Fungal Infections: ప్రపంచానికి పొంచి ఉన్న మరో ముప్పు- ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకితే ప్రాణాలు నిలవడం కష్టమే: WHO
ప్రపంచానికి మరో అతిపెద్ద ముప్పు రాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి డబ్ల్యూహెచ్ఓ వర్గాలు.
కరోనా ముప్పు తొలగిపోకముందే మనుషుల ప్రాణాలు తీసే భయంకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ దాడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటి వల్ల అనారోగ్యాల బారిన పడి క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్యానికి విపరీతమైన ముప్పుగా పరిణమించే 19 రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి కారణమయ్యే శిలీంధ్రాల తొలి జాబితాను విడుదల చేసింది. ప్రజారోగ్య ప్రాధాన్యతని పరిగణలోకి తీసుకుని WHO ఫంగల్ ప్రాధాన్య వ్యాధికారక జాబితా (FPPL) ప్రచురించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఈ నివేదిక రూపొందించింది.
ఈ జాబితాను మూడు భాగాలుగా విభజించింది. క్లిష్టమైన, అధిక, ప్రాధాన్యత, మధ్యస్థం పేరుతో మూడు రకాలుగా వ్యాప్తి చెందే శిలీంధ్రాల జాబితా రూపొందించింది. ఈ ఇన్ఫెక్షన్స్ సోకితే ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూహెచ్ఓ (WHO) హెచ్చరించింది. వీటి గురించి నిఘా, చికిత్స, రోగనిర్ధారణ లేకపోవడం వల్ల ప్రమాదం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
క్లిష్టమైన ఇన్ఫెక్షన్స్
ఈ గ్రూపులో కాండిడా ఆరిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలకి కారణం అయ్యింది. ఇదొక సూక్ష్మజీవి. ఇది ఎక్కువగా రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లకి కారణంగా మారుతుంది. హాస్పిటల్స్ లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. క్రిటికల్ కేర్ యూనిట్స్ లో ఉన్న వాళ్ళకి ఇది వ్యాపిస్తుంది. ఇది సోకితే 70 శాతం మరణం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ తో మరణించిన వారిలో ఈ ఇన్ఫెక్షన్ కూడా కనిపించింది.
అధిక ప్రాధాన్యత
ఇందులో కూడా కాండిడా కుటుంబానికి చెందిన ఇతర శిలీంధ్రాలు అలాగే మ్యూకోరల్స్ వంటి ఇతర శిలీంధ్రాలు ఉన్నాయి. దీన్నే బ్లాక్ ఫంగస్ అని కూడా అంటారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకి ఇబ్బంది పడిన రోగుల సంఖ్య వేలల్లో ఉంది. ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ కేసులు భారత్ లోను నమోదయ్యాయి. దీని వల్ల ప్రాణాలు కోల్పోయిన రోగులు ఉన్నారు.
మీడియం ప్రాధాన్యత కలిగిన ఇన్ఫెక్షన్స్
Coccidioides spp, Cryptococcus gattii వంటి శిలీంధ్రాలని ఈ జాబితాలో చేర్చారు. WHO నివేదిక ప్రకారం ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కు వగా ఉంది. ఎందుకంటే ఇవి సోకితే చికిత్స చేయడం కూడా కష్టం అవుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం వీటిని గుర్తించడం కూడా కష్టం అవుతోంది.
ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్వాసివ్ రూపాలు తరచుగా అనారోగ్య రోగులని, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్, HIV/AIDS, అవయవ మార్పిడి, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, పోస్ట్ ప్రైమరీ క్షయవ్యాధి ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు ఇన్వాసివ్ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.
కోవిడ్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ల దాడి ఎక్కువగా ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకితే నయం చేయడమే కాదు రోగ నిర్ధారణ కూడా కష్టం అవుతుంది. అందుకే అందరూ తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా నోరు, ముక్కు, చేతుల ద్వారానే వ్యాపిస్తున్నాయి. అందుకే బయట నుంచి వచ్చిన ప్రతిసారి చేతులు ముక్కు, కళ్ళు, నోటి దగ్గర చేతులు పెట్టుకోకుండా శానిటైజ్ చేసుకోవాలి. మొహానికి మాక్స్ ధరించడం తప్పనిసరి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చిలగడదుంపతో బరువు తగ్గొచ్చు, తొక్కతో కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు