Crispy Uthappam Recipe : ఇన్స్టంట్ ఉతప్పం రెసిపీ.. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, తినడానికి టేస్టీగా ఉంటుంది
Instant Uthappam Recipe : ఉతప్పం అంటే ఇష్టం కానీ.. దానికోసం పిండి తయారు చేయడమే కష్టమనుకుంటున్నారా? అయితే ఇక్కడో ఇన్స్టంట్ ఉతప్పం రెసిపీ ఉంది. చాలా సింపుల్గా, టేస్టీగా దీనిని చేసుకోవచ్చు.
South Indian Breakfast Uthappam Recipe : ఉదయమైతే.. ఏమి టిఫెన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే టేస్టీగా ఉండే ఉతప్పం చేసేసుకోండి. అయ్యో పిండి నానబెట్టలేదు అనుకోండి. మీరు ఎలాంటి పిండి నానబెట్టి తయారు చేసుకోకుండానే.. ఇన్స్టాంట్గా ఉతప్పం తయారు చేసుకునేందుకు ఇక్కడో చక్కటి రెసిపీ ఉంది. అదే సేమ్యా ఉతప్పం. దీనిని తయారు చేయడం చాలా తేలిక. అంతేకాకుండా ఎక్కువ సమయం కూడా పట్టదు. పైన క్రిస్పీగా.. లోపల మెత్తగా ఉండే దీని రుచి కూడా అమోఘంగా ఉంటుంది. బ్యాచిలర్స్కూడా దీనిని సింపుల్గా తయారు చేసుకోగలరు. మరి ఈ రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పెరుగు - 1 కప్పు
సేమ్యాలు - 1 కప్పు
రవ్వ - 1 కప్పు
వంట సోడా - టీ స్పూన్
అల్లం - అంగుళం
పచ్చిమిర్చి - 3
నూనె - వంటకు తగినంత
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - పిండికి తగినంత
ఉల్లిపాయ - 1
జీలకర్ర - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
తయారీ విధానం
ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో పెరుగులో తీసుకోండి. దానిలో వంటసోడా వేసి బాగా మిక్స్ చేసి ఓ నిమిషం పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల పెరుగు కాస్త పొంగుతుంది. ఇంట్లో పుల్లటి పెరుగు ఉంటే దానినే ఈ వంటకానికి ఉపయోగించండి. ఇది మంచి రుచిని ఇస్తుంది. లేదంటే తాజా పెరుగును కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇలా పొంగిన పెరుగులో ఒక కప్పు సేమ్యా, ఒక కప్పు రవ్వ వేయండి. ఈ కొలతల్లో ఏది వ్యత్యాసం చూపించకండి. రెండూ సమానంగా ఉంటేనే ఉతప్పం బాగా వస్తుంది. ఇప్పుడు దానిలో కాస్త నీరు వేసి పిండి ఉతప్పం వచ్చేలా కలపండి. దీనిని ఓ అరగంట పక్కన పెట్టేయండి.
ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చిని దంచుకోండి. ఉల్లిపాయలను, కరివేపాకు కడిగి సన్నగా తురుముకోండి. స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి దానిలో నూనె వేయండి. ఇప్పుడు దానిలో జీలకర్ర వేసి అది వేయించాక.. ఉల్లిపాయ, కరివేపాకు తురుము వేండి. అవి కాస్త వేగిన తర్వాత స్టౌవ్ ఆపేయండి. కొందరు ఉల్లిపాయను కాస్త పచ్చిగా ఉండాలనుకుంటారు కానీ అది జీర్ణ సమస్యలు తెస్తుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే రుచి ఉంటుంది. ఎలాంటి సమస్యలు రావు.
పెరుగు, సేమ్యాల మిశ్రమాన్ని తీసుకుని దానిలో అల్లం పేస్ట్, వేయించుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. మీరు దీనిలో క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అయితే మీరు వాటిని కూడా సన్నగా తురుముకోవాలి. అప్పుడే అవి బాగా ఉడుకుతాయి. ఇలా సిద్ధమైన పిండిని మరో 5 నిమిషాలు పక్కనపెట్టండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్ పెట్టండి. కాస్త నూనె వేసి వేడి అయిన తర్వాత పెద్ద గరిటతో పిండిని తీసుకుని వేయండి. దీనిని పలుచగా చేయకండి. ఉతప్పం కాస్త మందంగానే ఉండాలి. ఇప్పుడు ఉతప్పం చుట్టూ నూనె వేయండి. పైన కూడా ఓ అరటీస్పూన్ నూనె వేసి ఉడికించండి.
స్టౌవ్ మంట మీడియం మీద ఉండాలి. ఉతప్పాన్ని మెల్లగా ఉడకనివ్వాలి. అప్పుడే ఉతప్పం లోపల ఉడికి.. బయట క్రిస్పీగా మారుతుంది. ఓ వైపు రోస్ట్ అయిన తర్వాత మరోవైపు దానిని తిప్పి మళ్లీ రోస్ట్ చేయాలి. రెండు వైపులా రోస్ట్ అయితే మీరు మిగిలిన పిండితో ఇలానే ఉతప్పాలు చేసుకోవాలి. అంతే వేడి వేడి ఉతప్పాలు రెడీ. మీరు ఇవే కొలతలతో చేస్తే 6 నుంచి 7 ఉతప్పాలు సిద్ధం చేసుకోవచ్చు. వీటిని మీరు మీకు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు. పైగా వీటిని చల్లారిన తర్వాత తిన్నా కూడా మంచి టేస్ట్ని అందిస్తాయి. దీని క్రంచీనెస్ను పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ ఉతప్పాలను మీరు కూడా తయారు చేసి.. హాయిగా లాగించేయండి.
Also Read : రాగి ముద్ద, చేపల పులుసు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అదిరిపోతుందంతే