Rare Condition: కన్నబిడ్డను ముట్టుకుంటే అలెర్జీ, ఈ తల్లి పరిస్థితి ఎవరికీ రాకూడదు
ప్రపంచంలో కొన్ని వింత వింత ఆరోగ్యపరిస్థితులు కూడా ఉన్నాయి. అవి కొంత మందిలో బయటపడుతుంటాయి.
తల్లి కావడమే వరం. ఆ వరం పొంది కూడా పుట్టిన బిడ్డను దూరం పెట్టాల్సి వస్తే అంత కన్నా శాపం లేదు. ఓ తల్లికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె పేరు ఫియోనా హుకర్. ఇంగ్లాండులోని బాసింగ్‌స్టోక్ అనే గ్రామంలో నివసిస్తోంది. ఆమెకు 31 వారాల గర్భంతో ఉన్నప్పుడు పొట్టపై ఎర్రటి పొక్కులు, దురదలు, బొబ్బలు వచ్చాయి. అవి రోజులు గడిచేకొద్దీ తీవ్రమయ్యాయి. ప్రసవించిన తరువాత కూడా ఆమె పొట్టపై దురదలు, ఎర్రటి బొబ్బలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆ బొబ్బలు పగిలి స్రావాలు బయటికి వస్తూ ఇంకా ఇబ్బందిగా మారింది. గైనకాలజిస్టు సలహాత చర్మ వైద్యుడిని కలిసింది ఫియోనా. చెక్ చేసిన వైద్యులు ఆమెకు ఓ అరుదైన ఆరోగ్యపరిస్థితి ఉన్నట్టు తేల్చారు.
బిడ్డ డిఎన్ఏ వల్లే...
ఆమెను పరిక్షించిన వైద్యులు పెంఫిగోయిడ్ గెస్టోనియస్ (Pemphigoid Gestationis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తేల్చారు. గర్భం దాల్చిన యాభైవేల మంది మహిళల్లో ఒకరికి ఇది వచ్చే అవకాశం ఉంది. బిడ్డ డీఎన్ఏలోని జన్యువులకు ఆమె శరీరం ఇలా ప్రతిస్పందించి, రోగనిరోధక వ్యవస్థ స్వయానా ఆమె చర్మంపైనే దాడి చేస్తున్నట్టు చెప్పారు. ప్రసవ సమయంలో పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. ఎలాగోలా వైద్యులు ఆ బొబ్బలు ఉన్నా కూడా ప్రసవం సుఖాంతంగా చేశారు. పండంటి మగబిడ్డ పుట్టాడు. అప్పుడు నుంచే అసలు కథ మొదలైంది.
కొడుకుని ఎత్తుకున్నా కూడా...
బిడ్డ పుట్టాక పరిస్థితి సాధారణం అవుతుందని భావిస్తే అలా జరుగలేదు. మళ్లీ చేతులు, కాళ్లు, భుజాలు ఇలా ఎర్రటి దద్దుర్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకో అర్థం కాలేదు ఆ తల్లికి. మళ్లీ వైద్యులను సంప్రదించింది. వారు పరీక్షించి ఆ అరుదైన వ్యాధి ఇంకా ఆమె నుంచి పోలేదని గుర్తించారు. బిడ్డను ఎత్తుకోవడం వల్ల కూడా వస్తుందని, బిడ్డ శరీరం తల్లి శరీరానికి తాకిన ప్రతిచోటా బొబ్బలు, దద్దుర్లు వస్తాయని చెప్పారు. బిడ్డను ఎత్తుకోకుండా ఉంటే సమస్యా ఉండదని తెలిపారు. తొమ్మిది నెలలు కష్టపడి మోసి, ప్రాణాలను పణంగా పెట్టి ప్రసవించాక ఇప్పుడు బిడ్డను ముట్టుకోవద్దంటే తల్లి మనసుకు ఎలా ఉంటుంది? వైద్యుల మాటలు విన్ని ఫియోనాకు గుండెను పిండేస్తున్నట్టు అనిపించింది. బిడ్డను ముట్టుకోకుండా ఉండలేనని చెప్పడంతో వైద్యులు ఆమెకు స్టెరాయిడ్స్ వాడాలని సూచించారు. రోజూ వీటిని వాడితేనే ఆమెకు బొబ్బర్లు అదుపులో ఉంటాయని చెప్పారు. ఫియోనా వాటిని వాడుతూ కొడుకుని ఎత్తుకుంటోంది. ఒక ఆరునెలలు వాడాక అలెర్జీలు తగ్గడం ప్రారంభించాయి. కానీ మందులు వాడకపోతే మళ్లీ వచ్చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆ అలెర్జీ పూర్తిగా తగ్గిపోయి తన కొడుకుతో సంతోషంగా ఆడుకునే రోజు వస్తుందని ఎదురుచూస్తోంది ఫియోనా.
Also Read: మీ ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింకులు వల్ల గుండె పోటు వచ్చే అవకాశం, హార్వర్డ్ పరిశోధన ఫలితం
Also Read: ఇలాంటి వాగ్ధానాలు చేస్తే ఎవరు మాత్రం పడిపోరు, హ్యాపీ ప్రామిస్ డే