Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
Laal Singh Chaddha Movie Review: అక్కినేని నాగ చైతన్య హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న సినిమా 'లాల్ సింగ్ చడ్డా'. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించారు. తెలుగులోనూ నేడు సినిమా విడుదలైంది.
అద్వైత్ చందన్
ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, అక్కినేని నాగ చైతన్య తదితరులు
సినిమా రివ్యూ : లాల్ సింగ్ చడ్డా
రేటింగ్ : 2.25/5
నటీనటులు : ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, అక్కినేని నాగ చైతన్య, మోనా సింగ్, మానవ్ విజ్, ఆర్యా శర్మ తదితరులతో పాటు అతిథి పాత్రలో షారుఖ్ ఖాన్
సినిమాటోగ్రఫీ: సత్యజిత్ పాండే
సాహిత్యం (తెలుగులో) : భాస్కరభట్ల రవికుమార్
స్వరాలు : ప్రీతమ్
నేపథ్య సంగీతం : తనూజ్ టికు
సమర్పణ (తెలుగులో) : చిరంజీవి
నిర్మాతలు : ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అందారే
దర్శకత్వం: అద్వైత్ చందన్
విడుదల తేదీ: ఆగస్టు 11, 2022
సాధారణంగా రీమేక్ అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంతో పాటు నటన, దర్శకత్వం, చిత్రం, కథనం, కూర్పు, విజువల్ ఎఫెక్ట్స్... ఆరు విభాగాల్లో ఆస్కార్స్ అందుకున్న 'ఫారెస్ట్ గంప్'ను రీమేక్ చేయడం అంటే? అటువంటి సవాలును ఆమిర్ ఖాన్ (Aamir Khan) స్వీకరించారు. హాలీవుడ్‌లో టామ్ హాంక్స్ చేసిన పాత్రను హిందీ సినిమా 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) లో చేశారు. ఈ చిత్రంతో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హిందీ తెరకు పరిచయం అవుతున్నారు. ఆయన పాత్ర ఎలా ఉంది? థియేటర్లలో ఈ రోజు విడుదలైన సినిమా ఎలా ఉంది?
కథ (Laal Singh Chaddha Story) : లాల్ సింగ్ చడ్డా (ఆమిర్ ఖాన్) సగటు చిన్నారి కాదు, మొద్దు మొహం! విషయం అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుంది. అయితే 'నువ్వు అందరి లాంటి చిన్నారివే. ఎందులోనూ తక్కువ కాదు. నీ పనులు నువ్వు చేసుకోవాలి' అని అతడికి తల్లి (మోనా సింగ్) ధైర్యం చెబుతుంది. అటువంటి లాల్ సింగ్ చడ్డాకు స్కూల్‌లో రూపా డిసౌజా (కరీనా కపూర్ ఖాన్) పరిచయం అవుతుంది. లాల్ జీవితంలో ఆమె పాత్ర ఏమిటి? ఆర్మీలో తనకు పరిచయమైన బాలరాజు (అక్కినేని నాగ చైతన్య) కోసం లాల్ ఏం చేశాడు? కార్గిల్ యుద్ధంలో లాల్ కాపాడిన మహ్మద్ భాయ్ (మానవ్ విజ్) ఎవరు? చారిత్రాత్మక సంఘటనలతో ముడి పడిన లాల్ జీవితం ఎలా ఉంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Laal Singh Chaddha Telugu Movie Review) : 'కథ లాంటిదేగా నా జీవితం... ప్రతి అక్షరంలో నీ జ్ఞాపకం' - రూపను లాల్ తలుచుకునే సందర్భంలో వచ్చిన పాటలో సాహిత్యం ఇది. 'ఫారెస్ట్ గంప్'కు, 'లాల్ సింగ్ చడ్డా'కు వ్యత్యాసం గురించి చెప్పాలంటే... ఈ లైన్ సరిపోతుందేమో!? టామ్ హాంక్స్ సినిమాతో పోలిస్తే ఆమిర్ సినిమాలో కథానాయిక ప్రస్తావన ఎక్కువ ఉంటుంది.
'ఫారెస్ట్ గంప్'లో పాశ్చాత్య సంస్కృతి, అక్కడి యుద్ధ వాతావరణం, చారిత్రాత్మక ఘటనలతో ముందుకు సాగితే... సిక్కు సంస్కృతి, భారతదేశంలో ఘటనలకు ముడి పెడుతూ కథకు భారతీయ హంగులు అద్దారు అతుల్ కులకర్ణి. ఆయన అడాప్షన్‌ను మెచ్చుకోవాలి. ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ విజయం, అమృత్‌సర్‌లో బ్లూ స్టార్ ఆపరేషన్, ఇందిరా గాంధీ హత్య వంటివి కథా నేపథ్యంలో చూపించారు. హీరోయిన్ ట్రాక్ అబూ సలీం, మోనికా బేడీని గుర్తు చేస్తుంది. కొన్ని మార్పులు, నేటివిటీ మినహాయిస్తే... 'ఫారెస్ట్ గంప్' బాటలో 'లాల్ సింగ్ చడ్డా' నడుస్తుంది.
'ఫారెస్ట్ గంప్' సినిమాను పక్కన పెట్టినా... 'లాల్ సింగ్ చడ్డా' ప్రారంభంలో పంజాబీ వాతావరణం, దేశంలో చారిత్రాత్మక అంశాలను ప్రస్తావిస్తూ కథను ముందుకు నడపడం, షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర వంటివి ఆకట్టుకుంటాయి. హాలీవుడ్ సినిమా రీమేక్ అనే సంగతి మరిచి కథలోకి వెళ్ళేలా చేస్తాయి. విశ్రాంతికి వచ్చేసరికి కథలో కొత్తదనం లోపిస్తుంది. అప్పటి వరకూ అక్కడక్కడా వినోదం పడింది. అయితే... ఎమోషన్స్ సరిగా వర్కవుట్ కాలేదు. లాల్ పాత్రను ప్రేక్షకుడు అర్థం చేసుకున్న తర్వాత కథ ముందుకు సాగడం లేదని అనిపిస్తుంది. కథనంలో వేగం లోపించడం మరో మైనస్. నిదానంగా ముందుకు వెళుతుంది. ఆర్మీ నుంచి తప్పించుకున్న టెర్రరిస్ట్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీలో కనిపిస్తే ఎవరూ పట్టించుకోకపోవడం ఏంటో? మరీ సిల్లీ ఇది! లాజిక్స్ వదిలేసి మేజిక్ నమ్మారు ఫిల్మ్ మేకర్స్.
సాంకేతికంగా సినిమా బావుంది. ఆమిర్, కరీనా, షారుఖ్ వయసు తక్కువ చేసి చూపించారు. సంగీతం హృద్యంగా కథతో పాటు ముందుకు సాగింది. డబ్బింగ్ పాటల తరహాలో కాకుండా తెలుగు పాటలే అనిపించేలా అందరికీ అర్ధమయ్యే పదాలతో భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ప్రేక్షకుడిని కథలోకి తీసుకువెళ్లేలా చేయడంలో దర్శకుడు అద్వైత్ చందన్ పూర్తిగా విఫలం అయ్యారు.
నటీనటులు ఎలా చేశారు? : నటుడిగా ఆమిర్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాలా? తన నటనతో సినిమాలను నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. 'లాల్ సింగ్ చడ్డా' చిత్రంలో కొత్త ఆమిర్ ఖాన్ కనిపించలేదు. '3 ఇడియట్స్', 'పీకే' చిత్రాల్లో చూసిన ఆమిర్ మరోసారి మెరిశారంతే! కళ్ళు పెద్దవి చేసుకుని పాత్రకు తగ్గట్టు మేనరిజమ్ మైంటైన్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో మెస్మరైజ్ చేశారంతే! అక్కినేని నాగ చైతన్య విషయానికి వస్తే... తెలుగులో హీరోగా కనిపించిన చైతూ వేరు, 'లాల్ సింగ్ చడ్డా'లో చైతూ వేరు. సినిమాలో ఆయనదొక పాత్ర అంతే! నటనలో, ఆహార్యంలో నాగ చైతన్య వైవిధ్యం చూపించారు. చడ్డీ బనియన్ బిజినెస్ చేయాలనుకునే ఆర్మీ మ్యాన్‌గా అక్కడక్కడా నవ్వులు పంచారు. అయితే... ఆయనను అటువంటి పాత్రలో చూసి తెలుగు ప్రేక్షకులు హర్షించడం కష్టమే.
కరీనా కపూర్ ఖాన్ పాత్రను మలిచిన విధానం బావుంది. అందులో ఆమె నటన కూడా! మిగతా నటీనటుల్లో ఆమిర్ తల్లిగా నటించిన మోనా సింగ్‌కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఆమె బాగా చేశారు. మహ్మద్ భాయ్ పాత్రలో మానవ్ విజ్ అభినయం బావుంది. అతిథి పాత్రలో షారుఖ్ ఖాన్ మెరిశారు. ఆయన పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ నవ్విస్తుంది.
Also Read : ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?
చివరగా చెప్పేది ఏంటంటే?: 'లాల్ సింగ్ చడ్డా' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆమిర్ ఖాన్ చెబుతూ వచ్చారు. సినిమా కోసం ఆయన 14 ఏళ్ళు తపించారు. బహుశా... లాల్ పాత్రను ఆయన అమితంగా ప్రేమించడంతో ఈ సినిమా చేశారేమో అనిపిస్తుంది. ఆమిర్ నటన గానీ, సినిమా గానీ కొత్తదనం ఇవ్వలేదు. అంచనాలతో థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులను నిరాశ పరిచే చిత్రమిది. అక్కినేని నాగ చైతన్య సమ్‌థింగ్ స్పెషల్ అనిపించే పాత్రతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సింది.
Also Read : పేపర్ రాకెట్ రివ్యూ: చావు బండి నుంచి బతుకు వరకూ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?