Maa Neella Tank Review - 'మా నీళ్ల ట్యాంక్' రివ్యూ: సుశాంత్, ప్రియా ఆనంద్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Maa Neella Tank Telugu Web Series Review : 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్‌తో యువ హీరో సుశాంత్ ఓటీటీ వరల్డ్‌కు ఇంట్రడ్యూస్ అయ్యారు. ప్రియా ఆనంద్, 'బిగ్ బాస్' దివి నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది?
![Maa Neella Tank Review Starring Sushanth Priya Anand Bigg Boss Divi Comedian Sudarshan Zee 5 original web series Maa Neela Tank Review Rating In Telugu Maa Neella Tank Review - 'మా నీళ్ల ట్యాంక్' రివ్యూ: సుశాంత్, ప్రియా ఆనంద్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/0b2b020c79fed4b0e8c01fec9cd990ea1657835141_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లక్ష్మీ సౌజన్య
సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ: మా నీళ్ల ట్యాంక్
రేటింగ్: 2/5
నటీనటులు: సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్, 'బిగ్ బాస్' దివి, ప్రేమ్ సాగర్, నిరోషా, అప్పాజీ అంబరీష, రామరాజు తదితరులు
కథ, స్క్రీన్ ప్లే : రాజశ్రీ , సురేష్ మైసూర్
మాటలు: కిట్టూ విస్సాప్రగడ
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథ్
సంగీతం: నరేష్ ఆర్కే సిద్ధార్థ్
నిర్మాత: కొల్లా ప్రవీణ్
దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
విడుదల తేదీ: జూలై 15, 2022
ఎపిసోడ్స్: 8
ఓటీటీ వేదిక: జీ 5
వెబ్ సిరీస్‌లు చేయడానికి యువ హీరోలు 'ఎస్' అంటున్నారు. ఓటీటీల ఆదరణ చూసి డిజిటల్ ప్రాజెక్ట్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏయన్నార్ మనవడు, యువ హీరో సుశాంత్ (Sushanth) కూడా వెబ్ సిరీస్ చేశారు. జీ 5 ఒరిజినల్ 'మా నీళ్ల ట్యాంక్'తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రియా ఆనంద్ (Priya Anand), 'బిగ్ బాస్' దివి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఎలా ఉంది?
కథ (Maa Neella Tank Web Series Story): బుచ్చివోలు గ్రామ సర్పంచ్ కోదండం (ప్రేమ్ సాగర్) కుమారుడు లక్ష్మణ్ (సుదర్శన్) నీళ్ల ట్యాంక్ ఎక్కుతాడు. తాను ప్రేమించిన సురేఖ (ప్రియా ఆనంద్) కనిపించడం లేదని... ఆ అమ్మాయి రాకపోతే కిందకు దూకేస్తానని చెబుతాడు. సురేఖ అదృశ్యం వెనుక తన తండ్రి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తాడు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని వెతికి తీసుకొచ్చే పని ఎస్సై వంశీ (సుశాంత్)కి సర్పంచ్ అప్పగిస్తాడు. సురేఖకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసినా... ఆ అమ్మాయి చీరాల వెళ్లిందని తెలుసుకుని, ఆమెకు మాయ మాటలు చెప్పి ఊరు తీసుకొస్తాడు వంశీ. ఈ క్రమంలో సురేఖను ఇష్టపడతాడు. అయితే... డబ్బు కోసం, ట్రాన్స్‌ఫర్ కోసం మనసు చంపుకొని సురేఖను వాళ్ళింట్లో అప్పగిస్తాడు. తల్లిదండ్రుల కోసం ఇష్టం లేకున్నా లక్ష్మణ్‌ను సురేఖ పెళ్లి చేసుకుందా? వంశీ ఏం చేశాడు? చివరకు, ఏమైంది? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Maa Neella Tank Web Series Review) : ఊరిలో అందరికీ నీళ్లు సరఫరా అయ్యే ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? రెండు మూడు అంతస్థుల ఎత్తులో ఉంటుంది. ట్యాంక్ పైకి వెళ్లాలంటే మెట్లు ఎక్కాలి. ఎక్కువ మెట్లు ఎక్కితే దూరం వెళతామా? లేదు కదూ! సేమ్ నీళ్ల ట్యాంక్ దగ్గర ఉంటాం. అలాగే... ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయినా 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్‌లో కథ ముందుకు కదలదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. దీనికి తోడు పంచ్ డైలాగ్స్ పేలలేదు. కామెడీ కుదరలేదు.
'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్‌కు చక్కటి గ్రామీణ నేపథ్యం కుదిరింది. కులాంతర ప్రేమ వివాహం చేసుకుని సర్పంచ్ అయిన వ్యక్తి... ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్ కావాలనుకునే అతడి కొడుకు... అన్న కుమార్తెను పెళ్లి చేసుకుని సర్పంచ్ కుర్చీ మీద కూర్చున్న వాడిని కిందకు దించి మళ్ళీ తాను సర్పంచ్ కావాలనుకునే ఓ పెద్దాయన... కేసులు లేని ఊరి నుంచి ట్రాన్స్‌ఫర్ కావాలనుకునే ఎస్సై... తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకునే ఓ అమ్మాయి... డిఫరెంట్ క్యారెక్టర్లు, కథలో చాలా కోణాలు ఉన్నాయి. అయితే... ఆసక్తికరమైన, వినోదం పండించే సన్నివేశాలు లేవు. హీరో హీరోయిన్ల మధ్య సరైన ప్రేమకథ కూడా లేదు. దాంతో సహనానికి పరీక్ష పెడుతుందీ సిరీస్. ప్రేక్షకుల్ని నవ్వించడంలో దర్శక - రచయితలు ఫెయిల్ అయ్యారు. ప్రతి ఎపిసోడ్‌కు చక్కటి ముగింపు ఇవ్వడంలో కూడా!
నటీనటులు ఎలా చేశారు?: 'అల వైకుంఠపురములో', 'ఇచ్చట వాహనములు నిలపరాదు'లో స్టయిలిష్‌గా కనిపించిన సుశాంత్... ఇందులో రూరల్ పోలీస్ రోల్ చేశారు. చిత్తూరు యాసలో డైలాగ్స్ చెబుతూ కొత్తగా కనిపించారు. నటుడిగా ఆయనకు సవాల్ విసిరే పాత్ర ఏమీ కాదు. దాంతో అలా అలా ఈజీగా చేసేశారు. ప్రియా ఆనంద్ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సుదర్శన్‌కు ఇంపార్టెంట్ రోల్ లభించింది. హీరో కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉందని చెప్పవచ్చు. సుదర్శన్, ప్రేమ్ సాగర్ మధ్య సీన్స్ కొంత వరకూ నవ్వించాయి. ప్రేమ్ సాగర్ డైలాగ్ డెలివరీలో మాట విరుపు గమనించేలా ఉంటుంది. అమ్మాయి తండ్రిగా అప్పాజీ అంబరీష నటన... 'నాకు ఇప్పటివరకూ అమ్మ లేదని అనుకున్నాను' అని ప్రియా ఆనంద్ చెప్పే సీన్‌లో భావోద్వేగానికి గురి చేస్తుంది. రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా తదితరులు పాత్రలకు తగ్గట్టు కనిపించారు. 'బిగ్ బాస్' దివి రోల్ జస్ట్ ఓకే.
Also Read : 'గార్గి' రివ్యూ: ఎవరూ ఊహించని క్లైమాక్స్ - సాయి పల్లవి కొత్త సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే?: 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్‌లో ఒక నీళ్ల ట్యాంక్ ఉంటుంది. అందులో నుంచి నీళ్లు వస్తాయని గ్రామ ప్రజలు ఏళ్ల తరబడి చూస్తూ ఉంటారు. సిరీస్ చూసే ప్రేక్షకులు కూడా కామెడీ కోసం అలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. కామెడీ కొన్నిచోట్ల వర్కవుట్ అయ్యింది. ఓపిగ్గా సిరీస్ చూడటానికి అది సరిపోదు. ప్రేమ్ సాగర్, సుదర్శన్ కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. యాసలో డైలాగ్స్ చెబుతూ కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు సుశాంత్. అలాగని వాళ్ళ కోసం ఎనిమిది ఎపిసోడ్స్ చూడటం కష్టం.
Also Read : 'ది వారియర్' రివ్యూ: డాక్టర్ పోలీస్ అయితే? రామ్ సినిమా ఎలా ఉందంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)