Bramayugam movie review - భ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్ - లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Bramayugam review Telugu: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన కొత్త సినిమా 'భ్రమయుగం'. గురువారం మలయాళంలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
రాహుల్ సదాశివన్
మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ తదితరులు
Mammootty's latest horror thriller movie Bramayugam review in Telugu: స్టార్ స్టేటస్, ఇమేజ్ పక్కనపెట్టి సినిమాలు చేయడం సులభం కాదు. బోలెడు లెక్కలు, ఆలోచనలు ఉంటాయి. ఆ బ్యారియర్ బ్రేక్ చేసిన హీరో మమ్ముట్టి. 'కాదల్ ది కోర్'లో గే రోల్ చేయడం అంటే మాటలా? ఆ సినిమా ఒక్కటే కాదు... 'రోర్‌షాక్'లోనూ వైవిధ్యమైన సన్నివేశాలు చేశారు. ఒకవైపు కమర్షియల్, మరోవైపు డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన కొత్త సినిమా 'భ్రమయుగం'. మలయాళంలో గురువారం విడుదలైంది. త్వరలో తెలుగులో విడుదల కానుంది.
'ఇరుది సుట్రు' (తెలుగులో 'గురు'గా రీమేక్ చేశారు), 'విక్రమ్ వేద', 'మండేలా' వంటి కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన వై నాట్ స్టూడియోస్, హారర్ థ్రిల్లర్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఏర్పాటు చేసిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ కలిసి మమ్ముట్టి 'భ్రమయుగం' చిత్రాన్ని నిర్మించాయి. 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మాతలు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ: తేవన్ (అర్జున్ అశోకన్) జానపద గాయకుడు. తక్కువ కులానికి (పానన్) చెందినవాడు. తల్లి దగ్గరకు వెళుతూ అడవిలో తప్పిపోతాడు. ఆకలితో తిరిగి తిరిగి చివరకు ఓ పాడుబడ్డ ఇంటికి చేరుకుంటాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్). మరొకరు యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి). తక్కువ కులానికి చెందిన వాడని తక్కువ చేయకుండా, ఇంటికి వచ్చిన అతిథి అంటూ తేవన్‌ను తనతో పాటు సమానంగా చూస్తాడు.
అయితే... తనను కుడుమోన్ పొట్టి ట్రాప్ చేశారని తక్కువ సమయంలోనే తేవన్ తెలుసుకుంటాడు. ఆ ఇంటి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తాడు. అయితే... తాంత్రిక విద్యలతో అతడు మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు కుడుమోన్ పొట్టి. అసలు అతని నేపథ్యం ఏమిటి? అతని గురించి తెలిసి వంటవాడు ఆ ఇంటిలో ఎందుకు ఉన్నాడు? చివరకు ఏమైంది? ఆ ఇంటి నుంచి తేవన్ తప్పించుకున్నాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: కేవలం మూడు పాత్రలతో రెండున్నర గంటల సినిమాను నడిపించడం సులభమేనా? ఈ కాలంలో బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ సినిమా తీస్తే ప్రేక్షకులు చూస్తారా? ఎటువంటి హీరోయిజం లేకుండా సినిమా అంతా ఒక్కటే డ్రస్‌లో స్టార్ హీరోని చూపిస్తే అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? వంటి సందేహాలకు 'భ్రమయుగం' చెక్ పెడుతుంది. కంటెంట్ ఉంటే అటువంటి సందేహాలు అవసరం లేదని నిరూపిస్తుంది. ఇక... 'భ్రమయుగం' సినిమాకు వస్తే?
టెక్నికల్ బ్రిలియన్స్, ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ కలిస్తే... 'భ్రమయుగం'. ప్రేక్షకుల్ని ఆ ప్రపంచంలోకి తీసుకు వెళ్ళడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నాడని చెప్పాలి. పాత్రల పరిచయం, ఆ సన్నివేశాలు నిదానంగా సాగాయి. విశ్రాంతి ముందు వరకు సర్‌ప్రైజ్ గానీ, షాక్ గానీ ఉండదు. నిదానంగా ఆ ప్రపంచంలోకి వెళ్లేలా ఉంటుంది.
'భ్రమయుగం'లోకి వెళ్లిన తర్వాత అంత సులభంగా బయటకు రాలేం. సినిమాలో ప్రతి మాటలో, దృశ్యంలో ఓ అర్థం ఉంటుంది. ఆ కాలంలో కులవివక్ష చర్చించిన తీరు సూటిగా, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉంటుంది. క్రిస్టో జేవియర్ స్వరపరిచిన ప్రతి పాట వినసొంపుగా ఉంది. నేపథ్య సంగీతం సినిమాలో లీనం చేస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫార్మాటులో ఇంత అందంగా సినిమా తీయవచ్చా? అనేలా షెహనాద్ జలాల్ కెమెరా వర్క్ అబ్బుర పరుస్తుంది. ఎడిటింగ్ నీట్‌గా ఉంది.
మలయాళ సినిమాలు నిదానంగా సాగుతాయని ప్రేక్షకుల నుంచి వినిపించే మాట ఈ సినిమా విషయంలోనూ మరో మారు వినిపించవచ్చు. టెక్నికల్ బ్రిలియన్స్ పక్కన పెడితే... కథగా చూస్తే ఈ సినిమా చాలా చిన్నది. క్లుప్తంగా చెప్పాలంటే... పాడుబడ్డ భవంతి, తాంత్రిక విద్యలు నేర్చిన ఓ మాయగాడి నుంచి ఓ యువకుడు ఎలా భయపడ్డాడు? అనేది కథ. అందులో కులవివక్ష, అధికారం కోసం మనిషి ఎలా మారతాడు? అనేది చక్కగా చెప్పారు. ఈ సినిమా థ్రిల్ ఇస్తుంది గానీ అంతగా భయపెట్టదు. హారర్ అంశాలు తక్కువ ఉన్నాయి.
Also Read: ఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?
ప్రేక్షకులు ఇప్పటివరకు చూసిన మమ్ముట్టి వేరు. ఈ 'భ్రమయుగం'లో మమ్ముట్టి వేరు. కుడుమోన్ పొట్టి క్యారెక్టర్ మాత్రమే తెరపై కనిపించేలా నటించారు. ఆ లుక్స్ నుంచి మేనరిజమ్స్ వరకు ఆయన నటన చూస్తుంటే కనురెప్ప వేయడం కూడా మర్చిపోతాం. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో అదరగొట్టేశారు. ఆయనకు ధీటుగా జానపద గాయకుడి పాత్రలో అర్జున్ ఆశోకన్ ఒదిగిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. పాటలు పాడేటప్పుడు గానీ, మమ్ముట్టిని తొలిసారి తలెత్తి చూసేటప్పుడు గానీ, భయపడేటప్పుడు గానీ అర్జున్ అశోకన్ నటన అద్భుతం. సిద్ధార్థ్ భరతన్ సైతం చక్కగా నటించారు.
'భ్రమయుగం' ఫిల్మ్ మేకింగ్ పరంగా హై స్టాండర్డ్స్ సెట్ చేసే సినిమా. మమ్ముట్టి నట విశ్వరూపానికి అర్జున్ అశోకన్ అద్భుత నటన, బ్లాక్ అండ్ వైట్ విజువల్స్, క్రిస్టో జేవియర్ పాటలు అండ్ నేపథ్య సంగీతం మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. క్లైమాక్స్ ఒక హై ఇచ్చి పంపిస్తుందీ సినిమా. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు 'భ్రమయుగం' ట్రాన్స్‌లో ఉండటం గ్యారంటీ. డోంట్ మిస్ ద క్లైమాక్స్!
Also Read: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి - సినిమాల్లో వైసీపీ సక్సెస్ కొడితే టీడీపీ ఫెయిల్ అవుతోందా?