Inspiring story of Cancer Survivor: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత
అతడి వయసు 23 ఏళ్లు... అందులో నాలుగేళ్లు పూర్తిగా ఆసుపత్రిలోనే గడిపాడు. తిరగబడుతున్న క్యాన్సర్ తో మళ్లీ మళ్లీ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతడో విజేత.
చిన్నచీమ మీద చుక్క నీరు పోసి చూడండి... ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నిస్తుందో...
సీతాకోకచిలుక రెక్కలను పట్టుకోండి... ఆ పట్టును విడిపించుకుని స్వేచ్ఛగా ఎగిరేందుకు ఎంత పెనుగులాడుతుందో....
వీటి పోరాటం వెనుక ఉన్నది ఒక్కటే... బతకాలన్న ఆశ.
ఆ ఆశే తనను బతికించిందని చెబుతాడు జయంత్ కండోయ్. ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన యువకుడు, నాలుగేళ్ల పాటూ ఆసుపత్రిలోనే గడిపిన వ్యక్తి. గత ఎనిమిదేళ్లలో మూడు రకాల క్యాన్సర్లు జయంత్ పై దాడిచేశాయి. చాలా మంది బంధువులు ఎందుకింత బాధ అనుభవించడం, ప్రాణాలు వదిలేయడమే ఉత్తమం అని సలహాలు ఇచ్చారు. జయంత్ తల్లిదండ్రులతో ‘అతడు బతకడు, ఎక్కడైనా స్వచ్ఛంద సంస్థలో వదిలేసి వచ్చేయండి. ఎన్నాళ్లిలా క్యాన్సర్ తో పోరాడతాడు’అని వారిని మరింత ఏడిపించారు. అయినా సరే జయంత్ ఎక్కడా ఆశను కోల్పోలేదు. అతడి తల్లిదండ్రులు కూడా అంతే ధైర్యంగా అలుపెరగకుండా క్యాన్సర్ చికిత్సలు చేయిస్తూనే వచ్చారు. ప్రస్తుతం మనదేశంలో ఆరు సార్లు క్యాన్సర్ పై గెలిచి ప్రాణాలు నిలుపుకున్న వ్యక్తి జయంత్. ఇప్పడు అతనో స్పూర్తి ప్రదాత. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ ఆత్మహత్య చేసుకునే చాలా మందికి అతని జీవితం స్పూర్తి కావాలి. క్యాన్సర్ తో బాధపడే వాళ్లకి జయంత్ గురించి తెలిసి బతుకుపై ఆశ పెరగాలి.
జయంత్ ది రాజస్థాన్ లోని అజ్మీర్. ప్రస్తుతం అతని వయసు 23 ఏళ్లు. బరువు మాత్రం 36 కిలోలకు మించి ఉండడు. మనిషి చూడటానికి నీరసంగా రోగిలా కనిపిస్తున్నా... మాటల్లో మాత్రం ఎక్కడలేనంత ఆత్మవిశ్వాసం, ధైర్యం. ‘నా జీవితంలో ఆరు సార్లు చావు అంచుల దాకా వెళ్లి వచ్చా... ఇంతకన్నా భయపెట్టేది, భయపడాల్సింది ఇంకేముంది?’ అంటాడు చిరునవ్వుతో జయంత్.
తొమ్మిదో తరగతి వరకు జయంత్ కు ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవు. 2013లో పదోతరగతిలో ఉండగా మెడకు ఎడమ వైపు చిన్న కణితిలా వచ్చింది. అది పెరిగి పెద్దదవుతుండడంతో వైద్యులకు చూపించారు. దాన్ని లింఫోమా క్యాన్సర్ గా చెప్పారు. జైపూర్ లో ఆరు సార్లు కీమోథెరపీలు, రేడియోథెరపీలు చేయించుకున్నాడు. ఏడాది తరువాత క్యాన్సర్ పోయిందని చెప్పారు వైద్యులు. మళ్లీ చదువు ప్రారంభించాడు. ఇంటర్లో ఉండగా ఈసారి కుడి వైపు వచ్చింది. మొదటి స్టేజ్ కావడంతో కీమోథెరపీలతో చికిత్స ముగించారు. క్యాన్సర్ ఫ్రీ అని చెప్పారు.
