Doctor Strange in the Multiverse of Madness Review: డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ రివ్యూ: మార్వెల్ మంత్రం పని చేసిందా?
మార్వెల్ కొత్త సినిమా డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సామ్ రైమి
బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, ఎలిజబెత్ ఓల్సెన్, బెనెడిక్ట్ వాంగ్ తదితరులు
సినిమా రివ్యూ: డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్
రేటింగ్: 3/5
నటీనటులు: బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, ఎలిజబెత్ ఓల్సెన్, బెనెడిక్ట్ వాంగ్ తదితరులు
ఎడిటర్: బాబ్ మురాస్కీ, టియా నోలాన్
సినిమాటోగ్రఫీ: జాన్ మ్యాతీసన్
సంగీతం: డానీ ఎల్ఫ్‌మ్యాన్
నిర్మాత: కెవిన్ ఫీజ్
దర్శకత్వం: సామ్ రైమీ
విడుదల తేదీ: మే 6, 2022
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (Marvel Cinematic Universe)లో లేటెస్ట్‌గా వచ్చిన సినిమా ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’. ఈ యూనివర్స్‌లో ఇది 28వ సినిమా. 2004 నుంచి 2007 మధ్యలో వచ్చిన స్పైడర్ మ్యాన్ చిత్రాల దర్శకుడు సామ్ రైమి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. స్పైడర్ మ్యాన్: నో వే హోం సినిమాలో అందరినీ ఆకట్టుకున్న మల్టీవర్స్ కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెరకెక్కడం, టీజర్, ట్రైలర్లలో ఒకే పాత్రకు సంబంధించిన వేర్వేరు వెర్షన్లను చూపించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఆకాశాన్నంటింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా?
కథ: అమెరికా చావెజ్‌కు (సోచీ గోమెజ్) ఒక విశ్వం నుంచి మరో విశ్వానికి ప్రయాణించే శక్తి ఉంటుంది. కానీ దాన్ని ఎలా అదుపు చేయాలో తెలియదు. ఆ శక్తిని సొంతం చేసుకోవడానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటారు. మరో విశ్వంలోని భూమికి చేరుకుంటుంది. అక్కడ డాక్టర్ స్ట్రేంజ్ (బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్) తనను కాపాడతాడు. అమెరికా చావెజ్ కథ మొత్తం తెలుసుకున్నాక తనను కాపాడటం అనుకున్నంత సులువు కాదని తెలుస్తుంది. దీంతో వాండా మాక్సిమాఫ్ (ఎలిజబెత్ ఓల్సెన్) సాయం కోరతాడు. అసలు అమెరికా చావెజ్ శక్తిని సొంతం చేసుకోవాలనుకుంటుంది ఎవరు? డాక్టర్ స్ట్రేంజ్ తనను అడ్డుకున్నాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: మార్వెల్ యూనివర్స్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది కచ్చితంగా నిరాశ పరచదని ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా అంచనా వేస్తారు. ఎందుకంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌కు ముందు వరకు ఈ యూనివర్స్‌లో మొత్తం 27 సినిమాలు వస్తే... అందులో బ్లాక్ విడో, ఎటర్నల్స్ సినిమాలు మాత్రమే యావరేజ్‌గా నిలిచాయి. మిగతావన్నీ బ్లాక్‌బస్టర్లే. దాదాపు 15 సంవత్సరాలుగా ఒకే స్టోరీ లైన్‌తో సినిమాలు తీస్తూ సక్సెస్‌లు కొట్టడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఫ్యాన్ బేస్‌ను మార్వెల్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ మార్వెల్ స్థాయిని మరింత పెంచేలానే ఉంది తప్ప నిరాశ పరచదు.
సినిమాలో వాండా మాక్సిమాఫ్/స్కార్లెట్ విచ్, డాక్టర్ స్ట్రేంజ్‌తో ‘నువ్వు నియమాలను అతిక్రమించి హీరో అయ్యావు. అదే పని నేను చేసి విలన్ అయ్యాను. ఇది ఏమాత్రం న్యాయం కాదు.’ అని ఒక డైలాగ్ చెబుతుంది. ఈ సినిమా కథ మొత్తం ఈ డైలాగ్‌లోనే ఉంది. విశ్వానికి సంబంధించిన కొన్ని నియమాలు బ్రేక్ చేయడం, వాటికి చెల్లించే మూల్యం చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. ఒకవేళ నియమాలు అతిక్రమించినా... మంచి కోసం చేస్తే హీరో అవుతారు, స్వార్థం కోసం చేస్తే విలన్ అవుతారనే విషయాన్ని చాలా భయపెట్టే విధంగా చెప్పారు.
