Bison Review Telugu - బైసన్ రివ్యూ: కబడ్డీ, కుల వివక్ష నేపథ్యంలో విక్రమ్ కుమారుడి సినిమా - హిట్టా? ఫట్టా?
Bison Telugu Movie Review: చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన సినిమా 'బైసన్'. దీపావళికి తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 24న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మారి సెల్వరాజ్
ధృవ్ విక్రమ్, పశుపతి, లాల్, ఆమిర్, రజిషా విజయన్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు
Dhruv Vikram's Bison movie review in Telugu: చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'బైసన్'. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ధనుష్ 'కర్ణన్', ఉదయనిధి స్టాలిన్ - వడివేలు 'మామన్నన్' తర్వాత ఆయన తీసిన చిత్రమిది. కబడ్డీ క్రీడాకారుడు మానతి గణేష్ జీవితం ఆధారంగా కులవివక్ష నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. తమిళంలో దీపావళికి విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 24న విడుదల చేశారు.
కథ (Bison Movie Story In Telugu): కిట్టయ్య (ధృవ్ విక్రమ్)కు కబడ్డీ అంటే ప్రాణం. ఊరిలో కుటుంబ కక్షల కారణంగా సొంత కులం వాళ్ళు ఉన్న టీంలో అతడిని తీసుకోరు. అయితే కిట్టయ్యలోని ప్రతిభను స్కూల్ పీఈటీ టీచర్ గుర్తించి శిక్షణ ఇస్తారు. తమిళనాడులోని మారుమూల గ్రామం నుంచి జపాన్ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే వరకు వెళ్లిన కిట్టయ్య జీవితంలో ఎన్ని అవమానాలు ఎదురయ్యాయి? కులవివక్ష వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు?
కిట్టయ్యకు తండ్రి వేలు సామి (పశుపతి), అక్క రాజి (రజిషా విజయన్) ఎటువంటి సహకారం అందించారు? తనకంటే వయసులో పెద్దదైన అక్క స్నేహితురాలు రాణి (అనుపమ పరమేశ్వరన్)తో కిట్టయ్య ప్రేమ కథ ఏమిటి? ఆ ప్రేమకు అడ్డు వచ్చింది ఎవరు? జిల్లాలో పాండ్యరాజు (ఆమీర్), కందసామి (లాల్) మధ్య కుల ఆధారిత కక్షలు కిట్టయ్య జీవితంలో ఎటువంటి మార్పులకు కారణం అయ్యాయి? అనేది సినిమా.
విశ్లేషణ (Bison Movie Review In Telugu): మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన 'కర్ణన్', 'మామన్నన్' చూస్తే... ఆయన కథల శైలి, ఆ కథల్లో ఎటువంటి విషయం ఉంటుందనే అవగాహన ప్రేక్షకులకు వస్తుంది. పా రంజిత్ సినిమాలు గురించి తెలిసిందే. మారి సెల్వరాజ్ దర్శకత్వం, పా రంజిత్ నిర్మాణం అంటే కుల వివక్ష నేపథ్యంలో మరొక సినిమా వస్తుందని ఊహించారంతా! అయితే కబడ్డీ ప్లేయర్ మానతి గణేష్ జీవితం అనేసరికి కొత్తగా ఉంటుందని భావించారు. అయితే ఈ కథ సైతం కులవివక్ష చుట్టూ తిరిగింది.
మారి సెల్వరాజ్ గత సినిమాల్లో ఎటువంటి డీవియేషన్స్ పెట్టుకోలేదు. కులం పేరుతో కొందరు ఎటువంటి అవమానాలకు గురయ్యారు? ఏ విధమైన అణిచివేత ఎదుర్కొన్నారు? రాజకీయ దర్పం, కుల అహంకారంతో కొందరు ఎటువంటి దారుణాలకు పాల్పడ్డారు? అనేది చూపించారు. 'బైసన్'కు వచ్చేసరికి డీవియేషన్ తీసుకున్నారు. ఈ కథలో ఆయన రెండు కోణాలు తీసుకున్నారు. ఒకటి... కులవివక్ష. రెండోది... కబడ్డీ.
