Navratri Day 3 Naivedyam : అన్నపూర్ణా దేవికి అల్లంగారెలు, కట్టె పొంగలి రెసిపీతో.. సోడా వేయకుండా క్రిస్పీగా ఇలా చేసేయండి
Annapurna Devi Naivedyam : నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి మూడోరోజు నైవేద్యంగా అల్లం గారెలు పెడతారు. మరి వీటిని సింపుల్గా కరకరలాడేలా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Navratri Day 3 Naivedyam for Annapurna Devi : దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మూడోవ రోజు భక్తులకు అన్నపూర్ణా దేవి రూపంలో దర్శనమిస్తారు. అయితే ఈ స్పెషల్ డే రోజు అన్నదానం చేస్తే చాలామంచిదని.. అమ్మవారి దయ ఉండి.. ఎప్పటికీ అన్నం సమస్య ఉండదని చెప్తారు. అయితే అన్నపూర్ణా దేవిని మెప్పించడానికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పించాలని చెప్తారు. మరి ఈ గారెలు ఎలా చేయాలి. సోడా వేయకుండా గారెలు క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే ఏ రెసిపీ ఫాలో అవ్వాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మినుములు - ఒక గ్లాసు
అల్లం - రెండు ఇంచులు
పచ్చిమిర్చి - మూడు
ఉప్పు - రుచికి తగినంత
జీలకర్ర - అర టీస్పూన్
నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత
తయారీ విధానం
ముందుగా మినుములు నానబెట్టుకోవాలి. పప్పు కనీసం మూడు నుంచి 5 గంటలు నానేలా చూసుకోవాలి. పప్పు నాని తర్వాత కడిగి మిక్సీజార్ తీసుకుని దానిలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి.. పప్పుతో పాటు కలిపి మిక్సీ చేయాలి. మినపప్పులో అస్సలు నీరు లేకుండా చూసుకోవాలి. పిండి కాస్త గట్టిగానే ఉండేలా మిక్సీ చేసుకోవాలి. తప్పదు అనుకున్నప్పుడు ఓ స్పూన్ చల్లని నీళ్లు వేసి మిక్స్ చేయాలి.
ఇలా రుబ్బిన పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని దానిలో జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. పిండిని ఒకే వైపు కలపడం వల్ల పిండి కాస్త ప్లఫ్పీగా మారుతుంది. పిండిలో బుడగలు పోయి.. మంచిగా మారుతుంది. స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి తగ్గట్లు నూనె పోసి.. పిండిని బాగా కలపాలి. నూనె కాగిన తర్వాత పిండితో గారెలు ఒత్తుకొని నూనెలో వేయాలి.
గారెలను నూనెలో రెండువైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అంతే అన్నపూర్ణా దేవికి ఇష్టమైన అల్లం గారెలు రెడీ. వీటిని మీరు పూజా సమయంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. అయితే మరికొందరు మూడోవ రోజు అన్నపూర్ణా దేవికి కట్టె పొంగలి కూడా నైవేద్యంగా పెడతారు. దీనిని చేయడం కూడా చాలా సింపుల్.
కట్టె పొంగలి రెసిపీ
కట్టె పొంగలి చేయడానికి బియ్యం, పెసరపప్పు కావాలి. బియ్యం ముప్పావు గ్లాసు తీసుకుంటే పెసరపప్పు పావు గ్లాసు తీసుకోవాలి. ఇలా తీసుకున్న పప్పును, బియ్యాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో బియ్యం, పెసరపప్పు వేసి వేయించుకోవాలి. అవి మంచిగా సువాసన వచ్చేప్పుడు స్టౌవ్ ఆపి.. చల్లారిన తర్వాత నీటితో రెండుసార్లు కడగాలి.
ఇప్పుడు కుక్కర్లో వీటిని వేసి.. ఒక గ్లాసుకి మూడు గ్లాసుల కొలత నీటిని వేయాలి. రుచికి తగిన ఉప్పు వేయాలి. మిక్సీజార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి పేస్ట్ చేశాక.. దానిని బియ్యం మిశ్రమంలో వేసి.. ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత.. దానిలో తాళింపు వేసుకోవాలి. ఓ చిన్న కడాయి పెట్టి దానిలో నెయ్యి వేయాలి. జీడిపప్పు వేసి వేయించుకుని, మిరియాలు, జీలకర్ర వేసి తాళింపు పెట్టుకోవాలి. దీనిని అన్నంలో వేసి కలపాలి. అంతే వేడి వేడి కట్టె పొంగలి రెడీ. దీనిని కూడా ఎక్కువమంది అన్నపూర్ణ దేవికి నైవేద్యంగా పెడతారు.






















