BitterGourd Chips: కాకరకాయ చిప్స్, డయాబెటిక్ రోగులకు బెస్ట్ చిరుతిండి
డయాబెటిక్ వారికి కాకరకాయలతో చేసిన వంటకాలు చాలా మేలు చేస్తాయి.
ఆలూ చిప్స్, అరటి కాయ చిప్స్‌లాగే కాకరకాయలను చిప్స్‌గా వండుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ చిప్స్ చాలా నచ్చేస్తాయి.అది కూడా ఇంట్లోనే వండుకుంటాం కాబట్టి ఎన్ని తిన్నా ఫర్వాలేదు. కాకరకాయతో చేసిన వంటలు ఏవైనా మధుమేహులకు మేలే చేస్తాయి.
కావాల్సిన పదార్థాలు
కాకరకాయలు - వంద గ్రాములు
పసుపు - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
కారం - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
బియ్యప్పిండి - యాభై గ్రాములు
కార్న్ ఫ్లోర్ - యాభై గ్రాములు
తయారీ ఇలా
1. కారకకాయలను బాగా శుభ్రం చేసి గుండ్రంగా కట్ చేసుకోవాలి. మధ్యలో గింజలను తీసి వేయాలి.
2. అప్పుడు చక్రాల్లా వస్తాయి కాకరకాయ ముక్కలు.
3. వాటిని ఉప్పు కలిపిన నీళ్లలో అయిదు నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేదు పోతుంది.
4. నీటిని వడకట్టేసి గుండ్రని కాకరముక్కలను ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. ఆ గిన్నెలో జీలకర్ర పొడి, పసుపు, కారం, ధనియాల పొడి, కాస్త ఉప్పు వేసి కలపాలి.
6. బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ముక్కలకు పట్టేలా కలపాలి.
7. ఇప్పుడు కళాయిలో నూనె వేసి బాగా వేడెక్కనివ్వాలి.
8. అందులో కాకరకాయ ముక్కలను వేసి వేయించాలి.
9. క్రిస్పీగా వేపుకున్నాక తీసి ఆయిల్ పీల్చే కాగితంపై వేయాలి.
10. నూనె మొత్తం పీల్చుకున్నాక వాటిని తినేయడమే.
కాకరకాయతో లాభాలు
కాకరకాయ తినడం వల్ల యాంటీఆక్సిడెంట్లు అధికంగా శరీరానికి అందుతాయి. ఇవి శరీరంలో చేరిన టాక్సిన్లను, వైరస్, బ్యాక్టిరియాలను బయటికి పంపేందుకు సహకరిస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున మలబద్ధకం సమస్య రాదు. డయాబెటిస్ ఉన్న వారికి కాకరకాయ వంటకాలు చాలా ఉత్తమమైనవి. రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరగకుండా అడ్డుకుంటుంది. దీనిలో ఉన్న లెక్టిన్ ఆకలి అధికంగా వేయకుండా అడ్డుకుంటుంది. అలెర్జీలను అడ్డుకోవడంలో కూడా ముందుంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్తమా, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు, జలుబు వంటి సమస్యలను కూడా కాకరకాయలోని సుగుణాలు తగ్గిస్తాయి. ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, మలబద్ధకం, మూత్రపిండాల సమస్యలకు చెక్ పెడుతాయి కాకరలోని పోషకాలు.
Also read: ఏడాదికి రూ.61 లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగం, అయిదేళ్ల వయసు దాటిన ఎవరైనా అప్లయ్ చేయచ్చు