Bachhala Malli Review - 'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?
Bachhala Malli Review In Telugu: 'అల్లరి' నరేష్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన సినిమా 'బచ్చల మల్లి'. 'నాంది' తర్వాత హీరోకి ఆ స్థాయి విజయం అందించిందా? లేదా?
సుబ్బు మంగాదేవి
నరేష్, అమృతా అయ్యర్, రోహిణి, రావు రమేష్, హరితేజ, హర్ష చెముడు, అంకిత్ కొయ్య తదితరులు
Allari Naresh and Amritha Aiyer movie Bachhala Malli review in Telugu: నరేష్ అంటే కామెడీ సినిమాలు అల్లరి మాత్రమే కాదు ఆయనలో ఒక ఇంటెన్స్ పెర్ఫార్మర్ ఉన్నాడని చాటి చెప్పిన సినిమాలు కొన్ని ఉన్నాయి. కామెడీ సినిమాలతో విజయాలు రావడం తగ్గిన తర్వాత సీరియస్ రోల్స్ వైపు నరేష్ అడుగులు వేశారు. నాంది వంటి సినిమాలు ఆయనకు విజయాలు అందించాయి. అయితే... వినోదం పంచాలని ఆయన చేసిన ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ అయ్యింది. దాంతో మళ్లీ సీరియస్ రోల్ వైపు అడుగులు వేశారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫెయిర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో బచ్చల మల్లి చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? నరేష్ ఖాతాలో మరో విజయం చేరుతుందా? లేదా?
కథ (Bachhala Malli Story): మల్లి (నరేష్)కు తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. తండ్రికి కొడుకు అంటే ప్రేమ. అయితే... మరో మహిళతో ఆయనకు సంబంధం ఉంది. ఆ బంధాన్ని నరేష్ తాతయ్య అంగీకరించడు. దాంతో మల్లి, అతని తల్లి (రోహిణి)ని వదిలేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆ క్షణం నుంచి తండ్రి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు మల్లి. సిగరెట్, మందు, వేశ్యల దగ్గరకు వెళ్లడాన్ని అలవాటు చేసుకుంటాడు. అటువంటి మల్లికి కావేరి అమృత అయ్యర్ పరిచయం అయ్యాక మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. చెడు అలవాట్లు అన్నీ మానేస్తాడు. గోనెసంచుల వ్యాపారం మొదలు పెడతాడు.
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న మల్లి జీవితం మళ్లీ మందు వెనక ఎందుకు వెళ్ళింది? తాగిన మత్తులో రోడ్డు మీద పడి ఉన్న అతడిపై హత్య ప్రయత్నం చేసింది ఎవరు? గోనె సంచుల వ్యాపార సంఘం ప్రెసిడెంట్ గణపతి రాజు అచ్యుత్ కుమార్ ఏం చేశాడు? మల్లి జీవితంలోకి వచ్చిన రమణ (అంకిత్ కొయ్య) ఎవరు చివరకు ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Bachhala Malli Review Telugu): తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిమ్స్ ఎక్కువ అయ్యాయి. హీరో కంటూ ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నారు. అది క్లిక్ అయితే, ఆడియన్స్ కనెక్ట్ అయితే భారీ విజయాలు సొంతమవుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ పుష్ప 2. అంతకు ముందు 'అర్జున్ రెడ్డి', 'రంగస్థలం' వంటివి కూడా చెప్పుకోవచ్చు. అయితే... హిట్ సినిమా తీయడానికి క్యారెక్టర్ ఒక్కటి చాలా? కథ, కథనం, ఎమోషన్స్ అవసరం లేదా? అని దర్శక రచయితలు ఆలోచించుకోవాలి. లేదంటే క్యారెక్టర్ వేస్ట్ అవుతుంది. సరైన కథ, ఎమోషన్స్ లేక సినిమా చూసే ప్రేక్షకులకు ఫీలింగ్ అనేది లేకుండా పోతుంది.
