్డ్స్‌లో ఆడియన్స్ చూశారు. కానీ, కామెడీతో సినిమా తీశారు. ఈ జనరేషన్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా తీశారు.





















