(Source: ECI/ABP News/ABP Majha)
Adipurush Review - 'ఆదిపురుష్' రివ్యూ : రామాయణానికి మోడ్రన్ టచ్ - ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?
Adipurush Movie Review Telugu : రామాయణం ఆధారంగా తీసిన సినిమా 'ఆదిపురుష్'. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
ఓం రౌత్
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్ తదితరులు
సినిమా రివ్యూ : ఆదిపురుష్
రేటింగ్ : 2.75/5
నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్ తదితరులుమూలకథ : వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా
మాటలు : భీమ్ శ్రీనివాస్ (తెలుగులో)
పాటలు : రామజోగయ్య శాస్త్రి
ఛాయాగ్రహణం : కార్తీక్ పళని నేపథ్య సంగీతం : సంచిత్ - అంకిత్
స్వరాలు : అజయ్ - అతుల్, సచేత్ - పరంపర!
నిర్మాతలు : భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్
విడుదల : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (తెలుగులో)
దర్శకత్వం : ఓం రౌత్
విడుదల తేదీ: జూన్ 16, 2023
వాల్మీకి రాసిన రామాయణంలో అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా రూపొందిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). రాఘవునిగా ప్రభాస్ (Prabhas), జానకిగా కృతి సనన్, లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Adipurush Movie Story) : జానకి (కృతి సనన్), శేషు (సన్నీ సింగ్)తో కలిసి రాఘవుడు (ప్రభాస్) వనవాసానికి వెళతాడు. అతడిని చూసిన సూర్పణఖ మనసు పారేసుకుంటుంది. తన భర్తగా ఆహ్వానిస్తుంది. 'నేను వివాహితుడిని. క్షమించండి' అని రాఘవుడు వెళ్ళిపోతాడు. సీతను చంపాలని విఫల యత్నం చేస్తుంది.
సూర్పణఖ (తృప్తి) ముక్కుకు శేషు వేసిన బాణం తగులుతుంది. అవమానంతో లంకకు వెళ్లిన సూర్పణఖ... అన్నయ్య లంకేశుడు (సైఫ్ అలీ ఖాన్) దగ్గర సీత అందం గురించి గొప్పగా వర్ణిస్తుంది. సాధువు వేషధారణలో వెళ్లిన లంకేశుడు... సీతను అపహరించి లంకకు తీసుకొస్తారు.
జానకిని పొందడానికి వానర సైన్యంతో కలిసి రాఘవుడు చేసిన యుద్ధం ఎలా ఉంది? ఆ తర్వాత ఏమైంది? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Adipurush Movie Review) : ప్రేక్షకులకు తెలియని కథను ఎలా చెప్పినా ఓకే. కానీ, తెలిసిన కథను ఆసక్తికరంగా చెప్పాలి. చిత్రసీమ అనుసరించే సూత్రం ఇది. రామాయణం కథ అందరికీ తెలుసు. ఆల్రెడీ బోలెడు సినిమాలు వచ్చాయి. మరి, 'ఆదిపురుష్' దర్శక నిర్మాతలు ఎలా తీశారు? ఈతరం ప్రేక్షకులకు సైతం మెచ్చేలా తీశామని చెప్పిన మాటల్లో నిజమెంత?
ప్రజలకు తెలిసిన రామాయణానికి ఓం రౌత్ మోడ్రన్ టచ్ ఇచ్చారు. కథ, కథనాల్లో పెద్ద పెద్ద మార్పులు ఏమీ చేయలేదు. కానీ, కొన్ని విషయాల్లో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు. ముఖ్యంగా గెటప్స్ విషయంలో! లంకాధిపతి రావణుడి ఆహార్యం విషయంలో మరోసారి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. రాముడు లంకకు వెళ్లిన తర్వాత వచ్చే ఓ సన్నివేశం విషయంలో కూడా!