'బచ్చల మల్లి' అంటే ఇలా ఉంటాడని ఒక క్యారెక్టరైజేషన్ అనుకున్నారు సుబ్బు మంగాదేవి. కానీ, క్యారెక్టర్‌కు తగ్గ సీన్లు పడుతున్నాయా? లేదా క్యారెక్టరైజేషన్ ప్రకారం సినిమా ముందుకు వెళుతుందా? లేదా? అనేది చూసుకోలేదు. తండ్రి మీద కోపంతో తనకు నచ్చినట్టు బతుకుతున్నాననే భ్రమలో ఉంటాడు మల్లి. మరి తల్లి ఏం పాపం చేసింది? ఆమె ఫీలింగ్స్ ఎందుకు పట్టించుకోలేదు? వంటి ప్రశ్న ప్రేక్షకుడి మదిలో రావడం సహజం. సరే... ఎవ్వరినీ పట్టించుకోలేదని అనుకుందాం! అమ్మాయి రాగానే మారిపోవడం ఏంటి? అసలు ఆ అమ్మాయితో ప్రేమలో పడేంత సీన్ ఏముంది? ఇటువంటి లాజిక్స్ అవసరం లేదని ఫీలయ్యే ప్రేక్షకులకు సినిమా బావుంటుంది. కానీ, మిగతా వాళ్లకు అటో ఇటో ఎటో సినిమా వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మల్లితో, అతడి జీవితంతో కనెక్ట్ కావడం కష్టం అవుతుంది.
నరేష్, రావు రమేష్, అచ్యుత్ కుమార్, అమృతా అయ్యర్ వంటి మంచి ఆర్టిస్టులు - టాలెంటెడ్ టెక్నీషియన్లు సినిమాకు వర్క్ చేశారు. బచ్చల మల్లి క్యారెక్టర్ కూడా కుదిరింది. కానీ, సరైన సీన్లు రాయడంలో - ఎమోషన్స్ పండించడంలో దర్శక రచయిత సుబ్బు మంగాదేవి ఫెయిల్ అయ్యాడు. రొటీన్, రెగ్యులర్ సీన్లతో ఎటువంటి ఎగ్జైట్మెంట్ లేకుండా సినిమా తీశారు. స్టోరీ, హీరో క్యారెక్టర్ సెటప్ బావున్నా విజిల్ వర్తీ మూమెంట్స్ సినిమాలో తక్కువ అయ్యాయి. లవ్ స్టోరీ ఎండింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్ డ్రామా పండలేదు. మిగతా కథలో ఒక హై మూమెంట్ లేదు. అచ్యుత్ కుమార్ క్యారెక్టర్, ఆ విలనిజం వల్ల కథకు వచ్చిన ప్రయోజనం ఏమిటో తెలియదు.
బచ్చల మల్లి క్యారెక్టర్ కొత్త కనుక రైటింగ్ పరంగా హై మూమెంట్ లేకున్నా నరేష్ నటన, కొన్ని సన్నివేశాలు చూస్తే ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. కానీ, సెకండాఫ్ మరీ రొటీన్ అయ్యింది. సోల్ మిస్ అయిన ఫీలింగ్ రావడంతో క్లైమాక్స్ వరకు ఎప్పుడు సినిమా ముగుస్తుందా? అని భారంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... కథ, సీన్లు ఎలా ఉన్నా సరే? స్క్రీన్ మీద నరేష్, ఆఫ్ స్క్రీన్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ప్రాణం పెట్టి పని చేశారు. 'బచ్చల మల్లి' సినిమా నటుడిగా నరేష్ ప్రయాణంలో ఎప్పటికీ గుర్తుండే సినిమా అవుతుంది. ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. స్క్రీన్ మీద మల్లి క్యారెక్టర్ తప్ప మనకు నరేష్ కనిపించరు. పాటలు, నేపథ్య సంగీతం... విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్రాణం పొసే ప్రయత్నం చేసింది. కానీ, వీక్ రైటింగ్ వాళ్లిద్దరి కష్టాన్ని వృథా చేసింది. అమృతా అయ్యర్ సహా నటీనటులు పాత్రలకు తగ్గట్టు నటించారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్, రిచర్డ్ ఎం నాథన్ కెమెరా వర్క్ బావున్నాయి. ఆ రస్టిక్ ఫీల్ తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. మిగతా టెక్నికల్ టీం కథకు తగ్గట్టు వర్క్ చేశారు.
రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో యూనిక్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన సుబ్బు మంగాదేవి, అంతే యూనిక్ ఫిల్మ్ తీయడంలో - క్యారెక్టరైజేషన్ మైంటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఆయన రచనలో అసలు చెప్పుకోదగ్గ పాయింట్స్ లేవా? అంటే... ఉన్నాయి. జాతర ఫైట్‌లో తారాజువ్వలు హీరో వెనుక నుంచి వచ్చే విజువల్ - హర్ష చెముడుకు స్వామి మాల వేసే సీన్ భలే ఉన్నాయి. ఇటువంటి మూమెంట్స్ కొన్ని ఉన్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థియేటర్లలో జనాలను కూర్చోబెట్టే సత్తా ఈ సినిమాకు లేదు. సారీ మల్లి (నరేష్)... విజయం కోసం మళ్ళీ ప్రయత్నించాలి.
Also Read: బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?