మార్వెల్ సినిమాలన్నిటి కంటే ఈ సినిమాలో వయొలెన్స్, హార్రర్ పాళ్లు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా క్లైమ్యాక్స్ సన్నివేశాల్లో వచ్చే డాక్టర్ స్ట్రేంజ్ వెర్షన్ మరింత భయానకంగా ఉంటాడు. కొత్త కెప్టెన్ మార్వెల్‌ని ఇందులో చూపించడంతో పాటు ఎక్స్-మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ వంటి పాత్రలను ఇందులో పరిచయం చేస్తారు. యాక్షన్ సన్నివేశాలు అయితే నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. డైరెక్టర్ సామ్ రైమి గతంలో స్పైడర్ మ్యాన్ సినిమాలతో పాటు, ఎంతో ఫేమస్ హార్రర్ సినిమాలు అయిన ‘ఈవిల్ డెడ్’ సిరీస్‌ను కూడా తెరకెక్కించాడు. ఆ అనుభవం ఈ సినిమాకు మరింత ఉపయోగపడింది.
సూపర్ హీరో సినిమాలో హార్రర్ ట్రై చేయడం ఇదే మొదటిసారి. వాండాకు, తన పిల్లలకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. డాక్టర్ స్ట్రేంజ్ పాత్రకు సంబంధించిన ఎమోషనల్ డెప్త్‌ను కూడా ఇందులో పరిచయం చేశారు. రానున్న సినిమాల్లో దీనిపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అక్కడక్కడా సినిమా గ్రాఫ్ కొంచెం తగ్గినట్లు ఉండటం కొంచెం మైనస్. సినిమాలో విజువల్స్, గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. వేర్వేరు విశ్వాల్లోని భూ గ్రహాల మీద జరిగే కథ ఇది. కాబట్టి ప్రతి విశ్వంలోని భూమిని ప్రత్యేకంగా చూపించారు. ఇది కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. డానీ ఎల్ఫ్‌మ్యాన్ అందించిన సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... డాక్టర్ స్ట్రేంజ్‌గా నటించిన బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్‌కు ఈ పాత్ర పోషించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్, థోర్: రాగ్నరాక్, అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, ఎండ్‌గేమ్, స్పైడర్‌మ్యాన్: నో వే హోంల్లో కూడా తను నటించాడు. ఈ సినిమాలో తనకు సంబంధించిన వేర్వేరు వెర్షన్లు, ఎమోషనల్ సైడ్ కూడా చూపించారు. అది కొంచెం కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా ఈవిల్ స్ట్రేంజ్ వెర్షన్ మాత్రం భయపెడుతుంది.
ఈ సినిమాలో డాక్టర్ స్ట్రేంజ్ కంటే ముఖ్యమైన పాత్ర వాండా మాక్సిమాఫ్/స్కార్లెట్ విచ్‌గా నటించిన ఎలిజబెత్ ఓల్సెన్‌ది. ఈ సినిమాలో తన పాత్రకు ఉన్న డెప్త్, తన పెర్ఫార్మెన్స్ చూశాక వాండా విజన్ సిరీస్‌లో చూపించింది కేవలం టీజర్ మాత్రమేనని అర్థం అవుతుంది. అన్ని విశ్వాల్లో తనే అత్యంత శక్తివంతమైన ప్రాణిగా చూపించారు. కాబట్టి రానున్న మార్వెల్ యూనివర్స్ సినిమాలకు తనే కీలకం కావచ్చు. ఇక అమెరికా చావెజ్‌గా నటించిన సోచీ గోమెజ్ తన పాత్ర పరిధిలో బాగానే నటించింది. కథ మొత్తం తిరిగేది తన చుట్టూనే అయినా... తనకు నటించడానికి ఉన్న స్కోప్ చాలా తక్కువ. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రల్లో మెప్పించారు.
Also Read: భళా తందనాన రివ్యూ: శ్రీ విష్ణు ‘భళా’ అనిపించాడా?
ఓవరాల్‌గా చెప్పాలంటే... మీరు మార్వెల్ ఫ్యాన్ అయితే డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ కచ్చితంగా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా. పైసావసూల్ అనిపించే సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి. వీటికి బోనస్‌గా అవతార్ 2 టీజర్ కూడా ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా చూడవచ్చు.
Also Read: 'చిన్ని' రివ్యూ : కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?