చెర్రీ, ఉపాసనలా మీరూ బిడ్డ బొడ్డుతాడును భద్రపరచవచ్చు - దానివల్ల కలిగే ప్రయోజనాలివే!
చెర్రి, ఉపాసన తరహాలో మీరు కూడా మీ బిడ్డ బొడ్డుతాడును భద్రపరచుకోవచ్చు. దానివల్ల భవిష్యత్తులో మీ పిల్లలకు చాలా మేలు జరుగుతుంది.
హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. డెలివరీకి ముందే ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో మొదటిది పాప బొడ్డుతాడు (Umbilical Cord)ను భద్రపరచడం. అయితే, ఇదేదో పాప జ్ఞాపకార్థం కోసం దాచి పెట్టడం లేదు. చిన్నారి భవిష్యత్తు కోసం. అదేంటీ? బొడ్డుతాడుతో భవిష్యత్తు ఏమిటీ అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.
గతేడాది బిడ్డకు మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ కూడా ఇదే పని చేసింది. అంతేకాదు, మహేష్‌బాబు దంపతులు ఈ ట్రెండ్ మొదలవ్వక ముందే తమ పిల్లల బొడ్డుతాడును ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన లాబ్‌లో భద్రపరిచారు. ఇలా చేయడానికి బలమైన కారణమే ఉంది. అదే.. బిడ్డ ఆరోగ్యం. మీ బిడ్డ భవిష్యత్తులో రక్త సంబంధిత వ్యాధులకు గురైతే.. పెద్ద పెద్ద మందులు చేయలేని చికిత్సను ఈ బొడ్డుతాడు చేస్తుంది. నమ్మబుద్ధి కావడం లేదు కదా.
పిల్లలకు బొడ్డుతాడు ఎందుకు ఉంటుంది?
తల్లిని, బిడ్డను కలిపి ఉంచేది బొడ్డుతాడే. కడుపులో ఉన్నప్పుడు బొడ్డు తాడు ద్వారానే బిడ్డకు అవసరమైన గ్లూకోజ్, ఆక్సిజన్ అందుతుంది. ఈ బొడ్డుతాడులో ఉండే ధమని, సిరలు.. బిడ్డను సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సిర నుంచి ఆక్సిజన్, ఇతరాత్ర పోషకాలు అందుతాయి. ధమని శిశువు నుంచి యూరియా, కార్బన్ డై ఆక్సైడ్‌లను తల్లి రక్తనాళాలకు చేర్చుతుంది. అయితే, ప్రసవం తర్వాత బొడ్డుతాడును తప్పకుండా కట్ చేయాలి. దాన్ని మొదలు వరకు కట్ చేయరు. కనీసం రెండు అంగుళాల గ్యాప్‌తో కట్ చేస్తారు. ఆ తర్వాత దానికి క్లిప్ పెడతారు. కొద్ది రోజుల తర్వాత ఆ బొడ్డుతాడు దానికదే ఎండిపోయి రాలిపోతుంది. ఒకప్పుడు దీన్ని వ్యర్థంగా భావించి పడేసేవారు. అయితే, బొడ్డుతాడు ఉండే రక్తంలోని మూల కణాలు బిడ్డ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తాయని తెలిసినప్పటి నుంచి దాన్ని భద్రపరచడం మొదలుపెట్టారు.
బొడ్డుతాడును భద్రపరచడం వల్ల ఉపయోగం ఏమిటీ?
బొడ్డుతాడుపై జరిపిన పరిశోధనల్లో నిపుణులు కీలక విషయాలను తెలుసుకున్నారు. అందులో ఉండే హెమిటోపొయిటిక్ స్టెమ్ సెల్స్‌లోని మూల కణాలు చాలా ప్రత్యేకమైనవిగా గుర్తించారు. తలసేమియా, లుకేమియా, లింఫోమా, మయలోమస్, సీకెల్ సెల్ అనీమియా తదితర రక్త సంబంధిత వ్యాధుల చికిత్సకు ఈ మూల కణాలు ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. అంటే భవిష్యత్తులో బిడ్డకు అలాంటి వ్యాధులైమైనా వస్తే ఆ మూల కణాల ద్వారా చికిత్స అందిస్తారు. బిడ్డ పుట్టిన వెంటనే వైద్యులు బొడ్డుతాడులోని రక్తాన్ని సేకరించి లాబ్‌కు తరలిస్తారు. అక్కడ ప్లాస్మా డిప్లీషన్ (plasma definition) ప్రక్రియ ద్వారా రక్తంలోని ప్లాస్మాను వేరు చేస్తారు. రక్త కణాలను మాత్రమే అతి తక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన కోల్డ్ కంటైనర్‌లో స్టోర్ చేస్తారు. అయితే, ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న ప్రక్రియే. మీ ఆర్థిక స్తోమతను బట్టి.. బొడ్డుతాడు రక్తాన్ని 25 నుంచి 75 ఏళ్ల వరకు భద్రపరుచుకోవచ్చు. అయితే, మీ బిడ్డకు తోబుట్టువులు ఉన్నట్లయితే ఇది అవసరం లేదు.
Also read: పిల్లల్లో వచ్చే టైప్1 డయాబెటిస్ గురించి ఈ విషయాలు తెలుసా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial