Husband On Sale: మహా ఇల్లాలు, ఇంటితోపాటు భర్తనీ అమ్మకానికి పెట్టిన భార్య
ఇన్నాళ్లు మనం భర్తను అమ్మేసే భార్యలను మాత్రమే చూశాం. అయితే, ఈమె తన ఇంటితోపాటు భర్తను కూడా అమ్మకానికి పెట్టింది. జోక్ కాదండి, నిజంగానే.
Husband On Sale | ‘శుభలగ్నం’లో ఆమని తన భర్త జగపతి బాబును రోజాకు అమ్మేయడం గురించి మీకు తెలిసిందే. అయితే, ఈ ఇల్లాలు ఆమె కంటే ముదురు. తన ఇంటితోపాటు తన మాజీ భర్తను కూడా కొనేస్తే రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. అయితే, ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఆమె భర్తను కొనే వ్యక్తి ఆ ఇంట్లో అతడికి పునరావాసం కల్పిస్తే చాలు. సంసారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకలా అని అనుకుంటున్నారా? అయితే, పనామాలో ఏం జరిగిందో చూడండి.
ఫ్లొరిడాకు చెందిన క్రిస్టల్ బాల్ అనే 43 ఏళ్ల మహిళ పనామా సిటీలోని బీచ్ ప్రాపర్టీని విక్రయించాలని నిర్ణయించుకుంది. మూడు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్‌రూమ్‌లు, డాబా, పూల్, హాట్ టబ్‌తోపాటు తన మాజీ భర్త రిచర్డ్ చౌలౌను కూడా కొనుగోలు చేయాలని తెలిపింది. ఏడేళ్ల సంసారం తర్వాత వీరిద్దరు ఇటీవలే విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తర్వాత కూడా వారు తమ పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు. వ్యాపారాలను కూడా కలిసే చూసుకుంటున్నారు.
అయితే, ఆమె తన ఇంటిని ఇటీవల అమ్మకానికి పెట్టింది. ఆ డబ్బుతో తాను పిల్లలతో కలిసి మరో ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంది. అలా చేస్తే రిచర్డ్ రోడ్డున పడతాడు. దీంతో ఆమె ఆ ఇంటిని కొనుగోలు చేసేవారు తన మాజీ భర్త రిచర్డ్‌ను ఉంచేందుకు అనుమతి ఇస్తే.. ధరను తగ్గిస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా ఫన్నీ ఫొటో సెషన్ కూడా నిర్వహించారు. బొమ్మ పులితో పోజులు పెడుతూ రిచర్డ్ కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించడాన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?
ఆ ఇంటి యాజమానికి రిచర్డ్ భారం కాబోడని, ఆయన్ని ఆ ఇంట్లో ఉండనిస్తే వంట, పరిశుభ్రత, మరమ్మతులు తదితర పనుల్లో సాయం చేస్తాడని ఆ ప్రకటనలో తెలిపింది. ‘‘రిచర్డ్ మంచి చెఫ్. ఆయన అద్భుతమైన బోజనాన్ని వండుతాడు. బట్టతల వల్ల తలను ఎక్కువగా కవర్ చేసుకుంటాడు’’ అని పేర్కొంది. అయితే, ఈ ఇంటిని అమ్మే బాధ్యతలు తీసుకోడానికి ఏజెంట్లు ఆసక్తి చూపడం లేదు. ఆమె పెట్టిన కండీషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఆ లిస్టింగ్ నుంచి పలుసార్లు తొలగించారు. అయితే, క్రిస్టల్ బాల్ మాత్రం.. తప్పకుండా తన ఇల్లు, మాజీ భర్తను ఎవరో ఒకరు కొనుగోలు చేస్తారనే ఆశతో ఎదురుచూస్తోంది.
Also Read: గుండె నొప్పిని మీ కాళ్లు ముందే హెచ్చరిస్తాయి, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!