Mobile: బాత్రూమ్‌లోకి ఫోన్ తీసుకువెళుతున్నారా? భవిష్యత్తులో ఈ వ్యాధి వచ్చే అవకాశం
Mobile: టాయిలెట్ సీటుపై ఎక్కువ సమయం కూర్చొని ఫోన్ చూసే వారికి హెచ్చరిక.
Mobile: ఒక్కో మనిషికి ఒక్కోరకమైన అలవాట్లు ఉంటాయి. కొందరికి బాత్రూంకి వెళ్ళేటప్పుడు తమతో పాటు మ్యాగజైన్లు, ఫోన్లు తీసుకుని వెళుతుంటారు. ఇలా తీసుకువెళ్లడం వల్ల గంటలు గంటలు చదువుతూ, ఫోన్ చూస్తూ అక్కడే ఉండిపోతారు. ఇలా దీర్ఘకాలంగా టాయిలెట్లో ఫోన్లు, మ్యాగజైన్లు తీసుకువెళ్లడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. టాయిలెట్‌కు ఏ పని మీద వెళ్లారో ఆ పని చేసుకుని కొన్ని నిమిషాల్లోనే బయటికి రావాలని, ఫోన్‌ను చూస్తూ కూర్చోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
ఉదయాన్నే బాత్రూంకి వెళ్లేటప్పుడు ఫోను తీసుకుని వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంది. సాధారణంగా బాత్రూం లోపల చేసే పని ఐదు నిమిషాలలో పూర్తవుతుంది. కానీ ఫోన్‌ని కూడా తమతో పాటు తీసుకొని వెళ్లడం వల్ల ఎంతోమంది 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు బాత్రూంలోనే కూర్చొని ఉంటున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెనుక భాగంపై ఒత్తిడి పడి హేమరాయిడ్స్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. తీవ్రమైన నొప్పితో పాటు రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువ.
అలాగే బాత్రూంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఫోను పై కూడా చేరుతాయి. ఆ ఫోను ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఆ బాక్టీరియాలు ఫోన్‌తో పాటే ఇంట్లో ప్రవేశిస్తాయి. అలాగే మీ చేతులకు, చేతుల ద్వారా నోటికి, ముక్కుకి కూడా చేరుతాయి. ఇలా ఆ బాక్టీరియాలు శరీరంలో చేరడం సులువుగా మారుతుంది. కాబట్టి టాయిలెట్లోకి వెళ్లే ముందు ఫోను తీసుకువెళ్లడం మానేయాలి.
టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పాదాలు, కాళ్లు మొద్దు బారినట్టు అవుతాయి. ఇలా దీర్ఘకాలంగా సాగితే ఎంతో ప్రమాదం. ఒక అధ్యయనం ప్రకారం టాయిలెట్ సీట్ల కంటే మీ స్మార్ట్ ఫోన్ల పైన పది రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియాలు ఉంటాయి. టాయిలెట్ సీటుపై ఎక్కువగా ఉండే సూక్ష్మక్రిములు స్టెఫీలోకాకస్ ఆరియస్ జాతికి చెందినవి. ఇవి మనుషులకు తీవ్రంగా హాని చేస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. అలాగే టాయిలెట్ సీటుపై ఈ కోలి, సాల్మొనెల్లా, షిగెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటి వల్ల డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొత్తికడుపు నొప్పి, అతిసారం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ వంటివన్నీ కూడా ఈ బ్యాక్టీరియా వల్ల వస్తాయి. చర్మంపై కురుపులు రావడం వంటివి వచ్చే అవకాశం ఉంది. టాయిలెట్ సీట్ పై ఫోన్‌తో పాటు కూర్చోవడం వల్ల అవసరమైన సమయం కంటే ఎక్కువ కాలం అక్కడ గడుపుతారు. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.