Justin Bieber: జస్టిన్ బీబర్‌కు ముఖ పక్షవాతం, ‘రామ్సే హంట్’ వ్యాధి మీకూ రావచ్చు, లక్షణాలివే!
జస్టిన్ బీబర్‌కు వచ్చిన ఫేషియల్ పేరాలసిస్ మీకు కూడా రావచ్చు. కాబట్టి, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి.
కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్(Justin Bieber).. ముఖ పక్షవాతం(facial paralysis)తో బాధ పడుతున్నాడు. దీని వల్ల ఆయన ముఖంలోని కుడివైపు భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ బైబర్ శనివారం (జూన్ 11న) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘‘నా కన్ను ఒకటి కొట్టుకోవడం లేదు. నా ముఖంలో ఒక వైపు నుంచి నవ్వలేకపోతున్నా. నా ముఖంలో ఒక వైపు పూర్తిగా పక్షవాతానికి గురైంది’’ అని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన టూర్స్, ఈవెంట్స్‌ను రద్దు చేసుకున్నాడు. ఈ వీడియో చూసి బీబర్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఫిట్‌నెస్ విషయంలో ఎంతో కచ్చితంగా ఉండే బీపర్‌కు ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏమిటి? ఈ సమస్య మనకు కూడా రావచ్చా?
ఔను, ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చు. దీన్ని ‘రామ్సే హంట్ సిండ్రోమ్’ (Ramsay Hunt Syndrome) లేదా హెర్పెస్ జోస్టర్ ఒటికస్ (herpes zoster oticus) అని అంటారు. ఇది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల ముఖ నరాలు పక్షవాతానికి గురవ్వుతాయి. సాధారణంగా చెవి లేదా నోటిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో చెవులలో రింగింగ్, వినికిడి లోపాన్ని కలిగిస్తుంది.
‘రామ్సే హంట్ సిండ్రోమ్’ (Ramsay Hunt Syndrome) లక్షణాలు, కారణాలివే:
View this post on Instagram
కారణం ఏమిటీ?: బీబర్ ఇదివరకు కరోనా వైరస్‌కు గురయ్యాడు. దానివల్ల ఏర్పడిన సైడ్ ఎఫెక్ట్స్‌లో ఇది కూడా ఒకటి. కరోనా వైరస్ వల్ల తనకు ముఖ పక్షవాతం (facial paralysis) వచ్చిందని బీబర్ తెలిపాడు. ఇది కాకుండా ముఖ పక్షవాతానికి అనేక కారణాలు ఉన్నాయి. పిల్లల్లో అమ్మవారు లేదా చికెన్‌పాక్స్, పెద్దలలో షింగిల్స్(మశూచి)కు కారణమయ్యే వరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల ఇది ఏర్పడుతుంది. చెవికి సమీపంలో ఉన్న ముఖ నాడికి షింగిల్స్ వ్యాప్తి చెందినప్పుడు ఇది ఏర్పడుతుంది. దీనివల్ల ఆ భాగంలో దద్దర్లు ఏర్పడతాయి. అది తీవ్రమైతే ముఖ పక్షవాతం, వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది.
వృద్ధుల్లో ఇది సాధారణం: 60 ఏళ్లు పైబడిన వారిలో సర్వసాధారణంగా ఏర్పడే సమస్య ఇది. చికెన్‌పాక్స్‌కు గురైనవారిలో ముఖ నరాలలో ఈ వైరస్ నివసిస్తుంది. కొన్నేళ్ల తర్వాత అవి యాక్టీవ్ అవుతాయి. ఫలితంగా ‘రామ్‌సే హంట్ సిండ్రోమ్’ ఏర్పడుతుంది. ‘న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. ప్రతి 100,000 మందిలో 5 నుంచి 10 మందికి ‘రామ్‌సే హంట్ సిండ్రోమ్’ ఏర్పడుతుందని అంచనా.
‘రామ్సే హంట్ సిండ్రోమ్’ లక్షణాలు ఇవే:
⦿ చెవి చుట్టూ ఎరుపు రంగులో మారడం.
⦿ ముఖంలోని ఒక భాగం వద్ద నీటి బిందువుల్లాంటి దద్దుర్లు.
⦿ ముఖం బలహీనంగా అనిపించడం.
⦿ ముఖంలోని ఒక భాగం పక్షవాతానికి గురికావడం.
⦿ చెవి నొప్పి, వినికిడి లోపం, టిన్నిటస్, నోరు, కళ్ళు పొడిబారడం.
⦿ ఒక కన్ను మూసుకోవడం కష్టంగా మారడం.
ఇది అంటువ్యాధా?: ‘రామ్‌సే హంట్ సిండ్రోమ్’ అంటువ్యాధి కాదు. మన శరీరంలో ఉండే వైరస్ యాక్టీవ్ కావడం వల్ల ఏర్పడే వ్యాధి. ముఖ్యంగా చికెన్‌పాక్స్ వచ్చినవారిలో ఈ వైరస్ తిష్ట వేస్తుంది. చికెన్‌పాక్స్ సరైన మందులు లేదా వ్యాక్సిన్స్ తీసుకోని వ్యక్తుల్లో ఈ వైరస్ ఉంటుంది. ఈ వైరస్ వల్ల ఏర్పడే ముఖ పక్షవాతం కొందరిలో తాత్కాలికంగానే ఉంటుంది. మరికొందరిలో మాత్రం శాస్వతంగా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి వైద్యులు యాంటీ-వైరల్ మందులు ఇస్తారు. మరింత తీవ్రమైతే స్టెరాయిడ్‌లను సూచిస్తారు. ఎప్పటికప్పుడు ముఖ వ్యాయామాలు చేయడం ద్వారా ఈ పక్షవాతం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also Read: చేపలు తింటే చర్మ క్యాన్సర్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు
కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల కూడా ముఖ పక్షవాతం వస్తుందా?: ‘కోవిడ్-19’ వ్యాక్సిన్, రామ్‌సే హంట్ సిండ్రోమ్‌కు సంబంధం ఉండవచ్చని పలు అధ్యయనాలు ఇదివరకే చెప్పాయి. గుజరాత్ అదానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన అధ్యయనంలో కోవిడ్-19 వ్యాక్సిన్, షింగిల్స్‌కు లింక్ ఉండవచ్చని పేర్కొంది. టులేన్ సెంటర్ ఫర్ క్లినికల్ న్యూరోసైన్సెస్, టులేన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన న్యూరోసర్జరీ బృందం నిర్వహించిన మరో అధ్యయనంలో వ్యాక్సిన్ సంబంధిత హెర్పెస్ జోస్టర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదైనట్లు పేర్కొన్నాయి.
Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి