FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అన్ని ఎపిసోడ్లు వచ్చేశాయి - అంజలి గతం ఆకట్టుకునేలా ఉందా?
అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘ఫాల్’ వెబ్ సిరీస్ ఎలా ఉంది?
సిద్ధార్థ్ రామస్వామి
అంజలి, ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ : ఫాల్ (FALL)
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అంజలి, ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్ తదితరులు
ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ రామస్వామి
సంగీతం : అజేష్ అశోక్
నిర్మాతలు : దీపక్ ధర్, రాజేష్ చద్దా
రచన : కరుణ్‌దేల్ రాజేష్, సిద్ధార్థ్ రామస్వామి
దర్శకత్వం : సిద్ధార్థ్ రామస్వామి
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022
ఓటీటీ వేదిక : డిస్నీప్లస్ హాట్‌స్టార్
ఎపిసోడ్స్ సంఖ్య : ఏడు (డిసెంబర్ 9వ తేదీన మూడు, 16వ తేదీన రెండు, 23వ తేదీన చివరి రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి)
ఈ సంవత్సరం అక్టోబర్‌లోనే ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్‌తో పలకరించిన అంజలి మళ్లీ ‘ఫాల్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఝాన్సీ తరహాలోనే ఫాల్ కూడా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ఎపిసోడ్లు ప్రతి శుక్రవారం విడుదల అవుతున్నాయి. డిసెంబర్ 23వ తేదీన ఈ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయింది. మరి ఓవరాల్‌గా ఈ సిరీస్ ఎలా ఉందంటే?
కథ: కోటీశ్వరుల కుటుంబానికి చెందిన దివ్య (అంజలి) తల్లిదండ్రులతో గొడవ పడి విడిగా తన స్పోర్ట్స్ అకాడమీలో ఉంటుంది. ఒకరోజు సడెన్‌గా దివ్య తను ఉంటున్న బిల్డింగ్ మీద నుంచి కిందకి పడి కోమాలోకి వెళ్తుంది. ఆరు నెలల పాటు కోమాలో ఉండిపోవడంతో దివ్య కుటుంబ సభ్యులు తనకు ఒక డ్రగ్ ఇచ్చి బాధ లేకుండా చంపేద్దామని డిసైడ్ అవుతారు. కానీ దివ్య అనుకోకుండా కోమా నుంచి బయటకు వస్తుంది. అయితే తనకు ఏమీ గుర్తుండదు. దివ్య కథకు సమాంతరంగా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం దివ్య అన్నయ్య రోహిత్ (ఎస్పీ చరణ్), దివ్యకు కాబోయే భర్త డేనియల్ (సంతోష్ ప్రతాప్) ఆ స్పోర్డ్స్ అకాడమీ భూమిని సొంతం చేసుకోవాలనుకుంటారు. దివ్య కోమాలోకి వెళ్లడానికి వీరికి సంబంధం ఏంటి? దివ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందా? తనని ఎవరైనా చంపాలనుకున్నారా? అన్న విషయాలు తెలియాలంటే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘ఫాల్’ చూడాల్సిందే.
విశ్లేషణ: 2012లో విడుదల అయిన ‘వర్టీజ్ (Vertige)’ అనే కెనడియన్ వెబ్ సిరీస్‌ను భారతీయ భాషల్లో ‘ఫాల్’గా రీమేక్ చేశారు. తమిళంలో తీసి మిగతా భాషల్లోకి డబ్ చేశారు. నిజానికి ఈ సిరీస్ కథంతా చివరి రెండు ఎపిసోడ్లలోనే ఉంటుంది. మొదటి ఐదు ఎపిసోడ్ల పాటు చాలా నిదానంగా సాగుతుంది. కేవలం పాత్రల పరిచయానికే దర్శకుడు సిద్ధార్థ్ రామస్వామి మూడు ఎపిసోడ్లు తీసుకున్నాడు. ఆ తర్వాతి రెండు ఎపిసోడ్లు కూడా నిదానంగా సాగుతాయి. చివరి రెండు ఎపిసోడ్లలో మాత్రం స్క్రీన్‌ప్లే వేగంగా ఉంటుంది.
చివర్లో వచ్చే ట్విస్ట్ ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్ పాయింట్. దాన్ని ఊహించడం అస్సలు ఏమాత్రం సాధ్యం కాదు. ఆఖరి రెండు ఎపిసోడ్లను అలాగే ఉంచి, మొదటి ఐదు ఎపిసోడ్ల కథను రెండు లేదా మూడు ఎపిసోడ్లకు కుదిస్తే స్క్రీన్ ప్లే రేసీగా ఉండి మంచి క్రైమ్ థ్రిల్లర్ అయ్యేది. చివరి ఎపిసోడ్‌లో ఎస్పీ చరణ్, తన తండ్రి పాత్రలో కనిపించిన తలైవాసల్ విజయ్‌ల మధ్య వచ్చే సన్నివేశం బొమ్మరిల్లు క్లైమ్యాక్స్‌ను తలపిస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా తీయడం మరో ప్లస్ పాయింట్. సిరీస్‌లో అన్ని ఎపిసోడ్ల నిడివి 40 నిమిషాల్లోపే ఉన్నాయి.
అజేష్ అశోక్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ రామస్వామినే సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎడిటింగ్ మరింత క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. ఎపిసోడ్ల సంఖ్యను తగ్గిస్తే మంచి వెబ్ సిరీస్ అయ్యేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... దివ్య పాత్రలో అంజలి మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో తన నటన చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అక్టోబర్‌లో ఇదే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల అయిన ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్‌లో కూడా అంజలి అమ్నీషియా పేషెంట్ పాత్రనే పోషించారు. కానీ అది పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్ సిరీస్ కాగా, ఇందులో ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్నాయి. హీరోయిన్ అన్నయ్య రోహిత్ పాత్రలో ఎస్పీ చరణ్‌ను తీసుకోవడం కొత్తగా ఉంటుంది. రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయారు. రోహిత్ భార్యగా నటించిన సోనియా అగర్వాల్ కూడా మంచి నటనను కనబరించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ వీకెండ్‌లో ఇంట్లో కూర్చుని ఒక క్రైమ్ థ్రిల్లర్స్‌ను చూడాలనుకుంటే దీనిపై లుక్కేయచ్చు. అన్ని ఎపిసోడ్లు విడుదల అయ్యాయి కాబట్టి తర్వాతి ఎపిసోడ్ల కోసం ఆగాల్సిన అవసరం లేదు. స్లోగా అనిపించిన చోట ఫార్వార్డ్ చేసుకుంటూ చూడవచ్చు.
Also Read : 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?