కథ, కథనాలు, పురాణ ఇతిహాస గ్రంథంలో ఏముంది? అనేది పక్కన పెట్టి ఓం రౌత్ ఎలా తీశారు? అనే విషయానికి వస్తే... విజువల్స్ పరంగా కొత్తగా ఉంటుంది. త్రీడీ ఎఫెక్ట్స్ కొన్ని బావున్నాయి. అయితే... భావోద్వేగాల పరంగా సినిమా బ్యాక్ సీట్ తీసుకుంది. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సులో ఉన్న ఇంటెన్సిటీ, ఆ సీన్ ఇచ్చే కిక్... సెకండాఫ్‌లో వార్ సీక్వెన్సులు ఇవ్వలేదు. అక్కడ విజువల్స్ మీద పెట్టిన దృష్టి సన్నివేశాల మీద పెట్టలేదు. తెలిసిన కథే కావడంతో చాలా నిదానంగా ముందుకు వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
'ఆదిపురుష్' ప్రథమార్థం నిదానంగా ఉన్నప్పటికీ... కంప్లైంట్స్ పెద్దగా లేకుండా ముందుకు వెళుతుంది. విశ్రాంతి తర్వాత వచ్చే యుద్ధ సన్నివేశాలు, డైలాగులు బాహుబలిని గుర్తు చేస్తాయి. 'బాహుబలి' యుద్ధాన్ని కొత్తగా చూసినట్టు ఉంటుంది. రాముడు బాణం విసిరే స్టైల్, ఆ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.
'ఆదిపురుష్' నిడివి మూడు గంటలు! అయితే... పాటలు, నేపథ్య సంగీతం చాలా వరకు ఆ ఫీలింగ్ లేకుండా చేశాయి. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ వల్ల తెరపై వచ్చేవి తెలిసిన సన్నివేశాలే అయినప్పటికీ కొత్త అనుభూతి కలుగుతుంది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం బావుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం. కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ, ఓకే. టీజర్ విడుదలైన తర్వాత వచ్చిన విమర్శలు అయితే రావు.
ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలు చూసి ఓ అంచనాతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు... సినిమా ప్రారంభం నుంచి ఓం రౌత్ సర్‌ప్రైజ్ చేశారు. 'వానర సైన్యం చూస్తే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'లో వానరాలు గుర్తుకు వస్తాయి. లంకలో రావణుడి సైన్యం చూస్తే హాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్లు చూసినట్టు ఉంటాయి.
నటీనటులు ఎలా చేశారు? : రాఘవుడు / రాముని పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయారు. ఆయన అభినయం, ఆహార్యం ప్రేక్షకులను మెప్పిస్తుంది. జానకి / సీతగా కృతి సనన్ కనిపించే సన్నివేశాలు తక్కువ. ఉన్నంతలో చక్కగా చేశారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అభినయం ఆకట్టుకుంటుంది. ప్రభాస్, కృతి సనన్ జోడీ బావుంది. వాళ్ళిద్దరి సన్నివేశాలు బావున్నాయి.
రావణ బ్రహ్మ / లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఆహార్యం, నటన మెప్పించడం కష్టం. ఆయన నడక అదో రకంగా ఉంది. ప్రభాస్ కంటే సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ టైమ్ ఎక్కువ. హిందీ ప్రేక్షకుల సంగతి ఏమో కానీ తెలుగు ప్రేక్షకులను సైఫ్ శాటిస్‌ఫై చేయలేరు. శేషు / లక్ష్మణుడిగా సన్నీ సింగ్, భజరంగ్ / హనుమంతుని పాత్రలో దేవదత్త తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. మండోదరిగా సోనాల్ చౌహన్ రెండు సన్నివేశాల్లో కనిపించారు.
Also Read : ది ఫ్లాష్ రివ్యూ: డీసీ మల్టీవర్స్ సినిమా ‘ది ఫ్లాష్’ ఎలా ఉంది?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'ఆదిపురుష్'... ఇది మోడ్రన్ రామాయణం! పురాణ కథకు మోడ్రన్ టచ్ ఇస్తూ తీసిన సినిమా. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఓకే. ఎంజాయ్ చేయవచ్చు. రావణుడి గెటప్, మిగతా విషయాలు ఆలోచిస్తూ కూర్చుంటే కష్టమే! రావణుడి గెటప్, లంక అలా ఉందేంటి? అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే కష్టమే! ఇది రామాయణమేనా? లేదంటే మరొక కథా? అనే సందేహం కలుగుతుంది. అజయ్ - అతుల్ పాటలు, సంచేత్ - అంకిత్ నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకంగా ప్రశంసంచాలి.
Also Read : 'సైతాన్' రివ్యూ : బోల్డ్ సీన్స్, బ్రూటల్ కిల్లింగ్స్ - హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?