O2 Review: ఓ2 సినిమా రివ్యూ: పెళ్లి తర్వాత నయనతార మొదటి సినిమా ఎలా ఉందంటే?
పెళ్లి తర్వాత నయనతార మొదటి సినిమా ఓ2 ఎలా ఉందంటే?
జీఎస్ విగ్నేష్
నయనతార, రిత్విక్ జోతి రాజ్, భరత్ నీలకంఠన్ తదితరులు
సినిమా రివ్యూ: ఓ2
రేటింగ్: 2.5/5
నటీనటులు: నయనతార, రిత్విక్ జోతి రాజ్, భరత్ నీలకంఠన్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
దర్శకత్వం: జీఎస్ విగ్నేష్
స్ట్రీమింగ్ తేదీ: జూన్ 17, 2022
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం: డిస్నీప్లస్ హాట్‌స్టార్
తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో నయనతారకు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. ఒకవైపు కమర్షియల్ పాత్రలు పోషిస్తూనే, మరోవైపు విభిన్నమైన లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను దాదాపు 19 సంవత్సరాల నుంచి విజయవంతంగా కొనసాగిస్తుంది. నయన్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుందంటే అందులో సమ్‌థింగ్ స్పెషల్ ఉందని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నయనతార ప్రధాన పాత్రలో ఒక సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఓ2‘టీజర్ నుంచే ఆడియన్స్‌లో అంచనాలు పెంచింది. విగ్నేష్ శివన్‌తో పెళ్లయ్యాక విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఓ2 ఆ అంచనాలను అందుకుందా?
కథ: పార్వతి (నయనతార) కొడుకు వీర (రిత్విక్ జోతి రాజ్)కు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉంటుంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే తనకు ఊపిరి అందదు. అవయవ దానానికి సంబంధించిన ఆపరేషన్ కోసం చిత్తూరు నుంచి కొచ్చిన్‌కు బయలుదేరుతుంది. అయితే దారిలో వర్షం కారణంగా కొండచరియలు విరిగి బస్సుపై పడటంతో బస్సు రోడ్డుతో సహా 16 అడుగులకు పైగా బురదలో కూరుకుపోతుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోవాలనుకునే ఒక జంట, డ్రగ్స్ సప్లై చేసే ఒక పోలీసు, జ్యోతిషుడు చెప్పాడని కారులో కాకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఒక ఎక్స్-ఎమ్మెల్యే ఇలా చాలా మంది ఆ బస్సులో ఉంటారు. మరి వీరిలో ఎంతమంది బతికారు? ఆక్సిజన్ కోసం ఒకరినొకరు చంపుకోవాల్సి వచ్చినప్పుడు వారి మానసిక స్థితి ఎలా మారింది? అసలు వారు బతికారా? ఇలాంటి వివరాలు తెలియాలంటే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ: బురదలో కూరుకుపోయిన ఒక బస్సు, అందులో వేర్వేరు మనస్తత్వాలున్న వ్యక్తులు ఎలా బతికి బయటపడ్డారనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఇలాంటి పాయింట్‌ను తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లే మీద మరింత గట్టిగా కూర్చోవాలి. ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా రాసుకోవాలి. కానీ ఇక్కడే రైటర్, డైరెక్టర్ జీఎస్ విగ్నేష్ తడబడ్డారు. పాత్రల నేపథ్యాలు, వారు బస్సులో ఎక్కడం, యాక్సిడెంట్ అవ్వడం వరకు సినిమా సాఫీగానే సాగుతుంది.
కానీ ఎప్పుడైతే బస్సు లోయలో పడిందో, అక్కడే సినిమా కూడా లోయలో పడిపోయింది. కొడుకు ప్రాణాల కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయని తల్లిగా నయనతార ఒకవైపు సినిమాను లేపడానికి ప్రయత్నిస్తున్నా... స్క్రీన్‌ప్లేలో లోపాల కారణంగా అది సాధ్యపడలేదు. చివర్లో బస్సు నుంచి రెస్క్యూ టీమ్‌కి ఎవరు సమాచారం ఇచ్చారు అనే సన్నివేశం చూస్తే... గూస్‌బంప్స్ రావాల్సింది పోయి నవ్వు వస్తుంది. ఇలాంటి కథల్లో ముగింపు ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ అసలు కథ ప్రారంభం అయినప్పటికీ కథ ముగింపుకు మధ్య ఉండే భాగాన్ని ఎంత థ్రిల్లింగ్‌గా నడిపించాం అనే దానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అక్కడ సినిమా స్లో అయింది కాబట్టి ముగిసేసరికి సోసో గానే అనిపిస్తుంది.
సినిమాలో అక్కడక్కడా సంభాషణలు ఆకట్టుకుంటాయి. ‘దేవుడిచ్చిన లోపాన్ని కూడా తల్లి సరిచేయగలదు.’ ఇది సినిమాలో ఒక డైలాగ్. సినిమా కథ మొత్తాన్ని ఒక్కమాటలో చెప్పేశారు. సినిమాటోగ్రాఫర్ తమిళ్ ఏ.అళగన్‌కు వంద మార్కులు వేయవచ్చు. సెకండాఫ్ మొత్తం దాదాపుగా బస్సులోనే జరుగుతుంది. అయినా కంటికి విజువల్‌గా ఎక్కడా ఇబ్బందిగా అనిపించదు. సినిమా ప్రారంభంలో ఒక్క పాట మాత్రమే ఉంటుంది. అది సోసో గానే ఉన్నా విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
Also Read: 'విరాట పర్వం' రివ్యూ: రానా, సాయి పల్లవి సినిమా ఎలా ఉందంటే?
ఇక నటీనటుల విషయానికి వస్తే... నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి పాత్రలు తనకు కొట్టిన పిండి. రైటింగ్ పరంగా బలహీనంగా ఉన్న సన్నివేశాలను నటనతో పైకి లేపగల అతికొద్ది మంది పెర్ఫార్మర్లలో నయనతార ఒకరు. ఈ కథకు తను కచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్. ఇక వీర పాత్రలో నటించిన బాబు రిత్విక్ జోతిరాజ్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఒకానొక దశలో కేవలం తను మాత్రమే స్క్రీన్ మీద కనిపించాల్సి వచ్చిన సమయంలో రిత్విక్ బాగా నటించాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. బస్సులో ఉన్న వారికి మాత్రమే ఇందులో పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉంది. వారంతా తమ నటనతో ఆకట్టుకుంటారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ వీకెండ్‌లో ఇంట్లో కూర్చుని ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌ను చూడాలనుకుంటే ఓ2ని ఎంచుకోవచ్చు. కానీ అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటే మాత్రం నిరాశపడతారు.
Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?