(Source: ECI/ABP News/ABP Majha)
Krishna Gadu Ante Oka Range Review - 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' రివ్యూ : పల్లెటూరి ప్రేమకథ ఎలా ఉందంటే?
Krishna Gadu Ante Oka Range Movie Review In Telugu : రిష్వి తిమ్మరాజు, విస్మయ జంటగా నటించిన సినిమా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.
రాజేష్ దొండపాటి
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు
సినిమా రివ్యూ : కృష్ణగాడు అంటే ఒక రేంజ్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు
పాటలు : వరికుప్పల యాదగిరి
ఛాయాగ్రహణం : ఎస్.కె. రఫీ
సంగీతం : సాబు వర్గీస్
నిర్మాతలు : పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత
కథ, కథనం, దర్శకత్వం : రాజేష్ దొండపాటి
విడుదల తేదీ : ఆగస్టు 04, 2023
ఇప్పుడు సినిమాలకు చిన్న, పెద్ద అని తేడా లేదు. కథ, కథనం, తెరకెక్కించిన విధానం బావుంటే చిన్న సినిమాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. అందుకు చక్కటి ఉదాహరణ 'బేబీ'. 'దిల్' రాజు ట్రైలర్ విడుదల చేయడం, ప్రచార చిత్రాలు బావుండటంతో 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' మీద కొంత మంది ప్రేక్షకుల చూపు పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది?
కథ : ప్రతి మధ్య తరగతి, పేదింటి తండ్రికి ఓ కల ఉంటుంది. తమకంటూ ఓ సొంత ఇల్లు కట్టుకోవడం! కృష్ణ (రిష్వి తిమ్మరాజు) తండ్రి కల కూడా అదే. అయితే, ఆ కోరిక నెరవేరకుండా మరణిస్తాడు. చిన్నతనంలో తండ్రి మరణించడంతో మేకలు మేపుకొంటూ తల్లితో కలిసి పల్లెటూరిలో పెరుగుతాడు కృష్ణ. వరుసకు మరదలు అయ్యే సత్య (విస్మయ శ్రీ) అంటే అతడికి ఇష్టం. ఆమెకూ బావ అంటే ఇష్టం. వీళ్లిద్దరి మధ్య ప్రేమ దేవా (వినయ్)ని ఆగ్రహం తెప్పిస్తుంది. అతడికీ సత్య మరదలు వరుస అవుతుంది. అయితే, దేవా అంటే సత్యకు ఇష్టం ఉండదు. ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే... దేవా ఇంట్లో కృష్ణ అద్దెకు ఉంటాడు. తాను ఇష్టపడుతున్న అమ్మాయిని తన ఇంట్లో అద్దెకు ఉంటున్న కృష్ణ ప్రేమలో ఉండటం భరించలేని దేవా ఏం చేశాడు? 'మూడు నెలల్లో ఇల్లు కటి చూపిస్తా' అని శపథం చేసిన కృష్ణకు ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురు అయ్యాయి? మధ్యలో బీహార్ గ్యాంగ్ దోపిడీలు ఏమిటి? చివరకు, ప్రేమించుకున్న బావా మరదళ్ళు ఒక్కటి అయ్యారా? లేదా? తండ్రి కలను కృష్ణ నెరవేర్చాడా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ : నూటికి 90 శాతం ప్రేమకథల్లో చివరకు ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఎవరైనా ఈజీగా చెబుతారు. హీరో హీరోయిన్లు కలుస్తారని చిన్న పిల్లాడు కూడా సమాధానం ఇస్తాడు. అయినా సరే ప్రేమకథలకి ప్రేక్షకాదరణ ఉంటోంది. అందుకు కారణం కూడా ప్రేక్షకులే. ప్రేమలో ఉన్న మహత్తు అటువంటిది.
ప్రేమకథల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, సన్నివేశాలు కొత్తగా టైమ్ పాస్ అయ్యేలా ఉంటే చాలు. దర్శకుడు పాస్ అయినట్లే! కృష్ణగాడు అంటే ఒక రేంజ్ తో దర్శకుడిగా పరిచయమైన రాజేష్ దొండపాటి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఫస్టాప్ అంతా సాఫీగా, సరదాగా ముందుకు తీసుకువెళ్ళాడు. ప్రేమకథలో కొత్తదనం కంటే సహజత్వం ఎక్కువగా ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత తెరపై ఆర్గానిక్ ప్రేమకథ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. అయితే... ఈ కథలో క్రైమ్ యాడ్ చేయాలని అనుకోవడం బ్యాడ్ ఐడియా. బీహార్ గ్యాంగ్ చేసే నేరాలను కథలో మేళవించడంలో దర్శకుడి అనుభవ లేమి, తడబాటు కనిపించాయి.
ప్రేమకథలో ట్విస్టులే కాదు... మిగతా ట్విస్టులు ఈజీగా ఊహించవచ్చు. ప్రేమకథలో తండ్రి సొంతింటి కల సెంటిమెంట్ కలిసినట్టు క్రైమ్ ఎలిమెంట్ మిక్స్ కాలేదు. పాటలు బావున్నాయి. ఇటీవల వచ్చిన చిన్న సినిమాల్లో మంచి సాంగ్స్ కింద లెక్క. వరికుప్పల యాదగిరి మంచి పాటలు రాయగా... ఆ సాహిత్యం వినిపించేలా బాణీల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్తవాళ్లతో తీసిన సినిమాపై నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు.
నటీనటులు ఎలా చేశారు? : హీరో హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు... ఈ సినిమాలో మెజారిటీ యాక్టర్లు అందరూ కొత్తవాళ్లు. రిష్వి, విస్మయ మధ్య కెమిస్ట్రీ కుదిరింది. వాళ్ళ మధ్య కొన్ని సీన్స్ బాగా తీశారు. విలన్ క్యారెక్టర్ చేసిన దేవా నటన ఆకట్టుకుంటుంది. మిగతా వాళ్ళు కూడా పర్వాలేదు. అందరు కొత్తవాళ్లు కావడంతో స్క్రీన్ మీద ఆ తేడా తెలుస్తూ ఉంటుంది. నటన విషయంలో వర్క్ షాప్స్ ఎక్కువ నిర్వహించాల్సిన అవసరం కనిపించింది.
Also Read : 'లెట్స్ గెట్ మ్యారీడ్' రివ్యూ : ఎంఎస్ ధోనీ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : ప్రేమ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్స్, అందాల ప్రదర్శన లేకుండా తీసిన చిత్రం 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. ఓ స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే దర్శకుడి ఆలోచన మంచిదే. అంతా కొత్తవాళ్ళు కావడంతో కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. పాటలు పర్వాలేదు. ఇవి ప్లస్ పాయింట్స్! అయితే... స్క్రీన్ ప్లే ఆసక్తిగా లేకపోవడం మైనస్ పాయింట్స్. కథనం విషయంలో జాగ్రత్త తీసుకుని, కొన్ని అనవసరమైన సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బావుండేది.
Also Read : 'దయా' రివ్యూ : జేడీ చక్రవర్తి నటించిన తొలి వెబ్ సిరీస్... సత్యను గుర్తు చేసిన జేడీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial