Omicron Symptoms: ఓ మై క్రాన్.. కొత్త కోవిడ్ సోకితే లక్షణాలు కనిపించవా? దక్షిణాఫ్రికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలివే..
వ్యాధి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే టెస్ట్ చేయించుకుని కోవిడ్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. పాజిటివ్ అని తేలితే వైద్యం చేయించుకోవచ్చు. అయితే, కొత్త కోవిడ్ ఓమిక్రాన్ సోకితే లక్షణాలు పెద్దగా కనిపించవట.
కోవిడ్ కొత్త వేరియేషన్ ‘ఓమిక్రాన్’ గురించి తెలిస్తే.. మీరు తప్పకుండా ఓ మై గాడ్ అంటారు. ఎందుకంటే.. ఈ Omicron సోకితే లక్షణాలు అంత త్వరగా బయటపడవట. ఈ విషయాన్ని స్వయంగా దక్షిణాఫ్రికా డాక్టరే వెల్లడించింది. Omicron కొత్త వేరియెంట్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ.. తన వద్దకు వచ్చిన కోవిడ్ రోగుల గురించి కీలక విషయాలను తెలిపింది.
ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా వద్దకు వచ్చిన రోగుల్లో కోవిడ్ లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. హాస్పిటల్‌లో చేరకుండానే కోలుకున్నారు. గత పది రోజుల్లో మొత్తం 30 మంది కరోనా వైరస్ రోగులను చూశాను. కానీ, వారిలో గత కోవిడ్ కంటే భిన్నమైన లక్షణాలను వారిలో చూశాను. వారిలో కొందరు ఎక్కువ అలసటగా కనిపించారు. దీంతో వారికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందన్నారు. కోవిడ్ బాధితుల్లో ఎక్కువ 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సువారే ఉన్నారు. వారిలో 50 శాతం మంది వ్యాక్సిన్లు కూడా తీసుకున్నారు. 33 ఏళ్ల వయస్సు గల ఓ బాధితుడు గత కొద్ది రోజులుగా తనకు ఎంతో అలసటగా ఉందని చెప్పాడు. ఒళ్లు నొప్పులు, లైట్‌గా తలనొప్పి వచ్చిందని తెలిపాడు. చాలామంది బాధితులు కొద్దిగా కండరాల నొప్పి ఉన్నట్లు చెప్పారు. కీచు గొంతు, పొడి దగ్గు ఉన్నాయి. చాలా కొద్ది మందికి మాత్రమే శరీర ఉష్ణోగ్రత పెరిగింది’’ అని తెలిపారు.
ఈ నెల 18న ఏంజెలిక్ కోయెట్జీ వచ్చిన ఏడుగురు కోవిడ్ బాధితుల క్లినికల్ ఆధారాలేవీ కోవిడ్-డెల్టా వేరియెంట్ సరిపోలలేదు. దీంతో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు.. కోవిడ్ కొత్త వేరియెంట్‌ను కనుగొన్నామని నవంబరు 25న ప్రకటించారు. ఫలితంగా వివిధ దేశానికి రాకపోకలను నిలిపేశాయి. డెల్టా కంటే అత్యధిక మ్యూటేషన్లు ఉండటం వల్ల Omicron ప్రమాదకరమైనదనే ప్రచారం జరుగుతోంది. అయితే, డాక్టర్ ఏంజెలిక్ మాత్రం.. ఓమిక్రాన్‌తో వచ్చిన కోవిడ్ బాధితుల్లో పెద్దగా బయపడేంత లక్షణాలేవీ కనిపించలేదని, చివరికి వ్యాక్సిన్ తీసుకోనివారిలో కూడా స్వల్ప లక్షణాలే కనిపించాయని చెప్పారు. అయితే, ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకున్నా సోకుతుందా?: ప్రస్తుతం ఇండియాలో వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయ్యింది. కొన్ని నెలల కిందటే చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ప్రభావం క్రమేనా తగ్గుముఖం పట్టనుంది. కాబట్టి.. ఇప్పుడు ఏ వేరియెంట్ దాడి చేసినా.. వ్యాక్సిన్ తీసుకున్నవారిని కూడా సోకుతుంది. దక్షిణాఫ్రికాలోని జీనోమిక్స్ సర్వైలెన్స్ నెట్‌వర్క్(NGS-SA) చెప్పిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో కొద్ది రోజుల్లోనే కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యం అందుకోవచ్చు. కానీ, కొత్త వేరియెంట్ లక్షణాలు అంత త్వరగా బయటపడటం లేదు. బాగా ముదిరిని తర్వాత బయటపడితే.. వైద్యం కూడా కష్టమే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకోగలవా?: ప్రాథమిక అధ్యయనాల ప్రకారం.. ఈ వేరియంట్‌పై టీకాలు 40 శాతం తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. స్పైక్ ప్రోటీన్‌లోని 32 ఉత్పరివర్తనాల (మ్యూటేషన్లు) వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు కొత్త వైరస్‌లోని స్పైక్ వెర్షన్‌ను గుర్తించడానికి శరీరాన్ని ప్రేరేపిస్తాయి. అయితే, ఒమిక్రాన్‌లో స్పైక్ ప్రొటీన్ చాలా భిన్నంగా కనిపించడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దానిని గుర్తించి పోరాడలేకపోవచ్చు. 32లోని H655Y, N679K, P681H మ్యూటేషన్లు.. వైరస్ శరీర కణాలలోకి మరింత సులభంగా చొచ్చుకుపోవడానికి సహాయపడతాయి. R203K, G204R ఉత్పరివర్తనాలు.. వైరస్ వేగంగా దూసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. అయితే, టీకాలు ఒమిక్రాన్ కలిగించే ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయని, కాబట్టి.. ఈ వైరస్ ముప్పు ఉండే ప్రాంతాల్లో టీకాల ప్రక్రియను వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా బాధ్యతగా మాస్కులు పెట్టుకోవడం కొనసాగించాలి. ఏదైనా తాగితే వెంటనే చేతులను శుభ్రం చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. వాట్సాప్‌ల్లో వచ్చే ఫేక్ మెసేజ్‌లకు దూరంగా ఉండండి. ఇప్పటికే కొంతమంది ‘వాట్సాప్’ బాబాయ్‌లు.. తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇండియాలోకి వైరస్ వచ్చేసిందంటూ భయాన్ని వ్యాప్తి చేస్తున్నారు.