Telusu Kada Review Telugu - 'తెలుసు కదా' రివ్యూ: సిద్ధూ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విలన్ ఎవరు? సినిమా హిట్టా? ఫట్టా?
Telusu Kada Review In Telugu: సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా... రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన సినిమా 'తెలుసు కదా'. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉందంటే?
నీరజ కోన
సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు తదితరులు
Siddu Jonnalagadda's Telusu Kada Movie Review In Telugu: 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వరుస విజయాలు అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ జోరుకు 'జాక్' బ్రేకులు వేసింది. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమా 'తెలుసు కదా'. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన చిత్రమిది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా... హర్ష చెముడు కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Telusu Kada Story): వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) ఓ అనాథ. పెళ్లి చేసుకుని, పిల్లలు కని తనకు అంటూ ఓ కుటుంబం ఉండాలని కలలు కంటాడు. అయితే... అతని ప్రేయసి రాగ (శ్రీనిధి)కు పెళ్లి, పిల్లలు ఇష్టం ఉండదు. బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ బాధ నుంచి కొన్నేళ్లకు బయట పడతాడు. ఆ తర్వాత అంజలి (రాశీ ఖన్నా)తో పెళ్లి అవుతుంది. అయితే అంజలి గర్భవతి కాదని తెలుస్తుంది. ఆ బాధలో ఉన్న వరుణ్, అంజలికి రాగ తారసపడుతుంది.
వరుణ్, అంజలి బిడ్డకు సరోగసి తల్లిగా ఉండేందుకు డాక్టర్ రాగ ఒప్పుకొంటుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి జీవితాల్లో ఆ నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? తొమ్మిది నెలల్లో వరుణ్ ఇంట్లో రాగ ఉన్న సమయంలో అంజలికి అసలు విషయం తెలిసిందా? లేదా? మనిషిగా వరుణ్‌లో మార్పులకు కారణం ఎవరు? అనేది సినిమా.
విశ్లేషణ (Telusu Kada Telugu Review): ట్రయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగులో చాలా వచ్చాయ్. అయితే 'తెలుసు కదా' లాంటి కథ ఇంతవరకూ తెలుగు తెరపై ఇప్పటి వరకూ రాలేదని చెప్పాలి. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, కాంటెంపరరీ మెడికల్ టచ్ ఇచ్చారు దర్శకురాలు నీరజ కొన. కథ విషయంలో ఆవిడకు ఫుల్ మార్క్స్ పడతాయి. అయితే కథనం, సన్నివేశాలు తీసిన తీరులో తడబడ్డారు. ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో ఫుల్‌గా సక్సెస్ కాలేదు.
కథను నీరజ కోన నీట్‌గా చెప్పడం స్టార్ట్ చేశారు. హీరో సిద్ధూ క్యారెక్టరైజేషన్‌ను చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అయితే కథనం నిదానంగా సాగింది. కథలో సర్‌ప్రైజ్ చేసే మూమెంట్స్ లేవు. ప్రేమ కథలకు ట్విస్టులు అవసరం లేదు. కానీ స్ట్రాంగ్ కోర్ పాయింట్ ఉండాలి. ఈ కథలో అది కొరవడింది. కథకు కీలకమైన ఓ హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ వీక్‌గా ఉంది. కన్వీన్సింగ్‌గా అనిపించలేదు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా లేదు. దాంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ చూపించదీ 'తెలుసు కదా'. ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా బావుంటుంది. అయితే సెకండాఫ్ వచ్చేసరికి ప్రతిదీ తెలుసు కదా ఇలా జరుగుతుందని అన్నట్టు ఉంటుంది. ఫ్లాట్‌గా వెళుతుంది. అదే సినిమాకు మేజర్ మైనస్. కథలో ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ లేరు. పరిస్థితులను బట్టి మనుషులు మారడాన్ని చూపించడం బావుంది.
తమన్ అందించిన పాటల్లో 'మల్లిక గంధ' బావుంది. మిగతా పాటలు సైతం కనుల విందుగా, వినసొంపుగా ఉన్నాయి. కథ, సన్నివేశాలకు తగ్గట్టుగా నేపథ్య సంగీతం అందించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ పెయింటింగ్‌గా ఉంది. కలర్‌ఫుల్‌గా తీశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. ఇటువంటి కథపై అంత ఖర్చు చేసినందుకు అప్రిషియేట్ చేయాలి.
వరుణ్ పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో చేశారు. అయితే అతని యాక్టింగ్ పొటెన్షియల్‌కు తగ్గ క్యారెక్టర్ గానీ, ఫుల్ లెంగ్త్ సీన్లు గానీ పడలేదు. సిద్ధూ తర్వాత హర్ష చెముడు ఇంప్రెస్ చేశారు. ఆయన్ను నీరజ కొన ఫుల్లుగా వాడుకున్నారు. కానీ హీరోయిన్లు డిజప్పాయింట్ చేశారు. ఇద్దరికీ వేరియేషన్స్ చూపించే క్యారెక్టర్లు పడ్డాయి. రాశీ ఖన్నా మొదట గ్లామర్‌గా కనిపించారు. ఎమోషనల్ సీన్లలో 'వరల్డ్ ఫేమస్ లవర్'లో తన నటనను మరోసారి గుర్తు చేశారు. శ్రీనిధి శెట్టికి మొదటి హెయిర్ స్టయిల్ సెట్ కాలేదు. తర్వాత పర్వాలేదు. మిగతా ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
'తెలుసు కదా'... మంచి పాయింట్ ఉన్న సినిమా. కానీ, స్క్రీన్ మీదకు అంతే మంచిగా రాలేదు. సిద్ధూ జొన్నలగడ్డ ఎప్పటిలా క్యారెక్టర్ మీద కమాండ్ చూపించారు. నటనతో ఇంప్రెస్ చేశారు. కానీ, కథనంలో లోపాలు ముందు అతని కష్టం వృథా అయ్యింది. సీన్స్ కొన్ని బావున్నాయి. వినోదం విషయంలో కొన్ని చోట్ల హద్దులు దాటినప్పటికీ... హర్ష చెముడు కొంత నవ్వించారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే థియేటర్లలో చివరి వరకూ కూర్చొవచ్చు. మోస్తరుగా శాటిస్‌ఫై చేస్తుంది. లేదంటే కష్టం.





