'బైసన్'లో కథానాయకుడు రెండు రకాల అణిచివేతను ఎదుర్కొంటాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కులవివక్ష కారణంగా ఇబ్బందులు ఎదురైతే... రాష్ట్ర, జాతీయ స్థాయిలో కబడ్డీ జట్టు ఎంపికలో తన ప్రతిభను చూపించే అవకాశం రాకుండా తనను ఎంపిక చేయకుండా పక్కన పెట్టే సెలెక్టర్లు. ప్రతి అడుగులో తనకు ఎదురైన అడ్డంకులను దాటుకుని కిట్టయ్య ఏ విధంగా విజేతగా నిలిచాడు అనేది కథ. ఇందులో కబడ్డీకి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలా? కులవివక్షకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలా? అనే అంశంలో దర్శకుడు మారి సెల్వరాజ్ కన్‌ఫ్యూజన్‌కు గురయ్యాడు.
'బైసన్'లో కబడ్డీకి ఇంపార్టెన్స్ ఇస్తే కులవివక్ష ప్రాధాన్యం తగ్గుతుంది. కులవివక్షపై మెయిన్ ఫోకస్ చేస్తే హీరో క్యారెక్టర్ బ్యాక్ సీటు తీసుకుంటుంది. ఇటు కబడ్డీ... అటు కులకక్షలు... రెండిటినీ బ్యాలన్స్ చేయడంలో మారి సెల్వరాజ్ తడబడ్డారు. పైగా, మధ్యలో వచ్చే ప్రేమకథ అసలు కథకు అడ్డుపడింది. దాంతో రోలర్ కోస్టార్ రైడ్ కింద మారింది 'బైసన్'. ప్యారలల్ స్క్రీన్ ప్లే ఆశించినంతగా ఇంపాక్ట్ చూపించలేదు.
కందసామి మీద పాండ్యరాజు మనుషులు ఎటాక్ చేస్తారు. కిట్టయ్య ఆట నచ్చి అతని కులం తెలిసి తన జట్టులో చేర్చుకున్న కందసామి... ఎటాక్ తర్వాత పాండ్యరాజు కులానికి చెందిన మనిషి కావడంతో కిట్టయ్యను తన ప్లేస్ నుంచి వెళ్లిపొమ్మని చెబుతారు. ఆ తర్వాత లాల్, ధృవ్ విక్రమ్ మధ్య ఓ డిస్కషన్ జరుగుతుంది. కులకక్షలను వదల్లేనని లాల్ చెబుతాడు. కందసామి అండతో కబడ్డీలో పైకి ఎదుగుతున్నాడని కిట్టయ్యకు తన చెల్లెలను ఇవ్వడానికి రాణి అన్నయ్య ఒప్పుకోడు. ముష్టివాడు అని తిడతాడు. సమానత్వం కోసం తాము చేస్తున్న పోరాటస్ఫూర్తిని గ్రహించకుండా తమ ఊరి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వ్యక్తిని ముష్టివాడు అని తిట్టడంపై పాండ్యరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సినిమాకు ఆ రెండు సన్నివేశాలే ప్రాణం. అయితే... మారి సెల్వరాజ్ కన్‌ఫ్యూజన్ వల్ల ఆ రెండు సన్నివేశాలు డైల్యూట్ అయ్యాయి. హీరో హీరోయిన్ల మధ్య ఓ సన్నివేశంలో అంబేద్కర్ ఫోటో చూపించడం అనవసరం అనిపిస్తుంది.
