Ovarian Cancer: గర్భం అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే, క్యాన్సర్ అని తేలింది, ఇలా మీకూ జరగొచ్చు!
రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు ఎక్కువగా అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ ని గుర్తించడం చాలా కష్టం.
జీర్ణక్రియలో ఇబ్బంది, అతిగా తినడం లేదా ప్రీమెనుస్ట్రువల్ సిండ్రోమ్(pms) లేదా పీరియడ్స్ తదితర కారణాల వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇది ఎప్పుడూ మనిషిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కొన్ని సార్లు భరించలేని నొప్పిగా ఉంటుంది. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలు దీని బారిన పడుతూ ఉంటారు. అందుకే దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. యూకేలోని హడర్స్ ఫీల్డ్ కి చెందిన ఒక మహిళ కూడా పొట్ట ఉబ్బరంగా ఉండి హాస్పిటల్ కి వెళ్ళింది. చూసేందుకు ఆమె తొమ్మిది నెలల గర్భిణీలా కనిపించింది. ఎన్నో రకాల పరీక్షలు చేసిన తర్వాత చివరికి ఆమె అండాశయ క్యాన్సర్ తో బాధపడుతుందని చెప్పడంతో షాక్ అయ్యింది.
39 ఏళ్ల హన్నాకి ఎన్నో ఏళ్లుగా కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య కారణంగా తొమ్మిది నెలల గర్భవతిగా కనిపించేది. పొట్ట ఎక్కువగా ఉండటం చూసేందుకు అసహ్యంగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒత్తిడితో కూడిన మలవిసర్జన ఆమెని మరింత బాధపెట్టేది. మైకం, అసౌకర్యంగా అనిపించడం, వంగడానికి కూడా ఇబ్బంది, పొట్టలో నొప్పి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో హాస్పిటల్ వెళ్ళి పరీక్షలు జరపగా ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. మూడో దశలో ఉన్నప్పుడు ఆమెకు వ్యాధి ఉందని తెలుసుకున్నారు. కడుపులో అసౌకర్యంగా ఉండటం వల్ల 2019 ఏప్రిల్ నుంచి ఆమె పండ్లు, కూరగాయలు తినడం మానేసింది. దీంతో ఆమె పొట్ట మరింత ఇబ్బంది పెట్టసాగింది.
ఉబ్బరానికి కారణమేంటి?
మొదట ఆమెని చూసిన డాక్టర్లు ఇరిటేబుల్ బోవేల్ సిండ్రోమ్ లేదా క్రోన్స్ వ్యాధి ఉందని అనుకుని చికిత్స చేశారు. కానీ చివరకు ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. పొట్టలో దాదాపు 9 పౌండ్ల ద్రవం చేరడం వల్ల ఆమెకి కడుపు నొప్పిగా, ఉబ్బరంగా అనిపించిందని వైద్యులు తెలిపారు. క్యాన్సర్ చికిత్స కోసం హన్నా గర్భాశయాన్ని తొలగించారు. కీమోథెరపీ చేశారు.
అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటి?
క్యాన్సర్ ఉదరకుహలో లోతుగా అభివృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని గుర్తించడం కష్టం. అండాశయ క్యాన్సర్ కి నిర్ధిష్ట స్క్రీనింగ్ లేదా టెస్టింగ్ పద్ధతి లేదు. అందుకే ఇది చివరి దశ వచ్చే వరకు గుర్తించలేరు. దీంతో ప్రాణాల మీదకు వస్తుంది. దీన్నే గర్భాశయ క్యాన్సర్ అని కూడా అంటారు. అండాశయాల చుట్టూ అసాధారణరీతిలో కణాలు పెరుగుతాయి. ఫలితంగా కణతి ఏర్పడుతుంది. 50 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
☀ ఉదరం లేదా పొత్తికడుపులో నొప్పి
☀ ఆకలి లేకపోవడం/ అధికంగా ఆకలి వేయడం
☀ పొట్ట ఉబ్బిపోవడం
☀ తరచూ మూత్ర విసర్జన
ఈ లక్షణాలు ఒక నెలలో 12 లేదా అంతకంటే ఎక్కువ సారు అనుభవిస్తే అండాశయ క్యాన్సర్ ప్రమాదకర పరిస్థితిలో ఉందని అర్థం.
మరికొన్ని లక్షణాలు
☀ అజీర్ణం
☀ అతిసారం
☀ వెన్ను నొప్పి
☀ నీరసం
☀ విపరీతంగా బరువు తగ్గడం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ ఊర్లో మగాళ్లకు నో ఎంట్రీ, పొరపాటున వచ్చారో కటకటాలపాలే!