(Source: ECI/ABP News/ABP Majha)
Long Covid: ఆ రోగులలో కేవలం శ్వాసఆడకపోవడమే కాదు, ఇంకా ఎన్నో సమస్యలు ఉండే అవకాశం... చెబుతున్న కొత్త అధ్యయనం
కోవిడ్ కొందరిలో అలా వచ్చి ఇలా పోతోంది, కానీ కొందరిని దీర్ఘకాలంగా వేధిస్తోంది.
కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యాక నాలుగు వారాల తరువాత కూడా కొందరిలో లక్షణాలు తగ్గవు. అలాంటివారినే దీర్ఘకాల కరోనా రోగులు అంటాం. కొందరిలో నెలల తరబడి దాని ప్రభావం కనిపిస్తూనే ఉంటోంది. వీరిలో చాలా మందిని వేధించే సమస్య ఊపిరి అందకపోవడం. వీరు ఊపిరి తీసుకునేందుకు కష్టపడుతుంటారు. కరోనా వైరస్ సోకాక ఆసుపత్రిలో చేరాల్చిన అవసరం రాని వారిలో కూడా దీర్ఘకాల కరోనా లక్షణాలు కనిపించాయి. వారిలో సాధారణ పరీక్షలతో బయటపడని మరిన్ని సమస్యలు ఉండవచ్చని భావిస్తున్నారు పరిశోధకులు. ఊపిరితిత్తులపై ప్రభావం అధికంగానే పడి ఉండవచ్చని, ఆ అసాధారణ ప్రభావాలను కనిపెట్టేందుకు అధ్యయనం నిర్వహించారు ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు.
నెలల తరబడి ఊపిరి ఆడకపోవడం అనే సమస్య బాధపడుతున్న కరోనా రోగులలో ఇతర ప్రభావాలను తెలుసుకునేందుకు జినాన్ గ్యాస్ స్కాన్ పద్ధతిని ఉపయోగించారు. 36 మంది రోగులపై దీన్ని నిర్వహించారు. ఇందులో రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులలో గ్యాస్ బదిలీ గణనీయంగా బలహీనపడుతున్నట్టు కనిపెట్టారు. అందుకే వారికి ఊపిరి అందడం కూడా కష్టంగా మారుతోంది. ఇదే ఊపిరితిత్తులను అసాధారణంగా పనిచేసేలా చేస్తుంది.
ఆ పరీక్షలు తేల్చవు...
ఊపిరితిత్తుల్లోని ఇబ్బందులను సీటీస్కాన్ ల్లాంటివి గుర్తించలేవని చెబుతున్నారు అధ్యయనకర్తలు. జినాన్ ఎమ్ఆర్ఐ స్కాన్ లు ఆ విషయాన్ని గుర్తించగలవు. దీర్ఘకాలం పాటూ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో ఊపిరితిత్తుల్లో అసాధారణ లక్షణాలు ఉన్నాయి అని తేల్చారు అధ్యయన ప్రధాన పరిశోధకులు ఫెర్గస్ గ్లీసన్. కొంతమంది రోగులు ఏడాది పాటూ కరోనా లక్షణాలను ఎదుర్కొంటున్నారని కూడా ఆయన చెప్పారు. ఈ అంశంపై ఇంకా లోతైన పరిశోధనలు అవసరమని అందుకు 400 మంది దీర్ఘకాల కరోనా రోగులు అవసరం పడతారని ఆయన చెప్పారు.
ఒక్క బ్రిటన్లోనే పదిలక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు కొన్ని నెలల పాటూ కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. వారందరిలోనూ శ్వాసఆడకపోవడం అనే లక్షణం ఉంది. మిగతా దేశాలలో ఉన్న వారితో కలిపితే దీర్ఘకాల కోవిడ్ తో బాధపడే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: వంటగదిలో ఈ తప్పులు మీరు చేస్తున్నారా... ఆరోగ్యానికి ముప్పు తప్పదు