Miral Movie Review - మిరల్ రివ్యూ: రెండేళ్లకు తెలుగులో రిలీజైన 'ప్రేమిస్తే' భరత్ సినిమా - హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Miral Movie Telugu Review: 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ హీరోగా నటించిన తమిళ సినిమా 'మిరల్'. తమిళనాట 2022లో విడుదలైంది. తెలుగులో ఇవాళ థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
ఎం శక్తివేల్
భరత్, వాణీ భోజన్, మాస్టర్ అంకిత్, కెఎస్ రవికుమార్, రాజ్ కుమార్, కావ్య అరివుమణి తదితరులు
Miral Movie Review 2024 Telugu: 'ప్రేమిస్తే'తో తెలుగు ప్రేక్షకులలోనూ పేరు, గుర్తింపు సొంతం చేసుకున్న కోలీవుడ్ హీరో భరత్. తెలుగులో 'స్పైడర్', 'హంట్' సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. భరత్ హీరోగా నటించిన 'మిరల్' రెండేళ్ల క్రితం తమిళనాట థియేటర్లలో విడుదలైంది. తమిళ వెర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇప్పుడీ సినిమాను తెలుగులో అనువదించి థియేటర్లలో విడుదల చేశారు. ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Miral Movie Story Telugu): భర్త హరి (భరత్), కుమారుడు సాయి (మాస్టర్ అంకిత్)తో కలిసి ఊరు వెళ్తుండగా... భర్త మీద ఎవరో ముసుగు మనిషి దాడి చేసి తనను, పిల్లాడిని తీసుకు వెళ్లినట్లు రమా (వాణీ భోజన్)కు పీడ కల వస్తుంది. ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లిన హరి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి రమా తల్లి నుంచి ఫోన్ వస్తుంది. ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల ముందుగా జాతకాలు చూపించలేదని, ఇద్దరి జాతకాల్లో ప్రమాదం పొంచి ఉందని, ఊరు వచ్చి కుల దైవానికి పూజ చేయమని చెబుతుంది. సరేనని భార్య, కుమారుడితో అత్తారింటికి వెళతాడు హరి.
హరి ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అర్ధరాత్రి ఊరు నుంచి ఫ్యామిలీ అంతా బయలుదేరతారు. మెయిన్ రోడ్డులో వెళ్లాల్సిన హరి అండ్ ఫ్యామిలీ కారు ఓ కారణం చేత మట్టి రోడ్డులోకి వెళుతుంది. ఆ రూటులో 15 ఏళ్ల క్రితం వెళ్లిన ఫ్యామిలీ ప్రాణాలతో తిరిగి రాలేదు. అక్కడొక ఆత్మ ప్రజల ప్రాణాలు తీసుకుంటుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని, ఆ రోడ్డులోకి రాత్రి వేళలో వెళ్లడానికి భయపడతారు. హరి అండ్ ఫ్యామిలీకి ఆ రోడ్డులో ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యారు? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? హరి మావయ్య (కెఎస్ రవికుమార్), స్నేహితుడు ఆనంద్ (రాజ్ కుమార్) ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Miral Telugu Review): తమిళనాట 'మిరల్'కు మంచి రివ్యూస్ వచ్చాయి. ఓటీటీలో కూడా చక్కటి వీక్షకాదరణ లభించింది. అయితే, ఇదొక ప్రయోగాత్మక సినిమా. తెలుగుకు కొత్త అని చెప్పలేం. ఇటివంటి కథ, కథనాలతో సినిమాల వచ్చాయి. పతాక సన్నివేశాల్లో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక... రవితేజ హీరోగా వచ్చిన 'సారొచ్చారు', రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'పొలిమేర' గుర్తు వచ్చే అవకాశం ఉంది కొందరికి. ఆ సినిమాలు పక్కన పెట్టి... 'మిరల్' ఎలా ఉందనేది చూస్తే?
ఒక్క ముక్కలో చెప్పాలంటే... హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన రివేంజ్ డ్రామా 'మిరల్'. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎటువంటి కొత్తదనం లేదు. సగటు థ్రిల్లర్ సినిమాలను మిక్సీలో వేసి తీసినట్టు ఉంటుంది. రొటీన్ కథ, సీన్లు రాసినప్పటికీ... కొన్ని కొన్ని సన్నివేశాల్లో హారర్ / థ్రిల్ ఫ్యాక్టర్ వర్కవుట్ అయ్యింది
ప్రేక్షకులకు కొత్త కథ, అనుభూతి ఇవ్వడంలో... హారర్ సన్నివేశాలతో ఉత్కంఠకు గురి చేయడంలో దర్శకుడు ఎం శక్తివేల్ ఫెయిల్ అయ్యాడు. హారర్ సినిమాలకు తగ్గట్టు కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వరుసపెట్టి ట్విస్టులు రివీల్ చేసి అప్పటి వరకు ఉన్న థ్రిల్లర్ ఫీల్ కూడా పోయేలా చేశారు. మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక అప్పటి వరకు ఇంపాక్ట్ అంతా తగ్గేలా చేశారు.
భరత్ మంచి యాక్టర్. అతడికి గొప్పగా నటించే అవకాశం హరి క్యారెక్టర్ ఇవ్వలేదు. కానీ, ఆ పాత్రకు తగ్గట్టు నటించారు. హరికి బెస్ట్ ఇచ్చారు. తెలుగులో 'మీకు మాత్రమే చెప్తా'లో వాణీ భోజన్ నటించారు. రమా పాత్రలో ఆవిడ నటన ఓకే. అంతకు మించి ఆశించలేం కూడా! కెఎస్ రవికుమార్ సహా మిగతా పాత్రధారులు అందరూ రెగ్యులర్ రోల్స్ చేశారు. ఒక్క రాజ్ కుమార్ తప్ప. ఆయన నటన పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ మాత్రం ఘోరంగా ఉంది. ఆ విషయంలో జాగ్రత్త ఎందుకు తీసుకోలేదో మరి!
'మిరల్' రెగ్యులర్, రొటీన్ రివేంజ్ హారర్ డ్రామా. కానీ, హారర్ సినిమా ప్రేమికులను మెప్పించే కంటెంట్ ఉంది. ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ సీన్లు సగటు సామాన్య ప్రేక్షకుల్ని భయపెడతాయి. థ్రిల్ ఇస్తాయి. ఓపిక చేసుకుని చూడాల్సిన సినిమా.