Nonveg Recipe: తలకాయ కూర మాంసం ఇలా వండితే లొట్టలేసుకుని తింటారు
తలకూర మాంసానికి ఉండే క్రేజే వేరు. వండితే వెంటనే తినేయాలనిపిస్తుంది.
అన్నీ నాన్ వెజ్ రెసిపీలతో పోల్చితే తలకాయ కూరకు కాస్త క్రేజ్ ఎక్కువ. అలాగే వండడం కూడా చాలా కష్టం అనుకుంటారు. నిజానికి దీన్ని వండడం చాలా సులువు. కాకపోతే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. మాంసం ఉడకడానికి ఆ మాత్రం సమయం అవసరం. సింపుల్‌గా ఈ కూర ఎలా వండాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
తలకాయ మాంసం - అర కిలో
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను
కొత్తి మీర - ఒక కట్ట
మిరియాల పొడి - అర స్పూను
గరం మసాలా - ఒక టీస్పూను
ధనియాల పొడి - ఒక టీస్పూను
కారం - ఒక టీస్పూను
పసుపు - పావు స్పూను
జీలకర్ర - పావు స్పూను
కొబ్బరి తురుము - ఒక స్పూను
తయారీ ఇలా
1. తలకాయ మాంసాన్ని పరిశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. స్టవ్ పై కుక్కర్ పెట్టి రెండు చెంచాల నూనె వెయ్యాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయల తరుగును వేసి వేయించాలి.
3. ఉల్లిపాయం కాస్త బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాక, అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
4. అల్లం వెల్లుల్లి పేస్టు వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది.
5. ఆ సమయంలో పసుపు, కారం కూడా వేసి వేయించాలి.
6. ఇవన్నీ వేగాక పరిశుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం ముక్కలు వేసి వేయించాలి. ఉప్పు వేయాలి.
7. మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తే మాంసంలోని నీళ్లు దిగి కాసేపు ఉడుకుతుంది.
8. నీళ్లు ఇంకిపోయి అనుకున్నప్పుడు కొన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి, విజిల్ పెట్టేయాలి.
9. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
10. తరువాత కూరను కళాయిలోకి మార్చుకుని మళ్లీ చిన్న మంటపై ఉడికించాలి.
11. కళాయిలో ఉడుకుతున్నప్పుడు మిరియాల పొడి, గరం మసాలా, కొబ్బరి తురుము, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.
12. దించే ముందు కొత్తి మీర తురుము వేసి స్టవ్ కట్టేయాలి. దీన్ని అన్నంతో పాటే కాదు, రోటి, రాగి సంగటి, చపాతీలతో లాగించవచ్చు.
తింటే ఎంతో ఆరోగ్యం...
ఎప్పుడైనా మాంసాహారం తాజాదే తెచ్చుకోవాలి. తాజా మాంసం ఎప్పుడూ మంచి రుచిని అందిస్తుంది. అలాగే ఎన్నో పోషకాలను ఇస్తుంది. తలకాయ కూర తినడం వల్ల విటమిన్ బి12, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మినరల్స్ వంటివి అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. రక్త హీనత సమస్య ఉన్న వారు ఈ కూరను వారానికి ఓసారి తింటే చాలా మంచిది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణులకు కూడా దీన్ని తినిపిస్తే ఎంతో మేలు. పుట్టబోయే బిడ్డకు అనేక సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వారానికి ఒకసారైనా దీన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ఈ కూరతో పాటూ వచ్చే ఇగురు కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటే ఆ రుచే వేరు.
Also read: చలిని తట్టుకోలేకపోతున్నారా? అయితే వేడి పుట్టించే ఈ ఆహారాలను తినండి