ఆ దేశ ప్రజలు మందు మానేసి మంచి నీళ్లు తాగుతున్నారట - కారణం తెలిస్తే.. ‘ఓహో దట్టా, ఐ థింక్ వాటో వాటు’ అంటారేమో!
మద్యాన్ని మంచి నీళ్లలా తాగే ఆ దేశ ప్రజలు.. ఇప్పుడు క్రమేనా ఆ అలవాటును దూరం చేసుకుంటున్నారట. ఎందుకో తెలిస్తే.. మీరు కూడా వారిలా మారిపోతారు.
ప్రపంచంలో మందుబాబులకు కొదవలేదు. పాశ్యాత్య దేశాల్లో మందును మంచి నీళ్లలా తాగుతారని, నీళ్లు అప్పుడప్పుడు తాగుతారని అంటారు. అయితే, ఈ సారి మాత్రం.. అలా అనుకోడానికి లేదు. ఎందుకంటే.. ఆ దేశం ప్రజలు మందు తగ్గించేసి మంచి నీళ్లే తాగుతున్నారట. ఔనండి.. ఇది నిజం. ఇంతకీ ఈ జ్ఞానోదయానికి కారణం ఏమిటనేగా మీ సందేహం. పదండి తెలుసుకుందాం..
యునైటెడ్ కింగ్‌డమ్‌లో సుమారు మూడు వంతుల మంది ప్రజలు మద్యానికి దూరంగా ఉంటున్నారట. అదేమిటీ అని అడిగితే.. మంచి నీళ్లు బెస్ట్ కదా అని అంటున్నారట. అరే బాబు సరైన కారణం చెప్పండ్రా అంటే.. చావు కబురు చల్లగా చెప్పారట. ఒక వైపు వేసవి తాపం, మరోవైపు పెరుగుతున్న ఖర్చులే తమని ఈ నిర్ణయం తీసుకునేందుకు పురిగొలిపిందని అంటున్నారట. అదేంటీ? వేసవి అంటే చల్లని బీర్లు లేపేయాలే గానీ.. ఇలా మంచి నీళ్లు తాగితే ఎలా అని అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఆల్కహాల్ డీహైడ్రేషన్ సమస్యను మరింత పెంచేస్తుంది. దాని వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న బ్రిటీష్ బాబులు.. నెమ్మదిగా ఆ అలవాటును మానుకుంటూ.. మంచి అలవాట్లు అలవరుచుకుంటున్నారు.
ఈ విషయం ఎలా తెలిసింది?
అది సరే.. వాళ్లు మందు మానేసి మంచి నీళ్లు తాగుతున్నారనే విషయం మీకు ఎలా తెలిసింది అనేగా మీ తర్వాతి ప్రశ్న. ఓ రీసెర్చులో ఈ విషయాలన్నీ తెలిశాయి. ఇటీవల నిర్వహించిన ఓ పోల్‌లో సుమారు 2000 మంది బ్రిటీష్ ప్రజలు పాల్గొన్నారట. వారిలో సుమారు 28 శాతం మంది.. మందు తగ్గించేశామని చెప్పారట. అంతేకానీ.. పూర్తిగా మానేశామని మాత్రం చెప్పలేదు. ఆ అలవాటును ఒక్కసారే మానేస్తే సమస్యలు వస్తాయని.. మెల్లమెల్లగా దాన్ని దూరం పెడుతున్నారట.
ప్రతి 10 మందిలో ముగ్గురు
రీసెర్చ్‌లో పేర్కొన్న విషయాల ప్రకారం.. బ్రిటన్‌లో ప్రతి 10 మందిలో ముగ్గురు మద్యాన్ని తక్కువ మొత్తంలో తాగాలని, నీటిని ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. దీనివల్ల తమ ఆరోగ్యం బాగుపడటమే కాకుండా.. డబ్బులు కూడా ఆదా అవుతున్నాయట. సుమారు 42 శాతం మంది ఈ ఉద్దేశంతోనే ఉన్నారట. ముఖ్యంగా వేసవిలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తేలిందట. అయితే, చలికాలం.. ఇతర కాలాల్లో మాత్రం వారికి మద్యం ఉండాల్సిందే. ఎందుకంటే.. అక్కడి కనిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకోవడం అంత ఈజీ కాదు.
నీళ్లు లేదా ఆల్కహాల్ లేనీ పానీయాలు
అలాగే 23 శాతం మంది ఎక్కువ నీటిని తాగడం ద్వారా హైడ్రేట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారట. 25 శాతం మంది నీరు, మందు కాకుండా.. ఆల్కహాల్ లేని పానీయాలు తాగుతున్నారట. అంటే సాధారణ కూల్ డ్రింక్‌లు, జ్యూస్‌లు.. ఎనర్జీ డ్రింకులు తాగుతూ తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు అన్నమాట. హారోగేట్ స్ప్రింగ్ వాటర్ ఈ అధ్యయనం నిర్వహించింది. మద్యం విచ్చలవిడి మద్యం అలవాటు నుంచి ప్రజలపై అవగాహన కల్పించడం, క్రమపద్ధతిలో ఆల్కహాల్‌ను తాగేలా ప్రోత్సహించడం ఈ సంస్థ ఉద్దేశం. ఆలస్యమైనా.. ఈ దేశ ప్రజలు ఇప్పుడు మంచి మార్గంలోనే నడుస్తున్నట్లు పరిశోధకులు అంటున్నారు. మీకు కూడా మద్యం అలవాటు ఎక్కువగా ఉంటే.. యూకే ప్రజల్లా మంచి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.