Grow Coriander in Water : 15 రోజుల్లోనే కొత్తిమీరను పెంచవచ్చు తెలుసా? మట్టి లేకున్నా.. నీటిలోనే పెంచేయండిలా
Grow Coriander at Home : సరైన పద్ధతి తెలిస్తే ఇంట్లోనే కొత్తిమీర ఈజీగా పెంచుకోవచ్చు. మట్టి లేకుండా కేవలం నీటితో కూడా 15 రోజుల్లో కొత్తమీరను పెంచుకోవచ్చు. ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.

- మట్టి లేకుండా నీటిలో కొత్తిమీరను 15 రోజుల్లో పెంచవచ్చు.
- ధనియాలను నలిపి, నీటిలో నానబెట్టి, కిటికీ వద్ద ఉంచండి.
- వేర్లు, ఆకులు కనిపించాక నీటిలో ఉంచి, ఎరువు వేయండి.
- 4-5 అంగుళాలు పెరిగాక కొత్తిమీరను కోయడం ప్రారంభించండి.
Grow Fresh Coriander at Home : ఇంట్లో తాజా ఆకుకూరలు పెంచుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే ప్లేస్ లేకపోవడం, మట్టి కొరత వల్ల చాలామంది వాటిని పెంచుకునేందుకు వెనకాడతారు. కానీ నీటిలో కూడా కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు. అలాంటి వాటిలో కొత్తిమీర కూడా ఒకటి. దీనిని మట్టిలోనే కాదు.. నీటిలో కూడా పెంచుకోవచ్చు. ఎక్కువ ఖర్చు, కెమికల్స్ లేకుండా.. సరైన పద్ధతిలో 15 రోజుల్లోనే తాజా కొత్తిమీరను ఇంట్లో పెంచవచ్చు.
కావాల్సినవి
ధనియాలు
గాజు జార్ లేదా గిన్నె
శుభ్రమైన తాగునీరు
మస్లిన్ క్లాత్ లేదా రంధ్రాలున్న మూత
కాస్త సూర్యకాంతి (వంటింటి కిటికీ పక్కన పెట్టవచ్చు)
దశల వారీగా పెంచే విధానం
ముందుగా ధనియాలను అరచేతులతో నలిపి.. రెండు విడిభాగాలుగా మార్చాలి. ఇలా చేస్తే మొక్క త్వరగా మొలకెత్తడానికి సాయపడుతుంది. మరి ఎక్కువ బలంగా నలపకూడదు జాగ్రత్త. ఇలా వేరు చేసిన విత్తనాలను నీళ్లలో 12–24 గంటలు నానబెట్టాలి. దీనివల్ల పైపొర మెత్తబడి మొలకెత్తే ప్రక్రియ మొదలవుతుంది. తర్వాత నీళ్లు వడబోయండి.
విత్తనాలు నీళ్లలో మునిగిపోకూడదు..
ఇప్పుడు వెడల్పైన జార్ లేదా ట్రాన్స్పరెంట్ గిన్నె తీసుకోండి. దానిని శుభ్రంగా కడిగి శుభ్రమైన నీరు గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు వేయాలి. ఇప్పుడు దానిపై మస్లిన్ క్లాత్ వేసి.. నానిన విత్తనాలు వేయాలి. విత్తనాలు నీళ్ల ఉపరితలం తాకితే సరిపోతుంది. మునిగిపోకూడదు. ఇలా చేస్తే తడి అందుతూ ధనియాలు మొలకెత్తుతాయి. ఇప్పుడు దీనిని ఇంట్లో సూర్యకాంతి వచ్చే చోట పెట్టండి. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి.
నీరు మారుస్తూ ఉండాలి
3 నుంచి 5 రోజుల్లో తెల్లని వేళ్ళు కనిపిస్తాయి. విత్తనాలు తడిగా ఉండేలా మెల్లగా నీళ్ళు చల్లండి. రెండు రోజులకోసారి నీళ్లు మార్చండి. వేళ్లు పొడవుగా పెరిగి ఆకులు కనిపించడం మొదలైన తర్వాత — వేళ్లు నీళ్లలో మునిగే విధంగా.. ఆకులు నీళ్లకు పైన ఉండేలా పాత్రలో పెట్టండి. రెండు మూడు రోజులకోసారి నీళ్ళు నింపండి. వారానికి రెండుసార్లు పూర్తిగా మారుస్తూ ఉండండి.
ఇలా చేస్తే 10 నుంచి 12 రోజులకోసారి కొద్దిగా సేంద్రీయ ద్రవ ఎరువు వేస్తే వేగంగా పెరుగుతుంది. మొక్క 4 నుంచి 5 అంగుళాల ఎత్తుకు పెరిగిన తర్వాత పైనుంచి కోయడం మొదలుపెట్టవచ్చు. పైనుంచి కోస్తే మొక్క పొదలాగా దట్టంగా పెరుగుతుంది. ఒకేసారి మూడో వంతు కంటే ఎక్కువ కోయకండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























