Male Breast Cancer: రొమ్ముక్యాన్సర్ ఆడవారికే వస్తుందనుకుంటే మీ భ్రమే, మగవారికీ వచ్చే ఛాన్స్, లక్షణాలు ఇలా ఉంటాయి
రొమ్ము క్యాన్సర్ అనగానే ఆడవారికి వచ్చే రోగంగానే చూస్తారు. అది చాలా అరుదైన సందర్భాల్లో మగవారికీ వస్తుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేది అధికంగా ఆడవారే. పురుషులకు ఈ క్యాన్సర్ గురించి అవగాహన ఉండదు. అది మాకు రాదులే అన్న ధీమాతో ఉంటారు. నిజానికి మగవారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చ అవకాశాలు ఉన్నాయి.ఆడవారికి ఇది ఎంత ప్రమాదకరమో, మగవారికి కూడా అంతే ప్రమాదకరం. ఇది రొమ్ము కణజాలంలో ఏర్పడే అరుదైన క్యాన్సర్. వారసత్వంగా కూడా వస్తుంది. రొమ్ములు ఆడవారికే ఉంటాయి కదా అని ఆలోచించకండి. మగవారికి కూడా రొమ్ములు ఉంటాయి, కాకపోతే వాటిలో వయసుతో పాటూ పెరుగుదల ఉండదు. ఆడవారిలో వయసు పెరగుతున్న కొద్దీ రొమ్ములు పెరుగుతాయి.
మగవారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్ కాస్త భిన్నమైనది. యువకుల్లో ఇది వచ్చే అవకాశం తక్కువ. వృద్ధులైన పురుషుల్లో ఇది వచ్చే ఛాన్సులు ఉంటాయి. మగవారిలో ఎందుకు వస్తుందనే విషయంపై వైద్యులు స్పష్టంగా కారణాలు చెప్పలేకపోతున్నార. ఇప్పటివరకు చేసిన అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ కణాలు పుట్టినప్పుడు, రొమ్ముకణాలు వేగంగా విభజనకు గురవుతున్నప్పుడు క్యాన్సర్ త్వరగా వ్యాపిస్తుంది.
మగవారిలో రొమ్ముక్యాన్సర్ లక్షణాలు
1. రొమ్ము లోపల ముద్ద లేదా చిన్న కణితుల్లా చేతికి తగులుతాయి.
2.రొమ్ము చుట్టూ చర్మం రంగు మారిపోతుంది. అక్కడ ఆకారం కూడా మారుతుంది.
3. చనుమొనల చుట్టూ ఎరుపుదనం రావడం, పొరలుపొరలుగా ఊడడం
4. చనుమొనల నుంచి స్రావాలు కారడం
యుక్తవయసు వచ్చే సమయానికి స్త్రీల రొమ్ములో కణజాలాలు పాలగ్రంథులు, కొవ్వును అభివృద్ధి చేసే పనిలో ఉంటాయి. కానీ మగవారి రొమ్ములలో ఇలాంటివేమీ జరగవు. అందుకే వీరి క్యాన్సర్ కాస్త భిన్నం. మగవారికి మూడు రకాల బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.
1. మిల్క్ డక్ట్ క్యాన్సర్... దీన్ని డక్టల్ కార్సినోమా అని కూడా పిలుస్తారు. ఇది మగవారిలో వచ్చే అత్యంత సాధారణమైన రొమ్ముక్యాన్సర్ ఇది.
2. మిల్క్ గ్లాండ్ క్యాన్సర్... పురుషుల్లో పాల గ్రంథులు లేనప్పటికీ ఆ గ్రంథుల్లోని టిష్యూలను ప్రభావితం చేస్తుంది.
3. నిపల్ క్యాన్సర్... రొమ్ము చనుమొనలకు వచ్చే క్యాన్సర్ ఇది.
చికిత్స ఇలా...
అన్ని క్యాన్సర్లలో చేసినట్టే మగవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే కీమోథెరపీ, హార్మోనల్ థెరపీ, రేడియేషన్ థెరపీలు ఇస్తారు. మాస్టెక్టమీ సర్జరీ కూడా చేసే అవకాశం ఉంది. టార్గెటెడ్ సెల్ థెరపీ ద్వారా కూడా చికిత్స చేస్తారు. ఈ చికిత్సలు క్యాన్సర్ ఏ స్టేజీలో ఉంది అన్న విషయంపై ఆధారపడి ఉంటాయి.
Also read: ఆడదోమలు మాత్రమే ఎందుకు కుడతాయి? రక్తం లేకుండా అవి బతకలేవా?