Black Panther 2 Review: వకాండా ఫరెవర్‌తో మార్వెల్ హిట్టు కొట్టిందా? కొత్త బ్లాక్ పాంథర్ ఎవరు?
బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమా ఎలా ఉందంటే?
ర్యాన్ కూగ్లర్
లెటీటియా రైట్, టెనాక్ హుయెర్టా, డొమినిక్ థోర్న్ తదితరులు
సినిమా రివ్యూ : బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్
రేటింగ్ : 3/5
నటీనటులు : లెటీటియా రైట్, టెనాక్ హుయెర్టా, డొమినిక్ థోర్న్ తదితరులు
స్క్రీన్ ప్లే : ర్యాన్ కూగ్లర్, జో రాబర్ట్ కోల్
ఛాయాగ్రహణం : ఆటమ్ డురాల్డ్ ఆర్కాపా
సంగీతం: లుడ్విగ్ గొరాన్సన్
నిర్మాణ సంస్థ : మార్వెల్ స్టూడియోస్
దర్శకత్వం : ర్యాన్ కూగ్లర్
విడుదల తేదీ: నవంబర్ 11, 2022
మార్వెల్ స్టూడియోస్ లేటెస్ట్ సినిమా ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. 2018లో వచ్చిన ’బ్లాక్ పాంథర్’ సినిమాకు సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. మొదటి భాగం ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ కావడంతో పాటు అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమాల్లో బ్లాక్ పాంథర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్‌ల్లోని యాక్షన్ సీన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా హాలీవుడ్ సినిమాలు చూసే వారు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుందా?
కథ: గతంలో బ్లాక్ పాంథర్‌గా కనిపించిన టి'చల్లా (చాడ్విక్ బోస్‌మన్) మరణంతో కథ మొదలవుతుంది. బ్లాక్ పాంథర్ లేకపోవడంతో వకాండా దేశంలో మాత్రమే లభించే అరుదైన, శక్తివంతమైన లోహం వైబ్రేనియంపై ప్రపంచ దేశాల కన్ను పడుతుంది. ఒక సంవత్సరం తర్వాత వకాండాపై నేరుగా దాడులు కూడా ప్రారంభం అవుతాయి. కానీ వాటిని వకాండా తిప్పికొడుతుంది. దీంతో ప్రపంచంలో మరెక్కడైనా వైబ్రేనియం ఉందేమోనని దాన్ని కనిపెట్టే మెషీన్ ఆధారంగా వేట ప్రారంభిస్తారు. అట్లాంటిక్ సముద్రం అట్టడుగున కూడా వైబ్రేనియం ఉందని తెలుస్తోంది. కానీ దాని కోసం వెళ్లినప్పుడు నమోర్ (టెనాక్ హుయెర్టా) సైన్యం అడ్డుపడుతుంది. అన్ని రోజులు రహస్యంగా ఉన్న వైబ్రేనియం సంగతి బట్టబయలు కావడంతో నమోర్ వకాండాకు వచ్చి ఆ మెషీన్ కనిపెట్టినవారిని తమకు అప్పగించాలని, లేకపోతే యుద్ధం తప్పదని అక్కడి వారిని హెచ్చరిస్తాడు. దీంతో బ్లాక్ పాంథర్ చెల్లెలు షురి (లెటీటియా రైట్) ఆ సైంటిస్ట్ కోసం వెతుకుతుంది. దాన్ని కనిపెట్టింది 19 సంవత్సరాల రిరి విలియమ్స్ (డొమినిక్ థోర్న్) అని తెలుస్తుంది. ఇంతలో రిరి విలియమ్స్, షురి ఇద్దరినీ నమోర్ దాడి చేసి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? షురి బ్లాక్ పాంథర్‌గా ఎలా మారింది? లాంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ: దీనికి ముందు భాగం అయిన ‘బ్లాక్ పాంథర్’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. వసూళ్ల పరంగా చూసుకున్నప్పటికీ అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, ఎండ్ గేమ్ సినిమాలు ఎంత శాతం లాభాన్ని తెచ్చాయో ‘బ్లాక్ పాంథర్’ కూడా దాదాపుగా అంతే లాభాన్ని తీసుకువచ్చింది. దీంతో సీక్వెల్‌గా వస్తున్న ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలో హీరోగా నటించిన చాడ్విక్ బోస్‌మన్ ఆ తర్వాత క్యాన్సర్‌తో మరణించారు. తనకు నివాళిగా ఈ సినిమాను మార్వెల్ రూపొందించింది.
టి'చల్లా మరణంతో సినిమా ప్రారంభం అవుతుంది. తన మరణం వకాండాపై ఎంత ప్రభావం చూపించిందో తెలిపే సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. అయితే దీని డోస్ కొంచెం ఎక్కువ కావడంతో సినిమాను సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ విలన్ పాత్ర నమోర్ ఎంట్రీతో సినిమా ఊపందుకుంటుంది. దర్శకుడు ర్యాన్ కూగ్లర్ యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోరుపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా లుడ్విగ్ గొరాన్సన్ అందించిన రీ-రికార్డింగ్ చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ సీన్లు ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి.
కుటుంబంలోనే అందరి కంటే చిన్నదైన ఒక యువతి తన వారందరినీ కోల్పోయి మానసికంగా కుంగిపోయినా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి రాణిగా ఎలా మారిందనే విషయాన్ని చాలా ప్రభావవంతంగా చూపించారు. విలన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడనేది ఇలాంటి సినిమాల రూపకల్పనలో ఒక ప్రాథమిక సూత్రం. దాదాపుగా హల్క్ స్థాయి శక్తి ఉన్న సూపర్ విలన్ నమోర్ పాత్రను చాలా బలంగా చూపించారు. కామిక్ బుక్‌లో ఉన్న పాత్రకు చాలా ఆక్యురేట్‌గా దీన్ని డిజైన్ చేశారు. దీంతో ఎదురుగా ఉన్న షురి పాత్ర కూడా అంతే బలంగా కనిపిస్తుంది.
అయితే ర్యాన్ కూగ్లర్ ఎమోషనల్ సీన్లపై తన ప్రేమను కొంచెం తగ్గించుకుని ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది. ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ నిడివి 2 గంటల 44 నిమిషాలు. రెగ్యులర్ హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కాబట్టి రన్ టైం కొంచెం తగ్గించుకుని ఉండాల్సింది.
ఇక నటీనటులు ఎలా చేశారంటే... ‘బ్లాక్ పాంథర్’లో సహాయక పాత్రకు పరిమితం అయిన లెటీటియా రైట్‌కు ఇందులో ప్రధాన పాత్ర దక్కింది. ఈ అవకాశాన్ని తను చక్కగా ఉపయోగించుకుంది. ఎమోషనల్ సీన్లలో అద్బుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లలో ఆకట్టుకుంటుంది. నమోర్ పాత్రలో కనిపించిన టెనాక్ హుయెర్టా సూపర్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రలో చక్కగా నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. సాధారణ ప్రేక్షకులు అక్కడక్కడా డిస్‌కనెక్ట్ అయినా ఓవరాల్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారు. చాడ్విక్ బోస్‌మన్‌కు ఈ సినిమా ఘనమైన నివాళి.
Also Read : 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?