Ante Sundaraniki Movie Review Telugu - 'అంటే సుందరానికీ' రివ్యూ: కామెడీలో సిక్సర్ - మరి కథ? నాని, నజ్రియా సినిమా ఎలా ఉందంటే?
Ante Sundaraniki Telugu Movie Review: 'వి', 'టక్ జగదీష్' ఓటీటీలో విడుదలైనా... 'శ్యామ్ సింగ రాయ్'తో గతేడాది థియేటర్లలోకి వచ్చారు నాని. ఇప్పుడు 'అంటే సుందరానికీ' అంటూ సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
వివేక్ ఆత్రేయ
నాని, నజ్రియా నజీమ్ ఫహాద్, వీకే నరేష్, రోహిణి, నదియా తదితరులు
సినిమా రివ్యూ: అంటే సుందరానికీ
రేటింగ్: 3/5
నటీనటులు: నాని, నజ్రియా నజీమ్ ఫహాద్, వీకే నరేష్, రోహిణి, నదియా, అళగమ్ పెరుమాళ్, హర్షవర్ధన్, పృథ్వీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
విడుదల తేదీ: జూన్ 10, 2022
నాని (Nani) పక్కింటి కుర్రాడిలా ఉంటారు. అంతలా, చాలా సహజంగా నటిస్తారు. పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు చేసిన ప్రతిసారీ విజయాలు అందుకున్నారు. 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki Telugu Movie) ప్రచార చిత్రాలు, పాటలు చూస్తే... సాధారణ యువకుడి పాత్ర పోషించినట్లు అనిపించింది. దీనికి తోడు బ్రాహ్మణ యువకుడు, క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి, సినిమా ఎలా ఉంది (Telugu Movie Ante Sundaraniki Review)? హీరోయిన్ రోల్ ఏంటి?
కథ (Ante Sundaraniki Movie Story): సుందర్ ప్రసాద్ (నాని), లీలా థామస్ (నజ్రియా నజీమ్) క్లాస్‌మేట్స్. సుందర్‌ది బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లో అందరూ పద్ధతులు, పట్టింపులు ఉన్న మనుషుల. లీలాది క్రిస్టియన్ ఫ్యామిలీ. లీలా అంటే సుందర్‌కు ఇష్టం. అయితే, ముందు ఆ విషయం చెప్పడానికి సందేహిస్తాడు. ఆమె మనసులో తనపై ప్రేమ ఉందని తెలిసిన తర్వాత... పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. అయితే, ఇంట్లో పెద్దలను ఒప్పించడానికి సుందర్, లీలా రెండు అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు ఏంటి? ఇరువురి కుటుంబ సభ్యులకు వీళ్ళిద్దరూ చెప్పింది అబద్ధమని తెలిసిన తర్వాత ఎలా స్పందించారు? చివరకు, సుందర్ - లీలా పెళ్లి జరిగిందా? లేదా? వీళ్ళ ప్రేమ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: హోమ్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు క్రికెటర్‌కు కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈజీగా ఆడతారు. 'అంటే సుందరానికీ' లాంటి సినిమా నానికి హోమ్ గ్రౌండ్ లాంటిది. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' చిత్రాలతో కామెడీ విషయంలో తన బలం ఎంత అనేది దర్శకుడు వివేక్ ఆత్రేయ చూపించారు. అటు హీరోకి, ఇటు దర్శకుడికి హోమ్ గ్రౌండ్ కావడంతో కామెడీ సీన్స్‌లో సిక్సులు మీద సిక్సులు కొట్టారు. కథ, కథనం, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? అనే విషయంలోకి వెళితే...
సినిమా ఎలా ఉంది? (Ante Sundaraniki Review) : 'అంటే సుందరానికి' కథలో మెయిన్ పాయింట్ దాచాలని యూనిట్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. బ్రాహ్మణ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి మధ్య ప్రేమ అనేది రివీల్ చేశారు. ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఎవరి ఆచారాలు వాళ్ళవి. మరొకరితో వియ్యం అందుకోవడానికి ఎలా అంగీకరించారు? అనేది సినిమాలో చూడాలి. అయితే, ఆ అసలు ఘట్టాన్ని చూపించడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు.
ఇంటర్వెల్ ముందు వరకూ హీరో హీరోయిన్లు... వాళ్ళ పరిస్థితులను వివరించారు. ఎక్కువ టైమ్ తీసుకున్నారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు వల్ల బ్రాహ్మణ యువకుడు ఎదుర్కొన్న పరిస్థితులు కొంత మేర నవ్విస్తాయి. అయితే, హీరోయిన్ పాత్రను పరిచయం చేసే విషయంలో ఎక్కువ సమయం తీసుకున్నారు. సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల, ఫస్టాఫ్ చూశాక ఓకే ఓకే ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. బండి పట్టాలు ఎక్కుతుంది. ఆ తర్వాత నాని, నజ్రియాతో పాటు దర్శకుడు కూడా ఎక్కడా ఆగలేదు. బండిని టాప్ గేరులో ముందుకు తీసుకువెళ్లారు.
