Mustard Oil: పచ్చళ్లు, ఆవకాయల తయారీలో ఆవనూనెనే ఎందుకు వాడతారు?
వేసవి వచ్చిందంటే మామిడికాయలతో ఊరగాయలు సిద్ధమవుతాయి.
మనదేశంలో పిక్లింగ్ అనేది ఒక పురాతనమైన కళ. పిక్లింగ్ అంటే ఆవకాయలు, ఊరగాయలు పెట్టడం. మామిడికాయ, నిమ్మకాయ, మిరపకాయ ఇలా రకరకాల పదార్థాలతో పచ్చళ్లను, ఊరగాయలను పెడతారు. దీనికి ఎక్కువగా స్వచ్ఛమైన ఆవనూనె వాడతారు. ప్రత్యేకంగా ఆవనూనెనే ఎందుకు వాడతారు? పచ్చళ్ళ తయారీలో ఇలా ఆవనూనె వాడడానికి కారణం ఏమిటి?
ఊరగాయల తయారీలో వాడే అనేక పదార్థాలను ఒకదానితో ఒకటి మిళితం చేసే శక్తి ఆవ నూనెకు ఉంటుంది. వాటిని అలా మిళితం చేసి ఆవకాయకి మంచి రుచిని అందిస్తుంది. మంచి వాసనా, రుచి రావాలంటే ఆవనూనె వాడాలి. అది కూడా స్వచ్ఛమైన, నాణ్యమైన ఆవనూనెను వాడితేనే ఆ ఊరగాయ సువాసనతో, మంచి రుచితో సిద్ధమవుతుంది. ఇది బైండింగ్ ఏజెంట్ లాగా పని చేస్తుంది. ఎండిన మామిడి ముక్కలను, అందులో వేసిన మసాలాలను ఒకదానితో ఒకటి కలుపుతుంది. ఎక్కువ కాలం పాటు అవి పాడవకుండా ఉండడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ నూనెలో అల్లైల్ ఐసోథియోసైనేట్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ మైక్రో బయల్, యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఊరగాయ ఎక్కువ కాలం పాడవకుండా తాజాగా ఉంటుంది.
ఆవనూనెను వాడడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనె కూరలు కూడా వండుకోవచ్చు. ఇలా ఆవనూనెతో వండిన వంటలు తినడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియాలను ఆవనూనెలోని సమ్మేళనాలు చంపేస్తాయి. ఎందుకంటే దీనిలో యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ అని ముందే చెప్పుకున్నాం. ఎవరైతే కఫం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, ఛాతి నొప్పి వంటి వాటి బారిన పడుతూ ఉంటారో, వారు ఆవనూనెతో చేసిన వంటలు తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ వంటలు తినడం వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది. మిగతా నూనెలతో పోలిస్తే ఆవనూనె కొవ్వు రూపంలో పేరుకుపోదు. మిగతా నూనెలు అధికంగా తింటే కొవ్వు రూపంలో రక్తనాళాల్లో పేరుకుపోయే అవకాశం ఉంది.
జీర్ణవ్యవస్థను కాపాడే శక్తి ఆవనూనెకు ఉంది. పొట్టలోని మంచి బ్యాక్టీరియాను ఇది రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఆవనూనెతో చేసిన వంటలు తినడం ఉత్తమం. ఇది కొవ్వును కరిగించి, శరీర బరువును పెరగకుండా అడ్డుకుంటుంది. మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడేవారు ఆవనూనె వాడుకుంటే మంచిది.
Also read: రసాయనాలతో పండించిన మామిడి పండ్లను తింటే జరిగే ఆరోగ్య అనార్ధాలు ఇవిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.