కథకు అవసరమైన చోట కుల వివక్ష, కక్షలు వంటివి చూపించడంలో తప్పు లేదు. వాళ్ళకు ఎదురైన అణిచివేతను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. కథ, గమనాన్ని దెబ్బ తీసేలా సన్నివేశాలు వస్తే అసలుకు ఎసరు వస్తుంది. 'బైసన్' విషయంలో అదే జరిగింది. పాండ్యరాజు (ఆమిర్), కందసామి (లాల్) మధ్య సన్నివేశాలు మరీ ఎక్కువ అయ్యాయి. దాంతో లెంగ్త్ ఎక్కువైంది. ఆ గొడవలు హీరోపై ఎటువంటి ప్రభావం చూపించాయి? అనేది స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా తీశారు.
Also Read: 'తెలుసు కదా' రివ్యూ: సిద్ధూ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విలన్ ఎవరు? సినిమా హిట్టా? ఫట్టా?
నివాస్ కె ప్రసన్న సంగీతం తమిళ నేపథ్యాన్ని, పల్లె వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించింది. కథకు అవసరమైన మూడ్ సెట్ చేయడంలో కెమెరా వర్క్ హెల్ప్ అయ్యింది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. అయితే తెలుగు డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకోలేదు. తెలుగు సినిమాలో తమిళ్ హెడింగ్స్ వస్తే ప్రేక్షకులకు ఏం అర్థం అవుతుంది? అందులోనూ కథలో ఇంపార్టెంట్ సీన్ వచ్చినప్పుడు తమిళ్ పేపర్ కటింగ్స్ చూపించారు తప్ప తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఇవ్వలేదు.
కిట్టయ్య పాత్రలో ధృవ్ విక్రమ్ ఒదిగిపోయారు. నటుడిగా ఆయనకు వేరియేషన్స్ చూపించే అవకాశం రాలేదు. కానీ ఆ పాత్రకు తగ్గ భావోద్వేగాలను పలికించారు. పాత్ర కోసం మేకోవర్ అయ్యారు. కొన్ని సీన్స్ చూస్తే విక్రమ్ గుర్తుకు రావడం గ్యారెంటీ. కబడ్డీ క్రీడాకారుడికి అవసరమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించడంలో 100 పర్సెంట్ సక్సెస్ అయ్యారు. హీరో తండ్రిగా పశుపతి నటనకు వంక పెట్టలేం. వేలుస్వామిగా జీవించారు. ఇక కథలో కీలకమైన పాత్రలు చేసిన లాల్, ఆమిర్ చక్కగా నటించారు. హీరో అక్కగా రజిషా విజయన్ నటన బావుంది. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. అనుపమ పరమేశ్వరన్ పాత్ర నిడివి తక్కువ. ఉన్నంతలో తన సన్నివేశాలకు న్యాయం చేశారు.
కుల వివక్ష వల్ల సమాజంలో ఏర్పడిన, మన కంటికి కనిపించని కంచె దాటడానికి ఓ సామాన్యుడు, ప్రతిభావంతుడైన క్రీడాకారుడు ఎంతటి పెద్ద యుద్ధం చేయాలనేది చూపించిన సినిమా 'బైసన్'. కుల, వర్గ, జాతి కక్షలతో కొట్టుమిట్టాడుతున్న కొందరు ప్రజలకు అవి ఎక్కడ మొదలయ్యాయనేది (మూలం) తెలియదని... కక్షలకు కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తులకు బయటకు రావాలని ఉన్నా, మార్పు కోరుకున్నా... అది సాధ్యపడటం అంత సులభం కాదని చెప్పే సినిమా 'బైసన్'. అయితే తమిళ నేటివిటీ - దర్శకుడి డీటైలింగ్ వల్ల తెలుగు ప్రేక్షకులకు సాగదీసిన ఫీలింగ్ కలగడం సహజం. అయితే... ధృవ్ విక్రమ్ నటనకు తెలుగులో ఇదొక విజిటింగ్ కార్డు అవుతుంది. పశుపతి నటన అందరికీ నచ్చుతుంది. అయితే తెలుగు ప్రేక్షకులు అందరికీ సినిమా నచ్చడం కష్టం.





