సినిమాలో కామెడీ సీన్స్ బావున్నాయి. అయితే, నిడివి ఎక్కువ అయ్యింది. అలాగే, హీరోయిన్ క్యారెక్టర్‌కు అంత ఇంట్రడక్షన్, హీరో కంటే ముందు ఒక లవ్ ట్రాక్ అవసరం లేదేమో అనిపిస్తుంది. పాటలు కథలో భాగంగా వచ్చాయి. పాటల కంటే నేపథ్య సంగీతం చాలా బావుంది. సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కామెడీ విషయంలో సిక్సర్ కొట్టిన వివేక్ ఆత్రేయ... లెంగ్త్ విషయంలో ఫోర్ కూడా కొట్టలేకపోయారు. అదే సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. చైల్డ్ హుడ్ ఎపిసోడ్‌ను కూడా ఎక్కువ సేపు చూపించారు. కాసేపు నవ్వుకుని... ఆ తర్వాత సాగదీస్తున్నారేంటి? అనుకుని... చివర్లో చిన్న సందేశంతో థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకు వస్తారు. పతాక సన్నివేశాల్లో ఎమోషన్‌ను ఫోర్డ్స్‌గా తీసుకొచ్చినట్టు ఉంటుంది. అయితే, 'ప్రెగ్నెన్సీ అనేది ఛాయస్ కానీ... కంపల్షన్ కాదు' అని చెప్పే మాట హృదయాన్ని తాకుతుంది.
నటీనటులు ఎలా చేశారు?: సుందర్ పాత్రలో నాని అలవోకగా నటించారు. ప్రతి సీన్‌లో బెస్ట్ ఇచ్చారు. అలాగే, నజ్రియా కూడా! ఇద్దరూ సహజంగా నటించారు. ఈ ఇద్దరి మధ్య సన్నివేశాల్లో ప్రేమ కనిపించింది. ఇద్దరు స్నేహితులు నటించినట్టు ఉంది. సర్‌ప్రైజ్ అంటే... అనుపమా పరమేశ్వరన్ పాత్ర! హీరోయిన్ అయ్యుండి... హీరో సహోద్యోగి పాత్రలో నటించడం గొప్ప విషయం. ఆమె బదులు క్యారెక్టర్ ఆరిస్ట్ ఎవరైనా ఆ పాత్ర చేసి ఉంటే... థియేటర్లలో ఒక వావ్ ఫ్యాక్టర్ మిస్ అయ్యేది. నరేష్, రోహిణి, నదియా, అళగమ్ పెరుమాళ్... హీరో హీరోయిన్లు తల్లిదండ్రులుగా నటించిన నలుగురూ బాగా చేశారు. అయితే, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరిలో హర్షవర్ధన్ ఎక్కువ గుర్తుంటారు. నాని, హర్షవర్ధన్ మధ్య వచ్చిన ప్రతి సీన్ నవ్వించింది. రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, పృథ్వీ తదితరులు మధ్య మధ్యలో కనిపించారు. హీరో చైల్డ్ హుడ్ రోల్ చేసిన శేఖర్ మాస్టర్ కుమారుడు విన్నీ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది.
Also Read: 'కిన్నెరసాని' రివ్యూ: కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ సర్‌ప్రైజ్ చేసింది, ఈ సినిమా ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే?: ముందుగా చెప్పినట్టు... నిడివి విషయంలో 'అంటే సుందరానికీ' డిజప్పాయింట్ చేస్తుంది. ఫస్టాఫ్ ట్రిమ్ చేయొచ్చు. సాధారణ కథను కొన్ని ట్విస్టులతో చెప్పారు.ఈ రోజుల్లో పద్ధతులు, ఆచారాలు పాటించే కుటుంబాలు ఉన్నాయి. అయితే, సముద్రం దాటితే ఏదో అయిపోతుందనే భ్రమల్లో ఉన్నవారు కనిపిస్తారా? అనే సందేహం కలుగుతుంది. ఆ పాయింట్ రియాలిటీకి దూరంగా ఉంది. అయితే, ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా ఉంది. నాని, నజ్రియా జోడీతో పాటు దర్శకుడు వివేక్ ఆత్రేయ మాయ చేశారు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే... థియేటర్లలో హాయిగా నవ్వుకుని ఇంటికి రావచ్చు.
Also Read: జురాసిక్ వరల్డ్ డొమినియన్ రివ్యూ: డైనోసార్లు గెలిచాయా? మనుషులు గెలిచారా?