మళ్లీ తిరగబడినా...
రెండేళ్ల తరువాత కడుపులో విపరీతంగా నొప్పి వస్తుండడంతో వైద్యులను కలిశారు. పరీక్షల్లో పాంక్రియాస్ లో క్యాన్సర్ వచ్చినట్టు తేలింది. దాన్ని తొలగించేందుకు పొట్ట మీద కోత అవసరమని చెప్పారు వైద్యులు. దానికి జయంత్ కీమోథెరపీతో మొదట ప్రయత్నించమని డాక్టర్లను కోరారు. అలా ఓరల్ కీమోథెరపీతోనే దానికి చికిత్స చేశారు. కానీ క్యాన్సర్ పుండు మళ్లీ పాంక్రియాస్ లో 2019లో ఒకసారి, 2020లో ఒకసారి రీలాప్స్ అయ్యింది. ఆ రెండు సార్లు కూడా ఓరల్ కీమో థెరపీనే కొనసాగించారు వైద్యులు. విజయవంతంగా పుండును మాన్పించారు.
కీమోథెరపీ చికిత్స చాలా బాధాకరమైనది. పదిహేనేళ్ల వయసు నుంచి 23 ఏళ్ల వయసు వరకు ఆ చికిత్సను భరిస్తూనే ఉన్నాడు జయంత్. అయినా ఎప్పుడూ జీవితంపై ఆశను వదులుకోలేదు.
ఆ దేవుడు జయంత్ ను మళ్లీ పరీక్షించాడు. గతేడాది కరోనా కాటేసిన కాలంలోనే పొత్తి కడుపు దగ్గర క్యాన్సర్ దాడి చేసింది. అది కీమోథెరపీతో పోయేది కాదు, చాలా ప్రమాదకరమైనది. అందుకే ‘బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్’ చేశారు. ఎముక మజ్జ సాగదీత మాత్రం విపరీతంగా బాధపెట్టింది జయంత్ ని. ఆ నొప్పీ, బాధ మాటల్లో చెప్పలేనంటాడు. ఈ ఏడాదే ‘బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్’ జరిగింది. అది కూడా సక్సెస్ ఫుల్ అయింది.
సొంతంగా ఎన్జీవో...
క్యాన్సర్ చికిత్స తీసుకుంటూనే తన లాంటి వాళ్లకోసం ఒక ఎన్జీవో స్థాపించాడు జయంత్. అందులో 350 మంది వాలంటీర్లు ఉన్నారు. క్యాన్సర్తో బాధపడేవారికి మనోధైర్యాన్ని నింపడం, విరాళాలు సేకరించడం, బలమైన ఆహారాన్ని అందించడం లాంటి పనులు వారు చేస్తారు.
జయంత్ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం ఎంబీఏ కూడా చదువుతున్నాడు. భవిష్యత్తులో క్యాన్సర్ మళ్లీ రాదనే ఆశతో ఉన్నాడు. ప్రస్తుతం అతను మోటివేషనల్ స్పీకర్ గా, పుస్తక రచయితగా మారాడు. తన జీవితాన్నే ఉదాహరణగా చూపించి ఆత్మహత్యలు చేసుకునేవాళ్లు, మహమ్మారి రోగాలతో బాధపడేవారికి ఆత్మస్థైర్యాన్ని నింపే బాధ్యతను చేపట్టాడు.
View this post on Instagram
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: ఆన్ లైన్ లో స్పెర్మ్ ఆర్డర్... తొమ్మిది నెలల తరువాత పండంటి బిడ్డ
Also read: సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ అదుర్స్... విడుదల ఎప్పుడంటే... చిరు ట్వీట్
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం