Malt Milk: మాల్ట్ మిల్క్ అంటే ఏంటి? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
పాలల్లో ఈ పొడి వేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
పిల్లలతో పాలు తాగించాలంటే చాలా కష్టం. తాగనని తెగ మారాం చేస్తుంటారు. కానీ ఈ పొడి కలిపి ఇచ్చారంటే మాత్రం ఎంతో ఇష్టంగా పాలు తాగుతారు. అదే మాల్ట్ మిల్క్. మొత్తం పాల పొడి, గోధుమ పిండి, మాల్టెడ్ బార్లీతో తయారు చేసిన పొడి ఇది. తరచుగా శిశువులకి పోషకాహార సప్లిమెంట్ గా ఇస్తారు. ఇందులో కాల్షియం, విటమిన్ డితో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధ్యయనాల ప్రకారం దీన్ని మొదటి సారిగా 1873లో బ్రిటన్ కి చెందిన ఆహార తయారీదారుడు విలియం హార్లిక్ కనుగొన్నారు.
మాల్ట్ మిల్క్ పోషకాలు
ఒక అధ్యయనం ప్రకారం ఇది గర్భిణీ స్త్రీలకి కూడా మంచిది. ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల మాల్టెడ్ మిల్క్ పౌడర్ లో 10 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఎముకలు గట్టిపడతాయి: విటమిన్ డి పుష్కలంగా ఉండే ఈ పాలు తాగడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన భాస్వరం వంటి ఇతర ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బోలు ఎముక వ్యాధిని నివారించేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.
శక్తినిస్తుంది: ఇందులో విటమిన్ సి తో పాటు ఐరన్, నియాసిన్, రిబోఫ్లావిన్ కూడా మెండుగా ఉన్నాయి. ఇవి రోజంతా చురుకుగా ఉండేందుకు తక్షణ శక్తిని ఇస్తాయని నిరూపించబడింది. ఎదిగే పిల్లలకి ఇది తాగించడం చాలా మంచిది.
చర్మానికి మంచిది: రిబోఫ్లావిన్, విటమిన్ బి 2 ఉండటం వల్ల చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మం మీద మచ్చలు రాకుండా చేస్తుంది.
థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు: ఇది సెలీనియంని కలిగి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరుకి దోహదపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.
రక్తహీనత తగ్గిస్తుంది: ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తం పెరుగుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు ఈ పాలు తరచూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్త ప్రసరణ కూడా మెరుగయ్యేలా చేస్తుంది.
నిద్రలేమి దూరం: నిద్రలేమితో బాధపడేవారికి మాల్ట్ పాలు మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ ఇది శాస్త్రీయంగా మాత్రం నిరూపించబడలేదు. అయితే ఈ పాలు తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. ఇది ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రశాంతమైన నిద్రని ఇవ్వడంలో సహాయపడుతుందట.
రక్తపోటు నివారణ: ఇందులో పొటాషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బాగా అలసటగా ఉంటోందా? ఇందుకు కారణాలివే!