Gaami Movie Review: గామి రివ్యూ: విశ్వక్‌సేన్ అఘోరాగా నటించిన ‘గామి’ ఎలా ఉంది?
Gaami Review in Telugu: ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ‘గామి’ సినిమా రివ్యూ
విద్యాధర్ కాగిత
విశ్వక్‌సేన్, అభినయ, చాందిని చౌదరి, హారిక పెద్ద, మహ్మద్ సమద్ తదితరులు
Gaami Movie Review
సినిమా రివ్యూ: గామి
రేటింగ్: 3/5
నటీనటులు: విశ్వక్‌సేన్, అభినయ, చాందిని చౌదరి, హారిక, మహ్మద్ సమద్ తదితరులు
ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి చెలుమళ్ల
స్క్రీన్‌ప్లే: విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వఠ్యమ్
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : నరేష్ కుమారన్
నిర్మాతలు: కార్తీక్ శబరీష్ (క్రౌడ్ ఫండింగ్)
దర్శకత్వం: విద్యాధర్ కాగిత
విడుదల తేదీ: మార్చి 8, 2024
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తూ దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న హీరో విశ్వక్ సేన్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభం అయి, కఠోరమైన పరిస్థితుల్లో కూడా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘గామి’ ట్రైలర్ అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లిపోయింది. మరి ఆ అంచనాలను ‘గామి’ అందుకుందా? సినిమా ఎలా ఉంది?
కథ: శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోరా. మనిషి స్పర్శ తగిలితే తన శరీరం వింత మార్పులకు లోనవుతుంది. ఈ సమస్య తనకు ఎలా వచ్చింది, తన గతం ఏంటి అనేది కూడా శంకర్ కి గుర్తు ఉండదు. తన సమస్య తీరాలంటే 36 సంవత్సరాలకి ఒకసారి హిమాలయాల్లోని ద్రోణగిరి పూసే మాలిపత్రాలు అనే ప్రత్యేకం అయిన పువ్వులు సేవించాలి.
మరో వైపు భారత్, చైనా బోర్డర్ లో మనుషులపై ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అందులో సీటీ 333 (మహ్మద్ సమద్) అనే టెస్ట్ సబ్జెక్ట్ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దక్షిణ భారతదేశంలోని ఒక గ్రామంలో దుర్గ (అభినయ) అనే దేవదాసి, ఆమె కూతురు ఉమ (హారిక)లది మరో కథ. మరి ఈ మూడు కథలూ చివరికి ఏం అయ్యాయి? శంకర్ తన సమస్యని అధిగమించాడా? సీటీ 333 అక్కడ్నుంచి తప్పించుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: తమిళం, మలయాళంలో వచ్చినంత కొత్త తరహా సినిమాలు తెలుగులో రావు అనే ఒక విమర్శ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. దానికి సరైన సమాధానమే ‘గామి’. సినిమా చాలా స్లోగా ప్రారంభం అవుతుంది. విశ్వక్‌సేన్ సమస్య గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే దాదాపు 15 నుంచి 20 నిమిషాల సమయం తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే వారు హిమాలయాలకు బయల్దేరతారో అక్కడ నుంచి సినిమా కాస్త వేగం పుంజుకుంటుంది.
మనుషులపై ప్రయోగాల నేపథ్యంలో జరిగే కథ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. సీటీ 333పై జరిగే ప్రయోగాలు, అతను అక్కడి నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. అభినయ, తన కూతురు ఉమ కథ ఈ సినిమాకు కోర్ పాయింట్. విజువల్‌గా ‘గామి’ ఒక అద్భుతం. సినిమాకు పెట్టిన ఖర్చుకు, తెరపై కనిపించే విజువల్‌కు అస్సలు సంబంధం ఉండదు. హిమాలయాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో వచ్చే సింహం సీక్వెన్స్‌ల. చివరి 30 నిమిషాలు సినిమాకు హైలెట్. ట్విస్ట్ రివీలింగ్ కూడా ఆకట్టుకుంటుంది.
సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ తన కెమెరాతో సినిమాకు ప్రాణం పోశారు. ముఖ్యంగా విజువల్స్‌కు గురించి చాలా కాలం మాట్లాడుకునే స్థాయిలో ‘గామి’ ఉంది. నరేష్ కుమారన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలెట్. సీన్లు బాగా ఎలివేట్ చేశారు. క్లైమ్యాక్స్‌లో వచ్చే శివమ్ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే... శంకర్ పాత్రకు విశ్వక్‌సేన్ ప్రాణం పోశారు. ఎమోషనల్ సీన్లలో తన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. సీటీ 333 పాత్రలో మహ్మద్ సమద్, ఉమ పాత్రలో నటించిన హారిక కూడా అద్భుతంగా నటించారు. విశ్వక్ తర్వాత సినిమాలో ప్రధాన పాత్రలు వీరివే. సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ఉండే మరో పాత్ర చాందిని చౌదరిది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే మొదటి సీన్, క్లైమ్యాక్స్‌లో చాందిని బాగా నటించారు. దుర్గ పాత్రలో అభినయ కూడా ఆకట్టుకుంటారు. నిస్సహాయురాలైన తల్లి పాత్రలో మంచి నటన కనపరించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... కొత్త తరహా సినిమాలు చూడాలనుకునే వారు, అడ్వెంచరస్ సినిమాలు ఇష్టపడే వారికి ‘గామి’ మస్ట్ వాచ్. సినిమా కాస్త స్లోగా సాగినప్పటికీ ఓవరాల్‌గా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
Also Read: వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?