Crispy Vegetable Dosa : గోధుమపిండితో క్రిస్పీ వెజిటేబుల్ దోశ.. సింపుల్ రెసిపీ
ఉదయాన్నే వేడి వేడి కరకరలాడే దోశ తినాలనుకుంటే.. క్రిస్పీ వెజిటేబుల్ దోశ ట్రై చేయండి.
దోశ అనేది చాలామందికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్. కానీ దానికోసం ముందు రోజు రాత్రి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కానీ రోజూ అలా ఉండదు. మనం ముందు రోజు పప్పు నానబెట్టుకోకపోయినా మనకి దోశ తినాలి అనిపించవచ్చు. అప్పుడు బయటకెళ్లి దోశ తింటాం. మీరు కూడా అలాగే చేస్తారా? అయితే ఒక్కసారి ఆగండి. బయటకెళ్లకుండా ఇంట్లోనే కరకరలాడే టేస్టీ దోశను తయారు చేసుకోవచ్చు తెలుసా? పైగా దీనికోసం గంటలు గంటలు పని చేయాల్సిన అవసరం లేదు.
కేవలం 20 నుంటి 25 నిమిషాల్లో మీ దోశ మీ ప్లేట్లో ఉంటుంది. అదేలా అనుకుంటున్నారా? ఈ దోశ చేయడానికి ముందు రోజు పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. గోధుమ పిండితో మంచి క్రిస్పీ వెజిటేబుల్ దోశను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు టేస్ట్‌లోనూ అదరగొడుతుంది. మరి ఈ క్రిస్పీ దోశను ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - 1 కప్పు
బియ్యం పిండి - అరకప్పు
మిక్స్డ్ వెజిటేబుల్స్ - క్యారెట్, బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు
(మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకుని.. మీడియం సైజ్ లేదా చిన్న సైజ్‌లో కట్ చేసుకోవాలి.)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
కొత్తిమీర - గుప్పెడు (సన్నగా తరగాలి)
ఇంగువ - చిటికెడు
జీలకర్ర - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి - దోశలకు సరిపడా
Also Read : పెరుగన్నాన్ని ఇలా తయారు చేసి.. ఉదయాన్నే తింటే ఎన్ని ప్రయోజనాలో..
తయారీ విధానం..
ముందుగా మిక్సింగ్ గిన్నెలో గోధుమ పిండి తీసుకోండి. దానిలో బియ్యపు పిండిని వేసి మిక్స్ చేయండి. దానిలో ఇంగువ, సాల్ట్, జీలకర్ర వేసి బాగా కలపండి. దోశ బ్యాటర్ వలె వచ్చేంత నీరు పోసి.. పిండిలో ఉండలు లేకుండా కలపండి. పిండిని ఎంతబాగా మిక్స్ చేసుకుంటే దోశలు అంత మంచిగా వస్తాయి. ఈ మిశ్రమంపై మూతవేసి.. 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేయండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. దానిలో కొద్దిగా నూనె వేసి.. తరిగిన కూరగాయలను వేయండి. వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసి అవి కాస్త మెత్తబడేవరకు మగ్గనివ్వాలి. స్టౌవ్ మీద నుంచి పాన్ తీసేసి.. ఇప్పుడు దోశ పాన్ స్టవ్‌పై ఉంచాలి. పాన్ వేడి అయ్యాక.. ముందుగా రెడీ చేసుకున్న పిండి మిశ్రమాన్ని దోశల్లాగ వేసుకోవాలి. దానిపై ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ వేసి.. కొత్తిమీర చల్లాలి. దోశ అంచుల చుట్టూ నూనె లేదా నెయ్యి వేయాలి. దీనివల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. ఒకవైపు ఉడికిన తర్వాత జాగ్రత్త మరోవైపు దోశను తిప్పి మరింకొంత సేపు వేయించుకోవాలి. అంతే కరకరలాడే వేడి వేడి వెజిటేబుల్ దోశ రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించవచ్చు. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో అయితే దీని రుచి మరింత పెరుగుతుంది.
Also Read : రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి